Advertisement
Advertisement
Abn logo
Advertisement

మన రాజ్యాంగం ఓ విప్లవ ప్రణాళిక

డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తులు, సంపద, రాజకీయాలు, విద్య, వివాహం, హిందూమతాన్ని ప్రజాస్వామ్యీకరించాలి. ఇదే బహుజన ప్రజాస్వామిక విప్లవం. ఈ విప్లవం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రారంభమైంది. ఆ విప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. వాటిని సమగ్రంగా సాధించడమనేది బహుజనుల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంది. 


గణతంత్ర దినోత్సవం ఏమిటి? ‘1950 జనవరి 26 అనేది మమ్మల్ని మనుషులుగా లెక్కించిన రోజు’- ఇది, భారత రాజ్యాంగం గురించి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చేసిన అద్భుత వ్యాఖ్య. ఈ వ్యాఖ్య చేయడానికి ఒక కారణం ఉంది. మన సమాజంలో మనుషులందరూ సమానమే అన్న భావన ఏనాడూ లేదు. వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ మనుషుల్లో హెచ్చుతగ్గులు సృష్టించి స్థిరపరిచాయి. భారత రాజ్యాంగం ప్రప్రథమంగా అందుకు భిన్నంగా మనుషులందరూ సమానమేనని గుర్తించింది. ఈ దృష్ట్యా భారత రాజ్యాంగ విప్లవ స్వభావం గురించి చర్చ జరగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.


ఈ చర్చకు అగ్రశ్రేణి మార్క్సిస్టు మేధావి అయిన ప్రభాత్ పట్నాయక్ మన రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలను పునాదిగా చేసుకోవలసి ఉంది. ‘భారతీయ సామాజిక చరిత్ర వ్యవస్థీకృత అసమానతలతో నిండిపోయి ఉంది. మన రాజ్యాంగం ప్రజలకు సార్వత్రిక ఓటుహక్కు కల్పించడం ద్వారా రాజకీయరంగంలో సమానత్వాన్ని ఆమోదించింది. కాబట్టి రాజకీయ సమానత్వం ద్వారా సామాజిక, ఆర్థిక రంగాలలో సమానత్వాన్ని తీసుకురావాల’న్న డాక్టర్ అంబేడ్కర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ భారత రాజ్యాంగానికి విప్లవ స్వభావం ఉందని ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ఈ విప్లవ స్వభావానికి రెండు రకాల రాజ్యాంగ ఉద్యమాలు పునాదిగా ఉన్నాయని ఆయన అన్నారు. మొదటిది బ్రిటిష్ వలసపాలన వ్యతిరేక ఉద్యమం కాగా రెండోది పూలే నుంచి అంబేడ్కర్ దాకా సాగిన సామాజిక విముక్తి ఉద్యమాలని ఆయన తెలిపారు. 


వైపరీత్యమేమంటే ఈ దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా భారత రాజ్యాంగ ఆవిర్భావాన్ని దీర్ఘకాలిక విప్లవంగా గుర్తించడం లేదు. అందుకే అవి జనతా ప్రజాతంత్ర, సోషలిస్టు విప్లవ కార్యక్రమాలను ప్రకటించుకుని పనిచేస్తున్నాయి. అన్ని కమ్యూనిస్టు పార్టీలు భారత రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగమని దాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ప్రకటించుకున్నాయి. మరి ఆ పార్టీల వారే ఇటీవలికాలంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం పిలుపులు ఇస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాజ్యాంగం విషయంలో వారి అంచనాలు సరైనవి కావని స్పష్టమయింది. 


మన రాజ్యాంగం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వాన్ని సాధించేందుకు సామాజికన్యాయాన్ని లక్ష్యంగా ప్రకటించుకున్నది. దీనికి సంబంధించే రాజ్యాంగంలో అనేక అధికరణలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులేనని 14వ అధికరణం ప్రకటించింది. మతం, జాతి, కులం, లింగం, ప్రాంతాన్ని బట్టి వివక్ష పాటించడాన్ని 15వ అధికరణం నిషేధించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అధికరణం 16 నిర్దేశించింది. 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది. 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛను, 21వ అధికరణం పౌరరక్షణ, వ్యక్తిగతస్వేచ్ఛను కల్పించాయి. వెట్టిచాకిరిని 23వ అధికరణం రద్దు చేసింది. 14 ఏళ్ల లోపు పిల్లలచేత ప్రమాదకర పనులు చేయించరాదని 24వ అధికరణం స్పష్టం చేసింది. సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని సమృద్ధపరిచేందుకు ప్రభుత్వం పాటుపడాలని అధికరణం 38 పేర్కొంది.


