దైవమే మెచ్చిన భాష మనది

ABN , First Publish Date - 2020-08-29T09:53:05+05:30 IST

భాష అంటే భాసితము, మాట, ప్రతిజ్ఞ అని అర్ధం. మన పూర్వీకులు భాషను సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రసాదించిన వరంగా చెబుతారు.

దైవమే మెచ్చిన భాష మనది

భాష అంటే భాసితము, మాట, ప్రతిజ్ఞ అని అర్ధం. మన పూర్వీకులు భాషను సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రసాదించిన వరంగా చెబుతారు. భాషను చదువుల జవరాలుగా, భాషాలక్ష్మిగా, వాగీశ్వరిగా, శక్తిగా మన పెద్దలు  కీర్తించారు. మాటకున్న శక్తి అనన్యసామాన్యం. భాష అంటే కేవలం లిపి, అక్షరాలు, పదాల అమరిక మాత్రమే కాదు. మనిషి పుట్టిన నాటి నుంచి తల్లి ఒడిలో తాగిన ఉగ్గుపాల మాధుర్యం. తండ్రి గుండెలపై ఆడుకుంటూ అలవర్చుకున్న జీవన నైపుణ్యం. మనిషి అంతరంగంలోని ఆలోచనలు.. భావస్పందనలు.. ప్రతిస్పందనలు అన్నీ మాతృభాష కిందికే వస్తాయి. అందుకే తల్లిభాషను మాతృమూర్తితో సమానంగా పూజించాలి, గౌరవించాలి అంటుంది సనాతన ధర్మం. స్వధర్మరక్షణలో స్వభాషా రక్షణ సైతం ఒక భాగమే. అందుకే భక్తి ఉద్యమ సమయంలో కబీరు, నామదేవుడు, మిరాబాయి, లల్లాదేవి, పురంధరదాసు, కనకదాసు, తుకారాం మొదలైన భక్తులంతా మాతృభాషల్లోనే పరమాత్మను కీర్తించి, తరించారు. అందుకే అమ్మనుడిని గౌరవించడం అంటే దైవారాధనలో ఒక భాగంగానే మనమంతా అర్థం చేసుకోవాలి. 


మన తల్లిభాష తెలుగు విషయానికి వస్తే ‘‘ఆంధ్రత్వ మాంధ్రభాషా చ నాల్పస్య తపసఃఫలం’’  ‘‘తెలుగు వాడుగా పుట్టడం, తెలుగుభాష మాట్లాడటం గొప్ప తపస్సు చేసినవాళ్లకు మాత్రమే లభించే వరం’’ అన్నారు తమిళ కవి, సంస్కృత పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు. పోతన మొదలు అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, మొల్ల, రామదాసు వంటి ఎందరెందరో తేనెలొలికే తెలుగులో మధురమైన కీర్తనలు రచించి, ఆలపించి భగవంతుణ్ని వశం చేసుకుని.. దర్శించి తరించారు. తెలుగుభాషకున్న శక్తి, మాధుర్యం అంత గొప్పది మరి. 


చరిత్రను తరచి చూస్తే తెలుగు భాష విశిష్టతను సాక్షాత్తు శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణరాయలకు చెప్పిన సందర్భం ఒకటుంది. ‘‘నాయనా! నీవు గీర్వాణ(సంస్కృత) భాషలో ఎన్నో కావ్యాలు రాశావు. తెలుగుభాషలో ఒక కావ్యం రచించు’’ అని కలలో ఆదేశించారట. కండచక్కర మాధుర్యం కల్గిన తెలుగుభాషలో గోదాదేవి కథను రచించి, తనని ఆనందింపచెయ్యమని రాయలకు చెప్పారు. తెలుగు గొప్పదనాన్ని తనకు స్వామి వివరించిన తీరును తన ఆముక్త మాల్యద కావ్య అవతార పీఠికలో ‘తెలుగదేలయన్న’ పద్యంలో చక్కగా వివరించారు రాయలవారు.


సాక్షాత్తు లక్ష్మీపతి కీర్తించిన తెలుగుభాషను నేడు తెలుగువారే అనాదరంతో చూడటం అన్యాయం. మాతృమూర్తితో సమానంగా మాతృభాషను గౌరవించినప్పుడే మన మనుగడకు అర్థం, పరమార్థం ఉంటుంది. భాష లేకుంటే మన సంస్కృతి, సాంప్రదాయాలకు మనుగడే లేకుండా పోతుంది. స్వధర్మ పరిరక్షణకు అమ్మభాష రక్షణే ఆలంబన. 

 గొడవర్తి శ్రీనివాసు, 9963556696

Updated Date - 2020-08-29T09:53:05+05:30 IST