మా జట్టు అమ్ముడుపోయింది!

ABN , First Publish Date - 2020-06-19T09:57:23+05:30 IST

భారత్‌తో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తమ జట్టు ఉద్దేశపూర్వకంగానే ఓడిందని శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద అలుత్‌గమగె సంచలన ఆరోపణలు చేశారు. ఆ మ్యాచ్‌లో తమ జట్టు అమ్ముడుపోయిందంటూ

మా జట్టు అమ్ముడుపోయింది!

ఫైనల్లో కావాలనే ఓటమి

2011 వన్డే వరల్డ్‌క్‌పపై శ్రీలంక మాజీ మంత్రి


మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలో తొమ్మిదేళ్ల క్రితం భారత జట్టు సాధించిన వన్డే వరల్డ్‌కప్‌ అభిమానుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయమే. 275 పరుగుల ఛేదనలో భారత్‌ 31 రన్స్‌కే సచిన్‌, సెహ్వాగ్‌లను కోల్పోయిన వేళ గంభీర్‌, ధోనీ వీరోచిత బ్యాటింగ్‌తో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల ఎదురుచూపులకు తెర పడిన ఆ అద్భుత మ్యాచ్‌లో ప్రత్యర్థి శ్రీలంక కావాలనే ఓడిందంటున్నారు.. ఆ దేశ మాజీ మంత్రి ఒకరు.


కొలంబో: భారత్‌తో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తమ జట్టు  ఉద్దేశపూర్వకంగానే ఓడిందని శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద అలుత్‌గమగె సంచలన ఆరోపణలు చేశారు. ఆ మ్యాచ్‌లో తమ జట్టు అమ్ముడుపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2010 నుంచి 2015 వరకు లంక క్రీడా మంత్రిగా వ్యవహరించిన మహిందానంద ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ మరో పది బంతులుండగానే 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ‘2011 వరల్డ్‌కప్‌లో మా జట్టు అమ్ముడుపోయిందని స్పష్టంగా చెప్పగలను. అంతేకాదు.. నా మాటకు కట్టుబడి ఉంటాను. ఆ సమయంలో నేను శ్రీలంక క్రీడా మంత్రిగా ఉన్నాను. అయితే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేను. ఆ ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం లంక జట్టే గెలవాల్సింది. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధమే. ఆటగాళ్లకు ఇందులో భాగస్వామ్యం లేకపోయినా కొన్ని వర్గాలు మాత్రం ఈ ఫిక్సింగ్‌లో పాలుపంచుకున్నాయి’ అని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందానంద వెల్లడించాడు. మరోవైపు ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు గమగెతో పాటు అప్పటి లంక అధ్యక్షుడు మహింద రాజపక్స కూడా హాజరయ్యారు.


గతంలోనూ పలువురు..

2011 ఫైనల్‌ మ్యాచ్‌పై గతంలోనూ శ్రీలంక నుంచి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ కూడా తమ జట్టు ఓటమిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఫిక్సిం గ్‌ అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ‘ఫైనల్లో ఓటమి నన్నెంతో ఆవేదనకు గురి చేసింది. ఆ సమయంలో నేను వ్యాఖ్యాతగా భారత్‌లోనే ఉన్నాను. మా జట్టు ఆటతీరుపై అప్పట్లోనే సందేహం వచ్చింది. ఏదిఏమైనా ఆ మ్యాచ్‌పై విచారణ జరపాల్సిందే’ అని అతడు అప్పట్లో డిమాండ్‌ చేశాడు. ఇక రణతుంగ ఆరోపణలకు మద్దతునిస్తూ లంక మాజీ మంత్రి దయసిరి జయశేఖర కూడా ఇదే తరహా వాదనను వినిపించాడు.


ఆధారాలేవీ? సంగక్కర, జయవర్ధనె డిమాండ్‌

2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో తాము కావాలనే ఓడామనడానికి ఆధారాలు చూపాల్సిందిగా అప్పటి లంక జట్టు కెప్టెన్‌ కుమార సంగక్కర, జయవర్ధనె డిమాండ్‌ చేశారు. ‘మాజీ క్రీడామంత్రి గమగె దగ్గర దీనికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలుంటే వెంటనే ఐసీసీకి, అవినీతి వ్యతిరేక యూనిట్‌కు అందించాలి. అప్పుడే వారు క్షుణ్ణంగా విచారణ జరుపుతారు’ అని సంగక్కర ట్వీట్‌ చేశాడు. ఇక ఆ మ్యాచ్‌లో శతకం బాదిన జయవర్ధనె కూడా గమగె వ్యాఖ్యలపై విరుచుకుపడ్డాడు. ‘చూస్తుంటే సర్కస్‌ ఆరంభమైనట్టు కనిపిస్తోంది.. ఇప్పుడేమైనా ఎన్నికలు జరగబోతున్నాయా? మరి పేర్లు, సాక్ష్యాలేమైనా ఉన్నాయా?’ అంటూ అతడి ఫిక్సింగ్‌ కామెంట్స్‌నుద్దేశించిన జయవర్ధనె ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-06-19T09:57:23+05:30 IST