అమరావతితోనే మా బతుకు

ABN , First Publish Date - 2020-02-16T09:12:09+05:30 IST

‘‘రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోదని చెబుతున్న సీఎం జగన్‌... డిల్లీకి వెళ్లి మూడు రాజధానులపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో మాట్లాడి అనుమతి ఎందుకు తీసుకుంటున్నారు? బీజేపీ నేతలు ఏ రోటి కాడ పాట ఆ రోటి

అమరావతితోనే మా బతుకు

తుళ్లూరులో ఖాళీ ప్లేట్లతో మహిళల నిరసన

60వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు 

వేంకటేశ్వర స్వామికి పొంగళ్లు, ముడుపులు

కృష్ణాయపాలెంలో 60గంటల నిరాహార దీక్ష 


గుంటూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోదని చెబుతున్న సీఎం జగన్‌... డిల్లీకి వెళ్లి మూడు రాజధానులపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో మాట్లాడి అనుమతి ఎందుకు తీసుకుంటున్నారు? బీజేపీ నేతలు ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ అన్నతీరుగా వ్యవహరిస్తున్నారు’’ అని అమరావతి ప్రాంత రైతులు మండిపడ్డారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారంకు 60వ రోజుకు చేరాయి. అమరావతితోనే మా బతుకంటూ తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళలు ఖాళీ ప్లేట్లతో తమ నిరసన తెలిపారు. వెలగపూడి, మందడంలో రైతులు, రైతుకూలీలు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.


పెదపరిమి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, తాడికొండ, గుంటూరు కలెక్టరేట్‌ ఎదురు రిలే నిరాహార దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తాడికొండ అడ్డరోడ్డు నుంచి తాడికొండ, పొన్నెకల్లు, రావెల, నిడముక్కల, మొతడక, బడేపురం ప్రాంతాల మహిళలు రాజధాని రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. తొలుత అడ్డరోడ్డు నుంచి ప్రభలు కట్టుకొని పెద్దఎత్తున ట్రాక్టర్లలో నెక్కల్లు వరకు ర్యాలీ చేశారు. అక్కడినుంచి కాలినడకన ‘సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదాలు చేస్తూ అనంతవరం కొండఎక్కి వేంకటేశ్వరస్వామికి పొంగళ్లు, మొక్కులు చెల్లించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ పూజలుచేసి ముడుపులు కట్టారు. వీరితోపాటు రైతులు, యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.


హరిశ్చంద్రాపురంలో గ్రామదేవతకు గ్రామస్థులు, మహిళలు పెద్దఎత్తున పొంగళ్లు పెట్టుకొని తప్పెట్లతో తుళ్లూరు దీక్షా శిబిరానికి చేరుకున్నారు. కూరగాయలపై ‘జై అమరావతి’ అని రాసి నిరసన తెలిపారు. తాడేపల్లి మండలం పెనుమాకలో దీక్షలు 60రోజుకు చేరుకున్నాయి. సింగరాయకొండ నుంచి సినీనటుడు కోటి దీక్షా శిబిరానికి వచ్చి, రైతులకు మద్దతు పలికారు. మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు 56వ రోజుకు చేరుకున్నాయి. విజయవాడ తెలుగు మహిళా నాయకురాలు యార్లగడ్డ సుజాత దీక్షకు హాజరై సంఘీభావం తెలిపారు. పాత బస్టాండు సెంటరులో మహిళలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు.


కృష్ణాయపాలెం, యర్రబాలెం, నిడమర్రు, నవులూరు గ్రామాల్లో రైతులు, రైతుకూలీలు, జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. కృష్ణాయపాలెంలో రైతులు 60గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రజా కళాకారులతో ‘‘ధూం.. ధాం..’’ నిర్వహించనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. మేము సైతం అంటూ కళాశాల విద్యార్థినులు రాజధాని రైతులకు అండగా నిలిచి వారి ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్‌ మనసు మారాలని మందడం దీక్షా శిబిరంలో ముస్లింలు, మహిమ ప్రార్థన మందిర పాస్టర్‌ పొట్లూరి రత్నబాబు ప్రార్థనలు నిర్వహించారు. 


తుళ్లూరు శిబిరంలో 60వ రోజు నిరాహార దీక్షలో పాల్గొని, నినాదాలు చేస్తున్న మహిళా రైతులు, తాడికొండ అడ్డరోడ్డు నుంచి అనంతవరం వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ట్రాక్టర్లపై తరలివస్తున్న మహిళా రైతులు

Updated Date - 2020-02-16T09:12:09+05:30 IST