దేశబాంధవి

ABN , First Publish Date - 2022-08-06T05:45:54+05:30 IST

జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళిన ద్వితీయ మహిళగా, ప్రథమ ఆంధ్ర మహిళగా దువ్వూరి సుబ్బమ్మ చరిత్రలో ఎనలేని స్థానం సంపాదించుకున్నారు. దేశ సేవలో ఆంధ్ర మహిళలకు ఆమె ఒరవడి దిద్ది, గురువులయ్యారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో...

దేశబాంధవి

మన ధీర వనిత

దువ్వూరి సుబ్బమ్మ జననం: 1880 నవంబరు  

మరణం: 31.5.1964


జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళిన ద్వితీయ మహిళగా, ప్రథమ ఆంధ్ర మహిళగా దువ్వూరి సుబ్బమ్మ చరిత్రలో ఎనలేని స్థానం సంపాదించుకున్నారు. దేశ సేవలో ఆంధ్ర మహిళలకు ఆమె ఒరవడి దిద్ది, గురువులయ్యారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బహిరంగ సభల్లో ఉపన్యాసిస్తూ, బ్రిటిష్‌ వారి దోపిడీనీ, భారతీయులు నిస్సహాయులై భరిస్తున్న బాధలనూ వివరించేవారు. రామాయణ, భారత, భాగవతాల నుంచి అనేక ఘట్టాలను శ్రావ్యమైన చక్కని కంఠంతో వినిపిస్తూ, బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఏ రావణాసురుడితోనో సరిపోల్చి చెప్పేవారు. ఏ మైకులూ లేని ఆ కాలంలో ఆమె కంఠం ఎంతో దూరానికి వినిపించేది. 


ఇంత బహిరంగంగా, వేలకొద్దీ జనానికి ‘తెల్లదొరతనం వద్ద’ని విప్లవ మంత్రం ఉపదేశించుతూ ఉంటే... ప్రభుత్వ అధికారులుగా పోలీసు వారు డప్పులు, డబ్బాలు మోగించి... ఆమె పాట, మాట వినబడకుండా చేసేవారు. ఆమె కోపం పట్టలేక ‘‘ఏమోయి అధికారీ! నేనంటే ఏమిటనుకున్నావు? గంగా భగీరథీ సమానురాలను. తలచుకుంటే నిన్ను, నీ డప్పులను, నీ పోలీసు వాళ్ళను గంగలో ముంచెత్తగలను. కానీ అహింసా వ్రతాన్ని చేపట్టాను. అందుకని అంత పని చేయడం లేదు’’ అని గర్జించేవారు. పోలీసువారు కంగారు పడుతూ వచ్చిన దోవన పోయేవారు. మరికొన్ని సభల్లో... పోలీసు అధికారులు కనిపించగానే ‘‘ఏమోయి బ్రిటిష్‌ వారి బానిసా! రా, రా! నన్ను పట్టుకో’’ అని అరిచేవారు. అధికారులు ఇబ్బందిగా అటూ ఇటూ చూసి వెళ్ళిపోయేవారు.


దువ్వూరి సుబ్బమ్మ 1880నవంబరులో మధ్యతరగతి సనాతన కుటుంబంలో జన్మించారు. ప్రస్తుత కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం ఆమె జన్మస్థలం. మల్లాది సుబ్బావధాన్లు కుమార్తె అయిన ఆమెకు చిన్నతనంలోనే కడియం గ్రామవాసి దువ్వూరి వెంకటప్పయ్యతో వివాహం జరిగింది. సుబ్బమ్మగారు సంస్కృత, ఆంధ్ర భాషలలో విదుషీమణి. చల్లపల్లి వెంకట శాస్త్రి శిష్యురాలు. గొప్ప వేదాంతి. ఆడపిల్లలకు హైస్కూళ్ళు కూడా లేని ఆ రోజుల్లో, చిన్నప్పుడే వివాహమై అత్తవారింటికి వెళ్ళిన ఆమెకు... అంతటి వేదాంత పరిచయం గొప్ప విద్వత్తు ఉండేదంటే ఆమె సాధన ఎంతటిదో ఊహించుకోవచ్చు.


1921 వరకూ ఏ రాజకీయాలూ ఆమె ఎరుగరు. అప్పుడే గాంధీ మహాత్ముడి స్వాతంత్య్ర సమర శంఖారావం దేశం నలుమూలలా పిక్కటిల్లింది. అప్పటికి ఆమె భర్త చనిపోయి కొన్ని నెలలే అయింది. అయినా ఇవేవీ ఆమెకు అడ్డు రాలేదు. రణరంగంలో ప్రవేశించారు. ఆ సంవత్సరమే కాకినాడలో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ఆధ్వర్యాన జరిగిన ప్రథమ తూర్పు గోదావరి జిల్లా మహా సభకు హాజరయ్యారు. సంపూర్ణ స్వాతంత్య్ర సంపాదనమే జాతీయ మహాసభ ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచిస్తూ బులుసు సాంబమూర్తి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆమె బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు. స్త్రీలు అంత అనర్గళంగా బహిరంగ సభల్లో ఉపన్యసించడం ఎరగని ప్రజలు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆమె ఉపన్యాసమంటే ప్రజలు పది మైళ్ళు నడచి వెళ్ళేవారు. 


