Abn logo
Mar 16 2020 @ 05:14AM

‘మన కబీర్‌’కు మహోన్నత పురస్కారం

‘‘పల్లె కన్నీరు పెడుతోంది...’’ గేయమెంత నిడివి ఉందో దాని చుట్టూ అంత చర్చ జరిగింది. ఆ పాట నా ఆత్మ. ఇరవై నాలుగేండ్ల క్రితం అది రాయకుంటే ఆత్మహత్యే శరణ్యం అనుకునేటంతటి దైన్యంలో ఎగసిన పలవరింత. సమాజం ఉత్పత్తి సంబంధాలు- ఉత్పత్తి పరికరాల ఎదుగదలను అర్థం చేసుకోలేని వాణ్ణి కాదు నేను. అనివార్యమని అనుకున్నా, అధిపత్యంతో లాభాపేక్ష సామ్రాజ్యవాదం విదిల్చిన ఇనుపరెక్కల వీరంగానికి అల్లాడిన పల్లె దృశ్యానికి పల్లవి కట్టాను.


రచయితలు దోసిలొగ్గితే సంచార కళాకారులైన హరిదాసులు, జంగమ దేవరలు, జమిడిక వాయించే బైండ్లవాళ్లు, సీత శోకాన్ని మోసుక తిరిగే బాల సంతులు కనుమరుగవుతున్నా, ఇంకా మారుమూల ప్రాంతాల్లో వెతుకులాడితే మిణుకుమిణుకు మంటూ కొడిగట్టిన దీపాలలాగ మిగిలి ఉన్నవాళ్లు, మనకు భాషా బిక్షను ఒంపు తారు. మాండలిక సొగసే రచనకు సారభూతమైన దినుసు. 


తెలుగు సాహిత్యంలో పాటల ఊటచెలిమ గోరటి వెంకన్న. పాటకు కవిత్వ పరిమళాలను అద్ది, పదునెక్కించి పాటను శిఖరాయమానం చేసిన కవిత్వం వెంకన్నది. దక్షిణ భారతాన కొనసాగిన సాంస్కృతిక పోరాటాల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వెంకన్నపాట... ఆకలి, కన్నీరు లేని లోకాన్ని కలగంటున్నది. వెంకన్నది వామపక్ష నేపథ్యం. అయినప్ప టికీ వివిధ తాత్విక ధోరణులను తన రచనలో యిముడ్చుకొన్నాడు. ఆదిసామ్యవాది గౌతమబుద్ధుని బోధన వెంకన్న వాదన. విశ్వగమనాలను ఆకళింపు చేసుకున్న సునిశిత దృష్టి వెంకన్న సొంతం. మానవ సమూహ దుఃఖ సముద్రాలను ఒడిసిపట్టుకున్న కవనం తనది. సాధు, సంతు, సూఫీ, బైరాగి, అచల, విప్లవ సమన్విత కవితా ప్రవాహరూపమే వెంకన్న పాట. ఇలాంటి వెంకన్న పాటకు ఇటీవల ప్రతిష్టాత్మక కబీర్‌ సమ్మాన్‌ అవార్డు దక్కింది. భారతీయ భాషల్లోని ప్రామాణిక కావ్యాలకు ఇచ్చే ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంలో- వెంకన్న తన పాటల వెనుక ఉన్న బలం ఏమనుకుంటున్నాడో, వర్తమాన సామాజిక సందర్భాన్ని ఎట్లా చూస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నమే ఈ ముఖాముఖి...


భారత సమాజంపై బలమైన ముద్రను వేసిన భక్తి కవుల సంప్ర దాయ కవిశిరోమణి కబీర్‌ పేరుమీద ఇచ్చే ‘‘కబీర్‌ సమ్మాన్‌ జాతీయ పురస్కారం’’ మీ పాటను వరించిన వేళ మీ అనుభూతి ఏమిటి?

శకలాలు శకలాలుగా రాల్చుకున్న తరాల దుఃఖ వ్యక్తీకరణకు దక్కిన గౌరవమనుకుంట. నేనే ఏదో సాధించిన విజయం కాదిది. దున్న ఈద్దాసు, చెన్నదాసు మొదలుకొని దువ్వూరి, కృష్ణశాస్త్రి, జాషువా, గద్దర్‌ల పాదజాడ లకు ప్రణమిల్లిన ఫలమనుకుంట. ఎంపిక చేసిన సాహితీమూర్తులకు ధన్యవాదాలు. 


మౌఖిక వారసత్వం, విస్తృత సాహిత్య అధ్యయనం, విశాల సైద్ధాంతిక అవగాహన, తాత్విక కవితాధోరణి మీ పాటకు మూలస్తంభాలు. ఈ నాలిగింటితో పాటు బలమైన కాలికస్పృహతో అప్‌డేట్‌ కావడం ఎలా సాధ్యమవుతున్నది?

