మా నాన్న కరోనాతో చనిపోలేదు.. సాయం చేయండి..

ABN , First Publish Date - 2020-08-13T21:07:59+05:30 IST

కరోనాతో మనుషులు భయపడిపోతున్నారు. ఒక్కోసారి భయంతోనే చనిపోతున్నారు.

మా నాన్న కరోనాతో చనిపోలేదు.. సాయం చేయండి..

చిత్తూరు జిల్లా: కరోనాతో మనుషులు భయపడిపోతున్నారు. ఒక్కోసారి భయంతోనే చనిపోతున్నారు. మరోవైపు ఇతరాత్ర రోగాలతో సతమతమవుతున్నవారిని, ప్రమాదాలబారినపడినవారినో కరోనా భయం ఊపరి తీసేస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. పలమనేరులో ఓ వృద్ధిడిని ఆవు తొక్కి గాయపరిచింది. తీవ్ర అస్వస్థతకు గురైన తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు కుమార్తె ఎంతగానో తాపత్రయపడింది. తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం వృధా అయింది. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందనడానికి ఇంతకుమించిన నిదర్శనం ఇంకోకటి ఉండదు. చివరికి మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. తన తండ్రి కరోనాతో చనిపోలేదని, ఆవు తొక్కి గాయపర్చడంతో చనిపోయాడని కనిపించినవారి అందరికీ చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు.  


చిత్తూరు జిల్లా, గంగవరం మండలం, కలగటూరు గ్రామానికి చెందిన వెంకట్రామయ్య (73) శనివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా ఆవు దాడి చేసింది. అతని గుండెలపై కాలుపెట్టి తొక్కడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. తన తండ్రికి వైద్యం చేయించాలని ఆవు యజమానిని అడిగింది. కానీ అతను పట్టించుకోలేదు. దీంతో తన తండ్రిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆటోలో మళ్లీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు. దీంతో ఆటో వ్యక్తి అక్కడ మృత దేహాన్ని దించేసి వెళ్లిపోయాడు. కరోనాతో చనిపోయాడని భావించి స్థానికులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని కలగటూరుకు తరలించారు.

Updated Date - 2020-08-13T21:07:59+05:30 IST