కరోనాను మించిన వైరస్‌తో పోరు!

ABN , First Publish Date - 2020-03-25T09:01:52+05:30 IST

‘‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కంటే భయంకరమైన మహమ్మారితో పోరాడుతున్నాం. అమరావతికి పట్టిన వైరస్‌ మా పోరుతో వదులుతుంది’’ అంటూ రాజధాని రైతులు...

కరోనాను మించిన వైరస్‌తో పోరు!

  • ఇంకా పెయిడ్‌ ఆర్టిస్టులమే అంటారా?
  • మా ఆకాంక్షే అమరావతిని బతికిస్తుంది
  • స్పష్టం చేసిన రాజధాని రైతులు, మహిళలు
  • 98వ రోజూ కొనసాగిన ఆందోళనలు
  • దూరం.. దూరంగా ఉండి నిరసనలు

గుంటూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కంటే భయంకరమైన మహమ్మారితో పోరాడుతున్నాం. అమరావతికి పట్టిన వైరస్‌ మా పోరుతో వదులుతుంది’’ అంటూ రాజధాని రైతులు నినదించారు. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం వరసగా 98వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. ఇంకా మమ్మల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా? అంటూ మండిపడ్డారు. ‘‘పోటీ దీక్షలను ప్రోత్సహించారు. మాది జీవన్మరణ సమస్య. ఇకనైనా మంకుపట్టు వదిలి మా ఆందోళనలను అర్థం చేసుకోండి’’ అని సీఎం జగన్‌ను వేడుకున్నారు. కాగా, రైతులు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా శిబిరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీక్షా శిబిరాల్లో వ్యక్తికి, వ్యక్తికి మధ్య మూడు మీటర్ల దూరం పాటిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డులు ఏర్పాటు చేశారు. శిబిరాల్లో వంతుల వారీగా రైతులు పాల్గొంటున్నారు. అలాగే, 29 గ్రామాల్లో దీక్షలు కొనసాగించారు. ప్రతి వీధిలో పది మంది చొప్పున ఆందోళనలు కొనసాగించారు. 


కొత్త సంవత్సరంలో నైనా..

అమరావతిని రాజధానిగా కొనసాగేలా చూడాలంటూ మహిళలు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. అలాగే, తమ వద్దకు ఎలాంటి చేడు వైరస్‌ చేరకూడదంటూ గ్రామాల్లో పేడ కళ్లాపులు చల్లి, ‘జై అమరావతి’ ముగ్గులు పెట్టారు. పోలీసులు, కేసులతో తమ జీవితాల్లో ఎలాంటి పండగా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగాది శార్వరీ నామ సంవత్సరంతోనైనా అమరావతి కష్టాలు తీరాలని భగవంతుడిని కోరుకున్నట్టు మహిళలు, రైతులు తెలిపారు.


కొనసాగిన ‘అమరావతి వెలుగు’

రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ మంగళవారం రాత్రి 7.30కు కరెంట్‌ నిలిపివేసి కొవ్వొత్తులు వెలిగించి ‘అమరావతి వెలుగు’ పేరిట రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ కూడళ్లలో మహిళలు, రైతు లు కొవ్వొలతో  ‘జైఅమరావతి’ నినాదాలు చేశారు. 


ఎంపీ పుట్టినరోజు కానుక

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి రా విపాటి సాయు నేతృత్వంలో రైతుల దీక్షా శిబిరాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అలానే కరోనా సోకకుం డా శానిటైజర్స్‌, హోమియో మందులను పంపిణీ చేశారు. 


నేటి నుంచి శిబిరాలు బంద్‌

కరోనా నిరోధక చర్యల్లో భాగంగా దేశమంతటా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రైతుల దీక్షా శిబిరాలను పూర్తిగా మూసివేస్తున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే, రైతులందరూ వారి వారి ఇళ్లలోనే ఉండి రాజధాని కోసం నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ మేరకు జేఏసీ నేతలు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.  


Updated Date - 2020-03-25T09:01:52+05:30 IST