మీరు నన్ను అప్‌డేట్‌ అనుకుంటున్నారు. నేను ఉన్నచోటే ఊహల్లో మునిగి ఉన్న. ఆ ఊహలు చెదిరినపుడు హృదయంలో ఉబికే అలజడికి ఆవేదనను అనుచుకోలేని సహజ నేపథ్యమే నా అప్‌డేట్‌. 


మీ పాట పాడుతున్నప్పుడు గేయమై అలరిస్తది, చదివితే ఒక దీర్ఘ కవితను తలపిస్తది ఇది ఎట్లా సాధ్యం? 

కవిత్వ జీవధాతువు మౌఖికతలో దాగి ఉంది. మౌఖిక వారసత్వంతో పాటు ప్రాచీన, ఆధునిక సాహిత్యాల యెడ ఆరాధనవల్ల మీ అభిమానాన్ని పొంది ఉండవచ్చు. 


ఇంత గాఢత సాధించిన అభివ్యక్తికి మీ అధ్యయనమే కారణమా?

అధ్యయనం కావొచ్చు. పరిశీలన కావచ్చు. వైయక్తిక అనుభూతి కావచ్చు. అల్లే వేళ మైకం. అన్నీ నావనుకునే అనురక్తి, ఏదీ కానీ విరక్తి కావచ్చు. 


పోతన మొదలుకొని వేమన, కృష్ణశాస్త్రి మొదలుకొని దువ్వూరి, కాళ్లకూరి దాకా వందల పద్యాలు మీకు కంఠస్థం. పద్యంపై ఇంతటి మోహం ఎలా అలవడింది? 

పాఠశాలలో పద్యమే నాకు నైవేద్యం. లయ గల గేయంలో తెలియకుండానే ఛందస్సు ఉంటుంది. అది మౌఖిక సాహిత్యంగా మనం ఎరుగుదుము. పాట, పద్యం యెడ సమారాధన నాది. నాలోని వెలితిని, నా దుఃఖాన్ని నేను వ్యక్తీకరించుకోలేని ఆసక్తతలో బలిజెపల్లో, వేమనో, కృష్ణశాస్త్రో తదితర మహాకవుల పద్య వలపోతనే నాకు ఓదార్పు. 


బాబ్‌ డిలాన్‌, పాల్‌ రాబ్సన్‌, దర్విష్‌, లాయింగ్‌స్టన్‌, దాస్తోవిస్కీ, కుప్రీన్‌, టాల్‌స్టాయ్‌ తదితర అంతర్జాతీయ కవుల సాహిత్యానికి మీ పాటకు సామ్యం ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? 

సామ్యం ఉందో లేదో నాకు తెలియదు. కానీ, వారి రచనాశక్తికి దోసిలొగ్గె వాడిని. కొన్ని అనువాదాల్లోగానీ, మూలంలోగానీ చదివి ఆస్వాదిస్తాను. ఆర్టిస్ట్‌ మోహన్‌ గారి వల్ల పాశ్చాత్య సాహిత్య పరిచయం కొంత కలిగింది. అనేకమంది సాహితీమూర్తుల చలువవల్ల వీరిని చదవాలనే ఆసక్తి కలిగింది. 


గ్లోబలైజేషన్‌ దాడికి భారత పల్లెలు నాశనమయ్యాయని వెంకన్న ‘‘పల్లె కన్నీరు పెడుతోంది...’’ పాట రాస్తే దార్శనికులు మొదలుకొని దారిన వెళ్లే పామరజనం కూడా కన్నీరు కార్చారు. అదే సమయంలో వృత్తులను అంటిపెట్టుకున్న కులం మాటేమిటి, వెంకన్న కులం పోవద్దని కోరుకుంటున్నాడా? అనే విమర్శకు సమాధానం ఏమిటి?

