ఓపీలు బంద్‌

ABN , First Publish Date - 2020-04-02T08:33:35+05:30 IST

ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో.. ఉన్న ఇన్‌పేషంట్లకు వైద్య సేవలందించడం మినహా కొత్తగా రోగులు వచ్చే పరిస్థితి లేదు. గైనిక్‌, హార్ట్‌, న్యూరో కేసులు మాత్రమే కొద్దిగా వస్తున్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు...

ఓపీలు బంద్‌

  • కరోనా దెబ్బకు ఆస్పత్రులు మూత
  • 90 శాతం దాకా తగ్గిన ఓపీ కేసులు
  • నిర్వహణ కష్టమే..


ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో.. ఉన్న ఇన్‌పేషంట్లకు వైద్య సేవలందించడం మినహా కొత్తగా రోగులు వచ్చే పరిస్థితి లేదు. గైనిక్‌, హార్ట్‌, న్యూరో కేసులు మాత్రమే కొద్దిగా వస్తున్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. బడా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వచ్చే ఆదాయంలో సింహభాగం.. రోడ్డు ప్రమాదాల కేసులు, ఓపీ కేసులకు చేసే ఇన్వెస్టిగేషన్స్‌ నుంచే వస్తుంది. విదేశీ పేషెంట్లు కూడా భారీగానే వస్తారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల కేసులు దాదాపుగా జీరో అయ్యాయి. అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపివేయడంతో విదేశీ పేషెంట్ల రాక ఆగిపోయింది. దానికితోడు ఓపీ ఆగిపోవడంతో ఆదాయం తగ్గి నిర్వహణ కష్టమవుతోంది.


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బ ఆస్పత్రులపైనా పడుతోంది. వైరస్‌ భయంతో ప్రజలు ఆస్పత్రులకు రావడానికి సంశయిస్తుండడం.. వద్దామనుకున్నవారికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఔట్‌పేషెంట్‌ విభాగాలు బంద్‌ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల ఓపీ విభాగాలు నిర్వహిస్తున్నా.. పేషెంట్లు లేక అవి వెలవెలబోతున్నాయి. దీంతో నిర్వహణ భారమై చిన్న/ఒక స్థాయి ఆస్పత్రులు మూతపడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో కొన్ని ఆస్పత్రులను ఇలాగే పేషెంట్లు లేక మూసేశారు. మెజారిటీ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అత్యవసరం మినహా సాధారణ ఓపీ బ్లాక్‌లు బంద్‌ చేశారు. ఉదాహరణకు.. సికింద్రాబాద్‌లో ఎప్పుడూ రోగులతో కిటకిటలాడే ఒక ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రి ఓపీ సేవలను నిలిపివేసింది.


కేవలం అత్యవసర కేసులను మాత్రమే చూస్తోంది. మరికొన్ని ఆస్పత్రులు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. కొన్ని మాత్రం చాలా లిమిటెడ్‌గా ఓపీ సేవలు అందిస్తున్నాయి. కొన్నేమో.. ముఖ్యమైన ఓపీ విభాగాలన్ని ఓకే చోట ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నాయి. ఓపీ చూసే ఆస్పత్రుల్లోనూ గతంతో పోలిస్తే అవుట్‌ పేషంట్ల రాక 90 శాతం తగ్గింది. నిత్యం 500-1000 మందికి ఓపీ సేవలు అందించే ఆస్పత్రులకు ఇప్పుడు 40-50 మందికి మించి రావట్లేదు. ఇన్‌పేషెంట్ల విషయానికి వస్తే.. రోజూ 50-60 మందిని చేర్చుకునే ఆస్పత్రుల్లో ఇప్పుడు రోజుకు ఒకరిద్దరు కూడా చేరట్లేదు. కొన్ని ఆస్పత్రులు ఆన్‌లైన్‌ పద్ధతిలో ఓపీ సేవలు అందిస్తున్నాయి. బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో మాత్రం రోజూ ఉదయం 9  నుంచి 12 గంటల వరకు ఓపీ రోగులను చూస్తున్నారు. 


కరోనా వార్డులు..

హైదరాబాద్‌ నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. దీంతో సాధారణ రోగులు ఆ ఆస్పత్రులకు రాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు, ఆ వార్డుల్లో పనిచేసేందుకు వైద్యులు, నర్సులు కూడా ఆసక్తి చూపట్లేదు. నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఇటీవల నర్సులకు స్ఫూర్తినిచ్చే మోటివేషన్‌ క్లాసులు నిర్వహించారు. అయితే, ఆ తరగతులకు హాజరైన నర్సుల్లో కొందరు భయంతో ఏడ్చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొంతమంది నర్సులు ఉద్యోగాలనే మానేస్తున్నారు. కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిన తరువాత మళ్లీ వచ్చే ఉద్దేశంతో తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.


ఆన్‌లైన్‌లో ఓపీ సేవలు

ప్రస్తుతానికి ఓపీ సేవలను టెలిఫోనిక్‌, వీడియో కన్సల్టేషన్‌ ద్వారా అందిస్తున్నాం. ప్రాణానికి ప్రమాదమున్న కేసుల్లో సేవలను అందిస్తున్నాం. అలాగే గైనిక్‌, డయాలసిస్‌ సేవలందిస్తున్నాం. స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారికి, అత్యవసర వైద్య సేవల కోసం వచ్చే వారికి మినహాయింపు ఇవ్వాలి.

-డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు, 

ఎండీ, కిమ్స్‌ ఆస్పత్రి


25 శాతం తగ్గిన సర్జరీలు

అపోలో ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ ఓపీ 30 శాతం తగ్గింది. శస్త్రచికిత్సలు 25ు తగ్గిపోయాయి. రోజూ 100-150 మంది రోగులకు టెలి కన్సల్టెన్సీ వైద్య సేవలను అందిస్తున్నాం. అత్యవసరమైన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. అవసరమైన వారు జ్ట్టిఞ://ుఽఝఛి.టజ/ఛిగీఈఠిఖ4 సైట్‌ ద్వారా మా సేవలు పొందవచ్చు.

- డాక్టర్‌ హరిప్రసాద్‌, ప్రెసిడెంట్‌, అపోలో ఆస్పత్రుల గ్రూప్‌


ఉచిత కన్సల్టేషన్‌

సాధారణ ఓపీ బంద్‌ చేశాం. అత్యవసర విభాగంలోనే నిర్వహిస్తున్నాం. మామూలు పేషెంట్లు 040-44550000 నంబర్‌కు ఫోన్‌ చేసి ఉచిత కన్సల్టేషన్‌ పొందవచ్చు. ఇప్పటి వరకు 38 వేల కాల్స్‌ను రిసీవ్‌ చేసుకున్నాం. అవసరమైన వారికి డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం.

- నాగకుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, సన్‌షైన్‌ ఆస్పత్రి


Updated Date - 2020-04-02T08:33:35+05:30 IST