మా దారి.. రహదారి!

ABN , First Publish Date - 2021-03-02T06:38:27+05:30 IST

మేజర్‌ పంచాయతీ కొత్తూరులోని ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు రహదారి నిర్మాణం దర్జాగా సాగుతోంది.

మా దారి.. రహదారి!
ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మిస్తున్న రహదారి ఇదే..

ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా ప్రైవేట్‌ రోడ్డు 

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంతో 

గతంలో నిర్మాణాన్ని నిలిపేసిన అధికారులు

నెలన్నర తర్వాత దర్జాగా పునఃప్రారంభం


కొత్తూరు, మార్చి 1: మేజర్‌ పంచాయతీ కొత్తూరులోని ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు రహదారి నిర్మాణం దర్జాగా సాగుతోంది. తుమ్మపాల రెవెన్యూలోని కొత్తూరు పంచాయతీలో సర్వే నంబరు 583లో 7బి ప్రభుత్వ స్థలంలో జరగుతున్న ఈ నిర్మాణంపై స్థానికులు ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయడం.. దీన్ని సదరు అధికారులకు రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకువెళ్లడం.. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ‘ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు రహదారి’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితం కావడం తెలిసిందే. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంపై సర్వే చేసి పనులు నిలిపి వేశారు. ఇది జరిగిన నెలన్నర తర్వాత ఆగిన చోట నుంచే రోడ్డు నిర్మాణం యథేచ్ఛగా జరుగుతోంది. తమను ఎవరూ అడ్డుకోలేరన్న ధీమానో.. మరేతర కారణమోగాని, రెవెన్యూ అధికారులు ఆపిన తర్వాత కూడా రియల్టర్లు రోడ్డు నిర్మిస్తుండడంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తి నిర్మిస్తున్న రహదారిని అడ్డుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 


ప్రైవేటు వ్యక్తులు రోడ్డు వేస్తే తొలగిస్తాం

-శ్రీనివాసరావు, తహసీల్దార్‌, అనకాపల్లి


ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులు రోడ్డు నిర్మాణాలు చేస్తే తొలగిస్తాం. ఇప్పటికే వీఆర్వోకు ఆదేశాలు జారీ చేశాం. మంగళవారం రిపోర్టు ఇవ్వాలని సర్వేయర్‌ను ఆదేశించాం. భూమికి సంబంధించి పూర్తి వివరాలు జల వనరుల శాఖకు అప్పగిస్తాం.

Updated Date - 2021-03-02T06:38:27+05:30 IST