ఈ గేయమెంత నిడివి ఉందో దాని చుట్టూ అంత చర్చ జరిగింది. నిద్ర పోయినోళ్లను లేపొచ్చు. నిద్ర నటించేవాణ్ణి లేపలేం. అయినా రెండు మాటలు.. తప్పదు కదా. ఆ పాట నా ఆత్మ. ఇరవై నాలుగేండ్ల క్రితం అది రాయ కుంటే ఆత్మహత్యే శరణ్యం అనుకునేటంతటి దైన్యంలో ఎగసిన పలవరింత. గ్లోబలైజేషన్‌, సరళీకరణ ఇవన్నీ అర్థమై రాసింది కాదు. సూచనప్రాయంగా వాటి గూర్చి అవగాహన ఉన్నా అది రాసినప్పుడు నా కళ్లల్లో మెదిలిన నా ఊరు, నేను చదివిన రఘుపతిపేట, వెయ్యి మగ్గాల శిథిలత్వం, ప్రాణ మిత్రుల ఎడబాటు, పరిసరాలలో ఆవరించిన ఎడారిదృశ్యం, ఏనాడు నా ఊరిలో ఎవరితో ఇసుమెత్తు విబేధంలేని సామరస్య పూర్వక జీవితం, కష్టాలు కన్నీళ్లు, ఆనందాలు, అనుబంధాలు కలబోసుకొని బతికిన పల్లె యాదికొచ్చి అల్లుకున్న పాట అది. ఉద్యోగ బదిలీ వల్ల ఊరికి దూరం కావాల్సిన పరి స్థితుల వల్ల నాలో తన్నుకొని వచ్చిన గేయం అది. సమాజం ఉత్పత్తి సంబం ధాలు-ఉత్పత్తి పరికరాల ఎదుగదలను అర్థం చేసుకోలేని వాణ్ణి కాదు నేను. అనివార్యమని అనుకున్నా, అధిపత్యంతో లాభాపేక్ష సామ్రాజ్యవాదం విదిల్చిన ఇనుపరెక్కల వీరంగానికి అల్లాడిన పల్లె దృశ్యానికి పల్లవి కట్టాను. వృత్తులే కులానికి కారణమైతే ప్రపంచంలో అనేక దేశాల్లో ఇలాంటి వృత్తులు చేసే వారి యెడ వివక్షత లేదు. వృత్తి చితికింది. కులం అతికింది. ఇది భారతీయ సమాజ తరాల ప్రత్యేక అమానుష్య విధానమే వివక్షగానీ, వృత్తులు చేయడం వల్ల కాదు. వృత్తులున్న గ్రామాల కంటే వృత్తులు లేని నగరాలలో కులవివక్ష అధికమనేది ఏ దళితున్ని అడిగినా చెప్తారు. అయినా గ్లోబలైజేషన్‌ వల్ల కొన్ని వృత్తులకు అధిక రాబడి కూడా వచ్చింది. భూస్వామ్య సంకెళ్లను తెంచుకున్నయి. దాన్ని అంగీకరించవచ్చు. అప్పటి నా అవగాహన. గాంధీ చెప్పినా, బుద్ధుడు చెప్పినా, మావో చెప్పినా పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం నా స్వభావానికి అనుగుణమిది. అందుకే ఆ పాట రాసిన. దాని మీద చర్చ చేసేవాళ్ల వాదం సముద్రాన్ని కుండతో తోడే విఫల యత్నం. 

మీ గేయాన్ని చదివినపుడు ఏకకాలంలో ప్రబంధాలను దాటిన వర్ణన ఒకవైపు, భావ కవిత్వ ప్రతీకలు మరోవైపు, ఇంత వైవిధ్య బతుకు చిత్రణ ఎట్లా సాధ్యమైంది? ఉదాహరణకు వెన్నెల, వసంతం, చీకటి, వాగు, కొంగ, పిట్ట, ఎరుకలి నాగన్న గేయాలు...

బాల్యంలో ప్రబంధాలు అలభ్యం. పంతులయ్యలు చెప్పే పాఠాలకే పరవ శించి, ఒకటికి రెండు ఊహించే స్వభావం దాంతంగా నాలో పాదై ఉన్నది. ఇంటర్‌ జడ్చర్ల, డిగ్రీ మహబూబ్‌నగర్‌లో చదివే సమయంలో నా తీరిక సమయం అంతా దొరికినంత వరకు గ్రంథాలయంలో కృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన వంటి ప్రబంధకవుల వ్యాఖ్యానసహితమైన రచనలు చాలా యిష్టంగా చదువుకున్నాను. ఊరును వర్ణించాలనే కుతూహలం ఈనాటిది కాదు. దానికి పాదు బాల్యంలోనే. దువ్వూరి పద్యాల కంఠస్తం వల్ల పల్లెను పాటల పల్లకిలో నిలపడం వీలైంది. కృష్ణశాస్త్రి గేయకవితల వల్లివేత చలువనే నా పాటల సొబగు. ఆముక్త మాల్యద, మృచ్ఛకటికం, హరిశ్చంద్ర, చింతామణి, కాళిదాసు అన్ని రచనలను భక్తితో తాదాత్మ్యంతో గానం చేస్తా. ఆ ఛాయ కొంత నా పాటకు అబ్బి ఉంటది. బతుకు, ఉద్యమ నేపథ్య గేయాలలో గద్దరన్న ఎంత ఆదర్శమో, ప్రకృతి పల్లె వర్ణనకు దువ్వూరి, కృష్ణదేవరాయల పద్యాలు నా మనోసీమలో రాగఝరులై అలరిస్తుంటాయి. 


