ప్రబలుతున్న వ్యాధులు

ABN , First Publish Date - 2022-06-23T06:54:00+05:30 IST

జిల్లాలో వర్షాకాలం మొదలుకావడంతో సీజనల్‌ వ్యాధులు మొదలవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా ప్రబలే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. హైరిస్క్‌ ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. గత సంవత్సరం ఎక్కువ కేసులు రావడంతో ఈ దఫా ముందుగానే అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రబలుతున్న వ్యాధులు

జిల్లాలో మొదలైన సీజనల్‌ వ్యాధులు

డెంగ్యూ, మలేరియాపై యంత్రాంగం నజర్‌

పీహెచ్‌సీల వారీగా చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

నిజామాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వర్షాకాలం మొదలుకావడంతో సీజనల్‌ వ్యాధులు మొదలవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా ప్రబలే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. హైరిస్క్‌ ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. గత సంవత్సరం ఎక్కువ కేసులు రావడంతో ఈ దఫా ముందుగానే అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో వైద్య ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు కాలనీల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. మలేరియా, వైద్య ఆరోగ్య సిబ్బందిని పంపిస్తూ శాంపిల్స్‌ను సేకరించడంతో పాటు ప్రధానంగా వచ్చే ప్రాంతాలపై నజర్‌పెట్టి పనిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులు తగ్గించేందుకు శాఖాపరమైన  చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో ముందస్తుగా శాఖ తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

ఫ మొదలైన వర్షాలు..

జిల్లాలో వర్షాకాలం ప్రారంభమైంది. కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. జల్లుల నుంచి ఓ మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి. జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జిల్లాలో జూన్‌ నుంచి ఆగస్టు వరకు సీజనల్‌ వ్యాధులు మొదలవుతున్నాయి. ఈ సమయంలోనే డెంగ్యూ, మలేరియాకు సంబంధించిన కేసులు వస్తున్నాయి. టైఫాయిడ్‌, ఇతర జ్వరాల తీవ్రత కూడా పెరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్‌ నగరం పరిధిలో ఎక్కువ కేసులు వస్తున్నాయి. గత సంవత్సరం వర్షాకాలం సీజన్‌లో నగరం పరిధిలోని వందకు పైగా కేసులు వచ్చాయి. బోధన్‌, ఎడపల్లి, నిజామాబాద్‌ రూరల్‌, మోపాల్‌, కమ్మర్‌పల్లి, డిచ్‌పల్లి, ఆర్మూర్‌ పరిధిలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా శివారు కాలనీలు, నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కేసులు బాగా వచ్చాయి. వందలాది మందికి డెంగ్యూ లక్షణాలు కనిపించాయి. కరోనా ఉండడంతో గత సంవత్సరం ప్రజలు కొంత అప్రమత్తంగా ఉన్నా కేసులు మాత్రం తగ్గలేదు. జిల్లాలో భారీగానే నమోదయ్యాయి. ఎక్కువమంది కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేలకు వేలు డెంగ్యూకు ఖర్చుపెట్టారు. గత సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినా ఎక్కువమంది ప్రైవేట్‌ను ఆశ్రయించారు. ఈ సంవత్సరం కూడా డెంగ్యూ లక్షణాలు ఉన్న కేసులు గత జనవరి నుంచి బయటపడుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అఽధికారులు కూడా ఆ ప్రాంతాలను గుర్తించారు. తాత్కాలికంగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఈ కేసులు రాకుండా చూడాలని నాలుగు రోజుల క్రితం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారు. పీహెచ్‌సీల వారీగా సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సీజన్‌లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు చేపడతామన్నారు.

ఫ అధికారుల సమీక్షలు..

జిల్లాలో వర్షకాలం సీజన్‌ మొదలు కావడంతో అధికారులు పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా అవగాహన కల్పించాలని సిబ్బందిని కోరుతున్నారు. గ్రామాల వారీగా తిరుగుతూ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు పరిసరాల పరిశుభ్రంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో కొంత వివరించినా ఈ మూడు నెలలు వ్యాధులకు కీలకం కావడంతో ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీహెచ్‌సీల వారీగా అవసరమైన సిబ్బంది తక్కువగానే ఉన్న వారితో చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గత జనవరి నుంచి ఈ జూన్‌ వరకు 17 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటిలో అన్ని నగరం పరిధిలోనే వచ్చాయి. నగరంలోని కొన్ని ఏరియాల్లో గత కొన్నేళ్లుగా ఈ కేసులు ఎక్కువగా వస్తుండడంతో ఆ పీహెచ్‌సీల పరిధిలో ఈ ప్రాంతాలను హైరిస్కుగా గుర్తించి చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీజనల్‌ వ్యాధులకు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కావాల్సిన మందులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. జ్వరాలు వచ్చిన వారికి రక్త నమూనాలు సేకరిండచంతో పాటు వెంటనే వాటిని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌కు పంపించి పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. పీహెచ్‌సీల వారీగా రౌండ్‌ ది క్లాక్‌ అందుబాటులో ఉండే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

ఫ ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఓపీ..

వారం రోజులుగా జిల్లాలోని ఆసుపత్రుల్లో ఓపీ పెరుగుతోంది. పీహెచ్‌సీల నుంచి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వరకు ఈ కేసులు వచ్చిన వారు వస్తున్నారు. వైద్యులతో చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉన్న సీజనల్‌ వ్యాధులు పెరుగుతుండడంతో వైద్యులు కూడా అందుబాటులో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా తీవ్రత కూడా కొంతమేర ఉండే అవకాశం ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ కూడా జిల్లా అధికారులను అప్రమత్తంగా ఉండాలని కోరారు. సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా కూడా ప్రబలే అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో హైరిస్కు ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై నజర్‌పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి కొంత కట్టడి చేస్తే డెంగ్యూ, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. జిల్లాలో సీజన్‌ కావడంతో అన్ని ఆసుపత్రుల పరిధిలో అవగాహన కల్పిస్తున్నామని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ తెలిపారు. గత జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కొన్ని డెంగ్యూ కేసులు నమోదైనా, మే, జూన్‌లో మాత్రం నమోదుకాలేదని ఆయన తెలిపారు. ఈ కేసులతో పాటు మలేరియా కూడా ప్రబలకుండా చర్యలు చేపట్టామన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Updated Date - 2022-06-23T06:54:00+05:30 IST