Abn logo
Sep 15 2021 @ 04:08AM

సన్నకారు రైతుల వెంటే మా సర్కారు

  • డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు.. డబుల్‌ ప్రయోజనాలు!
  • అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఉత్తరప్రదేశ్‌: మోదీ ప్రశంసలు


అలీగఢ్‌, సెప్టెంబరు 14: సన్నకారు రైతుల వెంటే తమ ప్రభుత్వం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాగుచట్టాల తర్వాత ఏడాది కాలంగా రైతులు పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో.. తొలిసారి ఆయన సన్నకారు రైతుల గురించి మాట్లాడారు. ‘‘2 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులంతా సన్నకారు కేటగిరీలోకి వస్తారు. ప్రతి 10 మంది రైతుల్లో 8 మంది ఈ కేటగిరీ వారే. సన్నకారు రైతుల సాధికారతకు ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్నాం. రైతుల బీమా పథకం, కిసాన్‌ క్రెడిట్‌కార్డులు, కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచడం ఇందులో భాగమే’’ అని ఆయన గుర్తుచేశారు. మంగళవారం ఆయన అలీగఢ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌, రాజా మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు.  కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు ఉంటే.. డబుల్‌ ప్రయోజనాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌ చక్కటి ఉదాహరణ అన్నారు. 20వ శతాబ్దంలో యూపీని గ్యాంగ్‌స్టర్లు, మాఫియా పాలిస్తే.. 21వ శతాబ్దిలో.. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆ సంస్కృతికి చరమగీతం పాడామన్నారు. 


‘‘ఉత్తరప్రదేశ్‌లో 2017కు ముందు గ్యాంగ్‌స్టర్లు, మాఫియాల హవా నడిచేది. వారిదే రాజ్యం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో అలాంటి శక్తులన్నీ ఊచలు లెక్కిస్తున్నాయి. గతంలో పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారికి చేరడంలో ఎన్నో అడ్డంకులుండేవి. ఇప్పుడు పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి’’ అని వివరించారు. రాజా మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని, విద్యావేత్త అని మోదీ కొనియాడారు.  యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు యూపీ చక్కటి గమ్యస్థానంగా మారిందని, యోగి సర్కారు తీసుకుంటున్న చర్యలవల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ‘‘ఒకప్పుడు అలీగఢ్‌ తాళాలు దేశంలోని ఇళ్లకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేవి. ఇప్పుడు అలీగఢ్‌లో తయారయ్యే డిఫెన్స్‌ ఉత్పత్తులు దేశ సరిహద్దుల్లో భద్రత కల్పిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. డిఫెన్స్‌ ఉత్పత్తుల దిగుమతుల నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని, ఇకపై ఈ ఉత్పత్తుల విషయంలో అలీగఢ్‌ పాత్ర కూడా కీలకం కానుందని చెప్పారు. ఆధునిక గ్రెనేడ్లు, రైఫిళ్లు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు మనదేశంలోనే తయారవుతున్నాయని వివరించారు.