ఒక్కోమారు వెంకన్న అన్నిపాయలు దాటి సూఫీలా దర్శనమిస్తాడు. ఈ సూఫీతత్వం ఎలా అబ్బింది?

దీవి సుబ్బారావులాంటి వారి అనువాదాలు చదివాక సూఫీ పంథాలో విషయాన్ని వర్ణించే స్పృహ కలిగింది. కానీ, చిన్నప్పుడు వరిపొలాల దగ్గర, బావుల దగ్గర సూఫీ దర్గాలు, ఆకుపచ్చ జెండాలు, పీర్లా దట్టీలు, అల్లాకే నామ్‌ పాటలు తెలియకుండానే నాకు పలెల్లో అందరిని అల్లుకున్నట్టుగానే నన్ను అల్లుకున్నాయి. సూఫీ సాహిత్య పరిచయం లేకముందే సంచారమే ఎంత బాగున్నది, తెల్లారి పోతుంది హరిదాస, బాటసారిలాంటి గేయాలు రాసుకున్న. అచలం, సూఫీ, బైరాగి సంప్రదాయం, సిద్ధ సంప్రదాయం, అమనస్కం, మార్క్సిజం, బుద్ధిజం అన్నిటి భావ సమ్మిశ్రతనే నాలో కొన్ని పాటలు రాయడానికి కారణమయ్యాయి. విశ్వొద్దీన్‌, అహ్మదుద్దీన్‌ (భాస్కర్‌ యోగి చేసిన పరిచయం), బందే నవాజ్‌, అమీర్‌ కుస్రో, రూమీ, షంషుద్దీన్‌ల అనువాదాలంటే నాకు ఎంతో ప్రీతి. 


నోమ్‌ ఛామ్‌స్కీ భాషా సంస్కృతులులేని జాతులు అంతరిస్తాయం టాడు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక దాడిని ఎదుర్కొంటున్న ప్రజల భాషకు మీ పాట... ఎలాంటి పట్టం కట్టింది?

భావనా పటిమతో జీవద్భాషనే ఏ ప్రక్రియకైనా మౌలిక ఆలంబన. భాష భావ ప్రకటన సాధనమేకాకుండా బతుకు మూలాలను నిలిపేది కూడా. భాషను కాపాడుకోవడం అంటే మన మౌలిక స్వాభిమానాన్ని కాపాడుకు న్నట్టు. నా పాటలోని భాషంతా నా ఊరునేపథ్యం-వ్యవసాయాధారిత, సేవక వృత్తుల నుండి పురుడు పోసుకున్నది. రచయితలు దోసిలొగ్గితే సంచార కళాకారులైన హరిదాసులు, జంగమదేవరలు, జమిడిక వాయించే బైండ్ల వాళ్లు, సీత శోకాన్ని మోసుక తిరిగే బాల సంతులు కనుమరుగవుతున్నా, ఇంకా మారుమూల ప్రాంతాల్లో వెతుకులాడితే మిణుకుమిణుకుమంటూ కొడిగట్టిన దీపాలలాగ మిగిలి ఉన్నవాళ్లు, మనకు భాషా బిక్షను ఒంపు తారు. మాండలిక సొగసే రచనకు సారభూతమైన దినుసు.


నేడు దేశంలో పరిస్థితులను మీరు ఎట్లా చూస్తున్నారు, ఏం రాశారు?

దేశీయ మూలాలను తడుముతూ ఇటీవల రాసిన పాట మీరు విన్నారు. అచలం, బైరాగి, అమనస్క, సిద్ధ సంప్రదాయాల తాత్వికను ఆధ్యాత్మిక సిద్ధాం తాలను మనం సొంతం చేసుకోకపోవడం వల్ల మత ఉన్మాదాలు జడలు విప్పుతున్నాయి. నేను హిందువునే గానీ, మీ హిందువును కాను. నేను శివహిందువును. నేను హిందువునే గానీ, నేను రమణమహర్షి హిందు వును. నేను హిందువునే గానీ, నేను వీర బ్రహ్మం హిందువును... అల్లమా ప్రభువు, అక్కమహాదేవి హిందువును. నేను లౌకికవాదినే గానీ, మతం పేరుతో మనుషులను తలనరికే జీహాదీలను ఆమోదించను. జలాలుద్దీన్‌, షంషద్దీన్‌, అమీర్‌ ఖుస్రో, గాలిబ్‌, బందే నవాజ్‌, విశ్వోద్దీన్‌ వంటి సూఫీ గురువుల బోధలే సహనానికి జాడలు. బౌద్ధమే విశ్వానికి జ్ఞానదీపం.

(కబీర్‌ సమ్మాన్‌ జాతీయ పురస్కారాన్ని గోరటి వెంకన్న అందుకుంటున్న దర్భంగా)

పసునూరి రవీందర్‌
Advertisement
Advertisement
Advertisement