అలాగే స్త్రీపురుషులిరువురికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పిల్లలు దోపిడీకి గురికాకుండా ఆరోగ్యంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించాలని ప్రకటించింది. ప్రతి పౌరుడూ సమానావకాశాలు పొందటానికి న్యాయవ్యవస్థ పనిచేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అధికరణం 39(ఎ) ఆదేశించింది. ముఖ్యంగా 46వ అధికరణం బలహీన తరగతులకు చెందిన వారి పిల్లలు విద్యాపరంగా, ఆర్థికపరంగా ఎదిగేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులను అన్ని రకాల అన్యాయాలు, దోపిడీ నుంచి రక్షించాలి. ప్రజలందరికీ పౌష్టికాహార స్థాయి, జీవన ప్రమాణాలు పెంచడం ప్రభుత్వ బాధ్యత అని 40వ అధికరణం చెప్పింది. ఇంకా ఎన్నో అధికరణాలు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి వివరించాయి.

 

అందుకనే ‘భారత రాజ్యాంగం ప్రథమంగా ఒక సామాజిక పత్రం’ అని గ్రాన్ విల్లి ఆస్టిన్ వ్యాఖ్యానించాడు. భారత రాజ్యాంగంలోని అత్యధిక అధికరణాలు సామాజిక న్యాయ లక్ష్యాలను సాధించడానికి లేదా సామాజిక విప్లవ ఉద్దేశాలను సాధించడానికి అవసరమైన పరిస్థితులను స్థాపించడం కోసమే నేరుగా ఉద్దేశించినవి. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మొత్తం రాజ్యాంగం జాతీయ పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకుని సామాజిక న్యాయాన్ని సాధించడానికి మూడవ భాగంలోని ఆర్టికల్స్ కృషి చేస్తున్నాయి. ప్రాథమిక హక్కులు, రాజ్య విధానపు ఆదేశికసూత్రాలు ఈ లక్ష్యం వైపుగా పయనించడానికి ఉద్దేశించినవి. రాజ్యాంగంలోని 3, 4వ భాగాలు అతి ముఖ్యమైనవని ఆస్టిన్ అంటాడు. అయితే ఇంతటి విప్లవ స్వభావం కలిగిన రాజ్యాంగాన్ని అటు కమ్యూనిస్టు శ్రేణులు ఇటు బహుజన శ్రేణులు కూడా సరిగా గుర్తించలేకపోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా బలహీన వర్గాల వారు చట్టసభలలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవచ్చు. అందుకోసం తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వతంత్ర రాజకీయాలు చేయాలి. తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలా దామాషా ఎన్నికల పద్ధతిని వారు డిమాండ్ చేయవచ్చు. 


ఇవాళ దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నారు. సంక్షేమ వ్యయాలపై కూడా ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయి. ఈ పరిణామాలను ‘సామాజిక ప్రతీఘాత విప్లవం’గా ప్రభాత్ పట్నాయక్ విశ్లేషించారు. ఈ ప్రతీఘాత విప్లవం ప్రధానంగా దళితులు, మైనారిటీలు, మహిళలను కేంద్రంగా చేసుకుని కొనసాగుతోందని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితులలో అణగారిన కులాలు, తరగతులు రక్షణ పొందాలంటే వారి ప్రాతినిధ్యం పెరగాలి. అంటే శాసనాలు చేసే రాజకీయ అధికారం ఉన్నప్పుడే ప్రస్తుత పరిస్థితుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.


అలాగే ఇప్పటివరకు 15 శాతంగా ఉన్న అగ్రకులాలు రాజకీయాలలో 66.5 శాతం, వాణిజ్య వ్యాపార రంగాల్లో 97 శాతం, ఉపాధి 87 శాతం వాటాలు పొందడం అనేది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధం. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తులు, సంపద, రాజకీయాలు, విద్య, వివాహం, హిందూమతాన్ని ప్రజాస్వామ్యీకరించాలి. దీన్నే బహుజన ప్రజాస్వామిక విప్లవం అని అంటున్నాను. ఈ విప్లవం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రారంభమైంది. ఈ విప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. ఆ సమున్నత లక్ష్యాలను సమగ్రంగా సాధించడమనేది బహుజనుల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంది.


డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు

(నవంబర్ 26: రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిన రోజు)

Advertisement
Advertisement