ఆమె ఏ పని చేసినా మొదటినుంచీ పోలీసువారికి, ప్రభుత్వానికి ఒక సమస్యగా తయారై, వాళ్ళను ఇరకాటాన పెట్టేది. అప్పటి వరకూ భారతదేశం మొత్తం మీద... అరెస్టైన మహిళ పంజాబుకు చెందిన పార్వతీదేవి మాత్రమే. కాబట్టి స్త్రీలను ఖైదు చేయడం గురించి అప్పటి ప్రభుత్వం అంతగా ఆలోచించనే లేదు. ఆంధ్రదేశంలో సుబ్బమ్మగారే ఈ సమస్య తెచ్చిపెట్టారు.. ధైర్యం చేసి ఒకసారి బంధిస్తే, ఆమె నిష్టా నియమాలకు జైలు జీవితం ఎటూ సరిపోదు. కాబట్టి తానే క్షమాపణ చెప్పి బయటకు రాగలరనే ఆశతో అధిరారులు ఒక పాచిక వేశారు. 1922 ఏప్రిల్‌ 4న ఆమెను అరెస్టు చేసి కేసు పెట్టారు. ఒక సంవత్సరం కఠిన శిక్ష విధించి, రాజమండ్రి జైలుకు పంపించారు. కానీ అది ఒక సమస్యే కాదన్నట్టు ఆమె వ్యవహరించడంతో... కలెక్టరు తదితరులు స్వయంగా వచ్చి ‘‘అమ్మా! మీరు రాత మూలకంగా కాకపోయినా నోటి మాటగా క్షమాపణ చెప్పినా వెంటనే విడుదల చేస్తామ’’న్నారు. ‘‘నా కాలి గోరు కూడా అటువంటి పని చేయద’’న్నారామె. అవమానంతో వెనుతిరిగిన అధికారులు ఆమెను రకరకాల ఇబ్బందులు పెట్టి లొంగతీసుకోవాలని చూశారు. అది వాళ్ళ తరం కాలేదు. ఏడాది పూర్తి శిక్ష అనుభవించి ఆమె బయటికి వచ్చారు. జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళిన ద్వితీయ మహిళగా, ప్రథమ ఆంధ్ర మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు. 


గాంధీ ఆదేశానుసారం ఆంధ్రదేశం నలుమూలలా ఆమె కాంగ్రెస్‌ కార్యక్రమాల గురించి ప్రచారం చేసేవారు. రాజమండ్రిలో మహిళలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తుండేవారు. అక్కడే ‘సనాతన విద్యాలయం’ అనే పేరుతో జాతీయ విద్యాలయం స్థాపించారు. సంస్కృతం, తెలుగు, కుట్టు పనుల్లాంటివి బోధించి... అవసరమైన స్త్రీలకు ఒక జీవికను కల్పించారు. ఉదారులైన ప్రజల నుంచి విరాళాలు సేకరించి, చదువు ఉచితంగా చెప్పడమే కాక, వారికి ఉచితంగా భోజన వసతి కల్పించారు. 


ఇంతలో దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహం వచ్చాయి. అందులో పాల్గొన్న ఆమెను 1930 మే 31న అరెస్ట్‌ చేసి, మొదటి పంక్తిలోనే ఆమెకు జైలు శిక్ష వడ్డించింది ప్రభుత్వం. కాంగ్రెస్‌ నడిపిన ప్రతి కార్యక్రమంలోనూ సుబ్బమ్మగారు పాల్గొన్నారు. 1932లో ‘శాసనోల్లంఘనం’, 1940లో ‘వ్యక్తి సత్యాగ్రహం’, 1942లో ‘క్విట్‌ ఇండియా’ కార్యకలాపాలలో ప్రధాన పాత్ర వహించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్ళకు వెళ్ళారు. 14 సంవత్సరాలపాటు అఖిల భారత కాంగ్రెస్‌ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. కలలు ఫలించి, స్వరాజ్యం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం కూడా సిద్ధించింది. వృద్థాప్యంలో, అనారోగ్యంతో... సంతానం లేని ఆమె తన సోదరుని దగ్గర సేవలు పొందుతూ 1964 మే 31న తనువు చాలించారు.


దువ్వూరి సుబ్బమ్మ ప్రజలకు గౌరవాస్పదురాలైన లోకబాంధవి. మహిళాభ్యుదయ, జాతీయ ఉద్యమాలలో ఆంధ్ర మహిళలకు గురువుగా, పూజనీయగా స్థిరమైన కీర్తిని పొందగలిగిన ధన్యురాలు. 



 ‘సనాతన విద్యాలయం’  పేరుతో జాతీయ విద్యాలయం స్థాపించారు. సంస్కృతం, తెలుగు, కుట్టు పనుల్లాంటివి బోధించి... అవసరమైన స్త్రీలకు ఒక జీవికను కల్పించారు.  చదువు ఉచితంగా చెప్పడమే కాక, వారికి ఉచితంగా భోజన వసతి కల్పించారు. 


(‘స్వతంత్ర సమరంలో ఆంధ్రమహిళలు’ సంకలనం నుంచి)

Updated Date - 2022-08-06T05:45:54+05:30 IST