- మాజీ మంత్రి బాలినేని ఆరోపణ
- నా కుమారుడిపైనా దుష్ప్రచారం
- కవితారెడ్డిని నేనేమీ అనలేదు
- వాళ్లే ఆమెతో టచ్‌లో ఉన్నారు
- తప్పుచేసినట్లు రుజువు చేస్తే రాజకీయాలకు గుడ్‌బై
- బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 27: ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి సొంత పార్టీకి చెందిన ఓ పెద్ద నేత తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, వైసీపీ ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారమిక్కడ తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావుతో కలిసి తమ పార్టీకి చెందిన కొందరు ఓర్వలేని వ్యక్తులు.. తనను, తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. మద్యం తాగి తాను ఓ జనసేన మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసినట్లు ప్రచారం చేయడం వెనుక టీడీపీ ఉందన్నారు. అల్లూరుకు చెందిన కవితారెడ్డి నిత్యం దామచర్ల జనార్దన్, మంత్రి శ్రీనుతో ఫోన్ టచ్‌లో ఉన్నారని ఆరోపించారు.
ఈ కుట్రలో వైసీపీ పెద్ద నేత కూడా ఉన్నారని, ఆయన కవితకు టచ్‌లో ఉన్నారని తెలిపారు. మొన్నటి వరకు తనను హవాలా మంత్రి అని ప్రచారం చేయించడంతోపాటు తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిపై దుష్పచారం ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. తాను నిజంగా తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను కూడా ఉప్పు, కారం తింటున్నానని, కానీ ఓపికతో ఉంటున్నానని తెలిపారు. ఓపిక నశించే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, ఇది మంచిది కాదని చెప్పారు. అల్లూరు కవితారెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాల్‌డేటా తీస్తే ఎవరి బండారం ఏమిటో బయటపడుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేయడంతోనే కేసులు ఉపసంహరించుకున్నామని.. ఆయన కూడా నిజాలు తెలుసుకుంటే మంచిదని బాలినేని సూచించారు.