మా ఎమ్మెల్యే సతాయిస్తున్నారు..

ABN , First Publish Date - 2022-01-28T05:54:01+05:30 IST

ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ తమపై కక్ష సాధిస్తున్నారని వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

మా ఎమ్మెల్యే సతాయిస్తున్నారు..
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వద్ద ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు

పార్టీ పెద్దల వద్ద వైసీపీ నాయకుల గోడు

కళ్యాణదుర్గంలో అధికార పార్టీ కుమ్ములాట

 కళ్యాణదుర్గం, జనవరి 27: ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ తమపై కక్ష సాధిస్తున్నారని వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ చైర్మన రాజ్‌కుమార్‌, శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ్‌, కౌన్సిలర్‌ ప్రభావతి శ్రీకాంతరెడ్డి కడప ఎంపీ అవినా్‌షరెడ్డిని బుధవారం కలిశారు. ఆ వివరాలను గురువారం జడ్పీటీసీ వెల్లడించారు. సొంత పార్టీవారిపైనే ఎమ్మెల్యే కక్షసాధిస్తున్నారని, సమస్యలపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఎంపీకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఎమ్మెల్యే నియంతృత్వ పోకడల కారణంగా పదుల సంఖ్యలో నాయకులు పార్టీకి దూరమవుతున్నారని ఆరోపించారు. 2021 మార్చిలో ప్రమాణస్వీకారం చేసిన మున్సిపల్‌ చైర్మెన, తన అనుమతిలేకుండా చాంబర్‌లో కూర్చున్నారన్న కారణంగా ఆయన చాంబర్‌ను ఎమ్మెల్యే తొలగించారని అన్నారు. ఎమ్మెల్యే వ్యవహారశైలిని సీఎం జగన దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. 


చాంబర్‌లో చైర్మన

మున్సిపల్‌ ఎన్నికల అనంతరం 11 నెలల తరువాత చైర్మన రాజ్‌కుమార్‌ గురువారం తన చాంబర్‌లో కూర్చున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి సూచన మేరకు ఈ ‘సాహసం’ చేశారని సమాచారం. శెట్టూరు జెడ్పీటీసీ మంజునాథ్‌, కౌన్సిలర్‌ ప్రభావతి ఇందుకు సహకరించారని తెలిసింది. 1, 2, 10, 16, 18 వార్డుల కౌన్సిలర్లు ఆయనను చాంబర్‌లో సత్కరించారు. చైర్మన ఆధ్వర్యంలోనే పాలన జరగాలని అన్నారు. 


పోలీసుల బెదిరింపులు..?

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పలువురు నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని మరో వర్గం వారు ఆరోపించారు. మున్సిపల్‌ చైర్మెనను పట్టణ పోలీసులు బుధవారం రాత్రి స్టేషనకు పిలిపించారు. పావురాల పందెం కాస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఐ తేజోమూర్తి చైర్మెనను ప్రశ్నించారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి చెందిన కౌన్సిలర్‌ రాజేశ్వరి మరిది బాలాసోమును కూడా స్టేషనకు ఇటీవల పిలిపించి విచారించారు. బాలసోమశేఖర్‌పై కేడీ షీట్‌ ఉందని, ఎస్పీ ఆదేశాల మేరకు స్టేషనకు పిలిపించి రెన్యువల్‌ చేశామని సీఐ తెలిపారు. మున్సిపల్‌ చైర్మెనను పావురాల పందేలు ఆరోపణల గురించి విచారించామని, పట్టుబడితే పదవికి మచ్చవస్తుందని హితవు పలికామని, బెదిరించలేదని సీఐ వివరణ ఇచ్చారు. 

- ఎమ్మెల్యే తీరుపై శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ్‌, మున్సిపల్‌ చైర్మెన రాజ్‌కుమార్‌, ఐదుగురు కౌన్సిలర్లు ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్మెన గిరిజమ్మకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. వీటి గురించి విచారించాలని కోరినట్లు తెలిపారు.

Updated Date - 2022-01-28T05:54:01+05:30 IST