‘తెల్లారే వరకు వదిలేయండి.. మా పిల్లలు బతికొస్తారు.. ఆపై నేనే పోలీసు స్టేషన్‌కు వస్తా..’

ABN , First Publish Date - 2021-01-25T07:59:51+05:30 IST

‘తెల్లారే వరకు మమ్మల్ని వదిలేయండి. మా పిల్లలు..

‘తెల్లారే వరకు వదిలేయండి.. మా పిల్లలు బతికొస్తారు.. ఆపై నేనే పోలీసు స్టేషన్‌కు వస్తా..’
బంధువులను విచారిస్తున్న డీఎస్పీ రవి మనోహరాచారి

మా పిల్లలు బతికొస్తారు!

తెల్లారే వరకు వదిలేయండి 

పోలీసులతో యువతుల తల్లి వాదన 

మదనపల్లెలో సంచలనం కలిగించిన ఇద్దరి బలి 

అర్ధరాత్రి తర్వాత క్లూస్‌ టీమ్‌ పరిశీలన 


మదనపల్లె(ఆంధ్రజ్యోతి): ‘తెల్లారే వరకు మమ్మల్ని వదిలేయండి. మా పిల్లలు బతికొస్తారు. ఆపై నేనే పోలీసు స్టేషన్‌కు వస్తాను’ అంటూ పూజలకోసం ఇద్దరు బిడ్డలను బలి తీసుకున్న ఘటనలో తల్లి పద్మజ పోలీసులతో అన్నారు. ఆదివారం రాత్రి మదనపల్లెలోని టీచర్స్‌ కాలనీలో ఇద్దరు కూతుళ్లను మూఢనమ్మకాలతో ‘బలి’చ్చిన ఘటన విషాదం నింపింది. శివాలయంవీధిలోని మల్లూరు పురుషోత్తంనాయుడు ప్రభుత్వ మహిళ డిగ్రికళాశాల వైస్‌ప్రిన్సిపల్‌. ఉన్నత విద్యాంతురాలైన ఆయన భార్య పద్మజ ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు అలేఖ్య(27), సాయిదివ్య(23). అరగొండ సమీపంలోని కొండ్రాజుకాలువకు చెందిన వీరు పాతికేళ్ల క్రితం ఇక్కడ స్థిరపడ్డారు.


వీరింట్లో నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా పూజలు చేస్తున్నారు. శనివారం ఉదయం బుగ్గకాలువకు చెందిన ఓ స్వామిని పిలిపించి, ఇంటిచుట్టూ పూజలు చేసి నిమ్మకాయలు కట్టారు. పురుషోత్తంనాయుడు సహ ఉద్యోగిని పిలిపించి పూజలు గురించి వివరించారు. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు అమ్మాయిలు ఇంటిచుట్టూ ప్రదక్షణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు తన స్నేహితుడికి పురుషోత్తం ఫోనుచేసి ఇంటికి పిలిచాడు. అరగంట తర్వాత అతడితో కలిసి ముగ్గురు రాగా.. బయట వేపాకుతో నిలబడి ఉన్నాడు. ‘అంతా అయిపోయింది. పూజల పేరుతో నా భార్య ఇద్దరు బిడ్డలను చంపేసింది’ అని చెప్పినట్లు తెలిసింది. తాను వేపాకు కోసం కిందకు వచ్చానంటూ వారికి చెప్పారు. అనంతరం వీరు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో.. ఇద్దరు కూతుళ్లను తల్లి చంపేసిందన్న విషయం పట్టణంలో ప్రచారం జరిగింది.


ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. పలువురు టీచర్స్‌ కాలనీలోని శివాలయం వీధికి చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. లోపలకు ఎవరినీ రానీయకుండా విచారణ చేపట్టారు. మరోవైపు ఆ ఇంటి ముందు ఒకటే కలకలం. ఆ తల్లిదండ్రులను బయటకు పంపిస్తే తామే చంపేస్తామంటూ కేకలు వేశారు. ‘విద్యాబుద్ధులతో ఎందరినో ఉన్నత స్థాయికి చేర్చారు. మూఢ భక్తితో సొంత కూతుళ్లను ఇలా బలి చేశారు’ అంటూ బంధువులు వాపోయారు. ‘పురుషోత్తానికి భక్తి ఉందని తెలుసు. తమిళనాడులోని ఓ ఆశ్రమానికి చెందిన పుస్తకాలు చదువుతుంటారు. కానీ, వీరింట్లో వాళ్లు ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారని తెలియదు’ అంటూ ఆయన సహ లెక్చరర్లు పేర్కొన్నారు.



అర్ధరాత్రి మృతదేహాల తరలింపు 

ఇంటి ముందు గుమికూడిన స్థానికులు వెళ్లిపోయాక అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో అలేఖ్య, సాయిదివ్య మృతదేహాలను పోలీసులు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి పంపారు. ఆ పిల్లల తల్లిదండ్రులను ఇంట్లో పెట్టి, బంధువుల ద్వారా వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు క్లూస్‌టీమ్‌ ఇంట్లో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తోంది. పూజల వెనుక జరిగిన ఈ హత్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పోలీసు విచారణలో ఇవన్నీ నిగ్గు తేలనున్నాయి.



ఆధ్యాత్మిక స్థాయి దాటి తల్లిదండ్రుల ప్రవర్తన 

అమ్మాయిలిద్దరూ ఉన్నత విద్యావంతులే. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు కూడా మంచి విద్యా వంతులే. వారి ఆధ్యాత్మిక స్థాయి దాటి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పటికీ వారు.. ఒక రోజు టైం ఇస్తే పిల్లలు బతికివస్తారని అంటున్నారు. ఏం జరిగింది..ఎలా జరిగింది..అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారిస్తాం. సీసీ పుటేజీ ఆధారంగా ఆ ఇంట్లోకి ఎవరెవరు వచ్చారన్న దానిపై దర్యాప్తు చేస్తాం.  

- రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె


Updated Date - 2021-01-25T07:59:51+05:30 IST