Abn logo
Sep 22 2021 @ 00:16AM

చైతన్యవీచికల వెలివేతలా!

ఉద్యమాల గడ్డ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరుగుతోంది అంటే అందులో ఉస్మానియా పాత్ర ప్రముఖంగా ఉంటుంది. గ్రంథాలయ ఉద్యమం, వందేమాతర ఉద్యమం, అస్పృశ్యత నిర్మూలన ఉద్యమం, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమం... ఇలా అనేక ప్రజా చైతన్య ఉద్యమాలకు కేంద్ర బిందువు ఉస్మానియా విశ్వవిద్యాలయం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ విషయంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర కీలకమైనది. తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విస్తృత స్థాయిలో జరిగింది. అప్పుడు పోలీసుల కాల్పుల్లో 369 మంది మరణించారు. వారిలో అత్యధికులు విద్యార్థులే. నాటి నుంచి 2009లో ఉద్యమం పతాక స్థాయికి చేరుకునే వరకు స్వరాష్ట్ర భావజాలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తన గర్భంలో దాచుకుంది. విద్యార్థులు 2009లో జేఏసీగా ఏర్పడి ఉద్యమ తీవ్రతను పెంచారు. ఏ నిరసన కార్యక్రమమైనా ఆర్ట్స్ కాలేజీ నుంచే మొదలై, ఆర్ట్స్ కాలేజీ వద్దే ముగిసేది. బారికేడ్లు, టియర్ గ్యాస్‌లు, రబ్బరు బుల్లెట్లు ఎదుర్కొని విద్యార్థులు అగ్నికణాల వలే ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఉస్మానియా విద్యార్థులకు స్వరాష్ట్ర కాంక్ష తప్ప, రాజకీయ కాంక్ష లేకపోవడం వల్ల విరామం లేకుండా ఉద్యమాన్ని నడపగలిగారు. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమై 2014లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కొత్త వీసీగా డి.రవీందర్ యాదవ్ ఇటీవలే నియమితులయ్యారు. ఆయన వచ్చీ రాగానే ఆర్ట్స్ కాలేజీ వద్ద పలు నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించారు. వందేళ్ల చరిత్రలో ఎన్నో ఉద్యమాలకు ఆర్ట్స్ కాలేజీ సజీవసాక్ష్యంగా నిలిచింది. ఈ కాలంలో వీసీలు ఉద్యమాలకు మద్దతు తెలపడమో, తటస్థంగా ఉండటమో చేశారు కానీ, నిషేధం మాత్రం విధించలేదు. 2014కు ముందు తెలంగాణ సాధనలో భాగమైన ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం ఇప్పుడు ఎందుకు నిరసనలపై నిషేధం ఎదుర్కోవలసి వస్తోంది? రాష్ట్రంలో ఇందిరాపార్క్ దగ్గర నిరసన కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టుగా, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ దగ్గర సభలు సమావేశాలు నిషిద్ధం అని వీసీ ప్రకటించారు. ఎవరి ఆదేశాలమేరకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు అనేది ప్రశ్నార్థకం!!


యూనివర్సిటీలో సమస్యలు కుప్పలుతెప్పలుగా ఉన్నప్పటికీ, వీసీ కేవలం నిరసన కార్యక్రమాలను నియంత్రించాలి అనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సభలు సమావేశాలు నిర్వహించుకోవడం, శాంతియుత నిరసన కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వాన్ని పాలకులను ప్రశ్నించడం మొదలైనవి రాజ్యాం గంలోని ఆర్టికల్ 19 ప్రకారం మనకు సంక్రమించిన హక్కు. సమస్యలు తలెత్తినపుడు ఎన్నో ఉద్యమాలను ఆర్ట్స్ కాలేజ్ వేదికగా రాష్ట్ర ప్రజల ముందుంచాం. ఆంధ్ర పాలకులు సైతం వాటిని అడ్డుకోలేదు, కానీ స్వరాష్ట్రంలో ఈ నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో విద్యార్థుల అభిప్రాయం తీసుకోకుండా, జూలైలోనే  ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తరువాత సెప్టెంబర్ రెండోవారంలో జరిగిన సమావేశానికి మొక్కుబడిగా కొన్ని విద్యార్థిసంఘాల ముఖ్యనాయకులకు ఆహ్వానం పంపారు. విద్యార్థి నాయకులందరూ ముక్తకంఠంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ, ఈసీ వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిరంకుశంగా ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించారు.


ఓయూ అభివృద్ధికి నిరసన కార్యక్రమాలే అడ్డంకిగా మారాయా? అంటే కాదనే చెప్పాలి. మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్, కళాశాల సిబ్బంది జీతాలు, వసతి గృహాల నిర్వహణకే సరిపోవడం లేదు. ఇక కొత్తగా ప్రారంభించిన కోర్సులకు, శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలకు సంబంధించి నూతన భవనాలు ఎలా నిర్మిస్తారు? వసతిగృహాల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించడం లేదు. సురక్షిత మంచినీరు లేకపోవడం, మరుగుదొడ్లు అధ్వాన్న స్థితిలో ఉండడం వల్ల అనేక మంది విద్యార్థులు టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు దాదాపు వెయ్యికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనపు బాధ్యతలను కేటాయించడం వల్ల తరగతులలో బోధన అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఓయూ 62వ స్థానానికి దిగజారింది. 2016లో ఇది 33వ స్థానంగా ఉండేది. అంటే విద్యా ప్రమాణాలు ఎంతగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు ప్రాంగణ నియామకాలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వీసీ మొదటగా వీటిపై దృష్టి సారిస్తే బాగుండేది. ఇవేకాకుండా యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. యూనివర్సిటీ లోపల బస్తీలు నిర్మించుకుని అక్రమంగా పశుపోషణ, బేకరీ పరిశ్రమ, ఇతర వర్తక వ్యాపారాలు చేస్తున్నారు. ఉస్మానియా అరణ్యం అనేక అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది. చుట్టుపక్కల ఉండే యువత యూనివర్సిటీలో మద్యం, డ్రగ్స్ సేవించడంతో పాటు, క్రయవిక్రయాలకు పాల్పడుతున్నారు. ఇలా అనేక సమస్యలు యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయి. 


నిజాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నియమించిన వీసీల నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన చరిత్ర విద్యార్థులది. లాఠీలకు తూటాలకు ఎదురొడ్డిన గుండె ధైర్యం, తెగువ వారి సొంతం. యూనివర్సిటీకి ఎంతో మంది వీసీలు వస్తుంటారు, వెళుతుంటారు. విద్యార్థి సంఘాలు ఎప్పటికీ ఓయూలోనే ఉంటాయి. బెదిరింపులతో, అక్రమ కేసులతో పోరాటాలను అడ్డుకుందాం అనుకుంటే అది చరిత్రాత్మక తప్పిదమే అవుతుంది.

బుర్ర రవితేజ గౌడ్

ఉస్మానియా లా విద్యార్థి

ప్రత్యేకంమరిన్ని...