అఖండలో మన కృష్ణార్జునులు

ABN , First Publish Date - 2021-12-05T07:12:57+05:30 IST

బసవా.. అనగానే రంకెలేస్తూ వచ్చిన ఒంగోలు గిత్తలు ఒక్కసారిగా నిలిచిపోతాయి. ఆపదలో ఉన్న తమ యజమానిని కాపాడేందుకు ఉక్రోశంతో రౌడీమూకలపైకి దుముకుతాయి.

అఖండలో మన కృష్ణార్జునులు

ప్రేక్షకుల మది దోచుకున్న లక్కారం గిత్తలు


చౌటుప్పల్‌ : బసవా.. అనగానే రంకెలేస్తూ వచ్చిన ఒంగోలు గిత్తలు ఒక్కసారిగా నిలిచిపోతాయి. ఆపదలో ఉన్న తమ యజమానిని కాపాడేందుకు ఉక్రోశంతో రౌడీమూకలపైకి దుముకుతాయి. ప్రేక్షకుల మది దోచిన ఈ దృశ్యాలు ఇటీవల విడుదలైన అఖండ సినిమాలోనివి. ఈ సినిమాలో హీరో బాలకృష్ణకు రెండు ఒంగోలు గిత్తలు చేదోడువాదోడుగా ఉంటాయి. ఆ గిత్తలు మన లక్కారానికి చెందిన కృష్ణార్జునులు.


సాధారణంగా సినిమాల్లో నటించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అయినా కొన్ని సందర్భాల్లో రాణించడం కష్టం. అలాంటిది మూగ జీవాలు నటించిన మొదటి సినిమాతోనే తమ పా త్రలకు ప్రాణం పోసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మన కృష్ణార్జునులు అఖం డ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్‌ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నా డు. రెండేళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతం నుంచి ఒంగోలు జాతికి చెందిన రెండు గిత్తలను కొనుగోలు చేశాడు. వాటికి కృష్ణుడు, అర్జునుడు అని పేరుపెట్టాడు. వీటి సాయంతో సేంద్రియ వ్యవసాయంచేస్తూ ఎద్దులకు పశువైద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సాయంతో బరువైన బండరాళ్లను ఈడ్చుకుంటూ వేగంగా పరుగెత్తడంలో తర్పీదు ఇచ్చాడు.


సినిమాలో చాన్స్‌ ఇలా

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒంగోలు జాతికి చెందిన మేలైన గిత్తలను అమ్మకానికి పెట్టారనే సమాచారంతో వాటిని కొనుగోలు చేసేందుకు శ్రీనివాస్‌ డాక్టర్‌ శ్రీధర్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ తన వద్ద ఉన్న రెండు ఒంగోలు గిత్తల గురించి, వాటికి శిక్షణ ఇచ్చిన విషయాన్ని చర్చించి గిత్తలను అమ్మకానికి పెట్టిన యజమానికి కృష్ణార్జునుల వీడియోలను చూపించాడు. ఆ వీడియోలను చూసిన అతడు గిత్తలను సినిమా షూటింగ్‌ తీసుకొస్తారా అని అడగడంతో శ్రీనివాస్‌ అంగీకరించాడు. ఈలోగా అఖండ సినిమాకు రెండు గిత్తలు కావాలని సమాచారం అందడంతో శ్రీనివాస్‌ వాటిని ఫిల్మ్‌సిటీకి తీసుకెళ్లాడు. డైరెక్టర్‌ బోయపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా గత ఏడాది డిసెంబరు 22న కృష్ణార్జునులు షూటింగ్‌లో పాల్గొన్నాయి. మరో ఐదు నెలల అనంతరం ఏప్రిల్‌ 7న ఫిల్మ్‌సిటీలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల సినిమా విడుదల కాగా, ఈ గిత్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


గిత్తలను సినిమాలో ప్రదర్శించడం సంతోషంగా ఉంది : నూనె శ్రీనివాస్‌, కృష్ణార్జునుల యజమాని

అఖండ సినిమాలో కృష్ణార్జునులను ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. అంతేగాక గిత్తల నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వీటిని 16 నెలల వయసులో కొనుగోలుచేశా. ప్రత్యేక శిక్షకుడితో శిక్షణ ఇప్పించా. అనుకోకుండా సినిమాలో చాన్స్‌రావడం, తొలిసారే మంచి పేరు రావడం ఆనందంగా ఉంది. గిత్తలతో రెండుసన్నివేశాలు చిత్రీకరించారు. మొదటిసారి షూటింగ్‌కు రూ.12వేలు, రెండో సారి రూ.15వేలు పారితోషికంగా ఇచ్చారు.


మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చా : శ్రీధర్‌, గిత్తల శిక్షకుడు

ఒంగోలు జాతి గిత్తలతో శ్రీనివాస్‌ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. వాటికి మూడు నెలల పాటు బరువులు గుంజడం, పరుగు పందెంలో పాల్గొనేలా మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చా. అనూహ్యంగా వీటికి సంబంధించిన వీడియోలను ఫిల్మ్‌సిటీలో కొందరు చూసి బోయపాటికి సిఫారసు చేయడంతో అఖండ సినిమా చాన్స్‌ వచ్చింది. తొలి సినిమాతోనే వాటికి మంచి ఆదరణ, గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరింత శిక్షణ ఇస్తాం.


Updated Date - 2021-12-05T07:12:57+05:30 IST