మా సంతకాలన్నీ ఫోర్జరీ

ABN , First Publish Date - 2021-03-05T07:34:39+05:30 IST

ప్రత్యర్థి అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని భయపడినందునే అధికార వైసీపీ నేతలు చిత్తూరు కార్పొరేషన్‌ను సొంతం చేసుకోవడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారని, తిరుపతి ఏడో డివిజన్‌ తరహాలోనే చిత్తూరులోనూ ఎన్నికలను రద్దుచేయాలని వైసీపీ ఏకగ్రీవం చేసుకున్న వార్డుల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు.

మా సంతకాలన్నీ ఫోర్జరీ
36వ డివిజన్‌ సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం నేతలు

చిత్తూరు ఎన్నికలూ రద్దు చేయండి!

ఎస్‌ఈసీకి బాధిత అభ్యర్థుల ఫిర్యాదు

పోటీకి భయపడే వైసీపీ ఇంతకు తెగించిందని ఆరోపణ

22 డివిజన్లలో అభ్యర్థులు లేకుండానే ఉపసంహరణలు

చిత్తూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రత్యర్థి అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని భయపడినందునే అధికార వైసీపీ నేతలు చిత్తూరు కార్పొరేషన్‌ను సొంతం చేసుకోవడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారని, తిరుపతి ఏడో డివిజన్‌ తరహాలోనే చిత్తూరులోనూ ఎన్నికలను రద్దుచేయాలని వైసీపీ ఏకగ్రీవం చేసుకున్న వార్డుల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. ఊళ్లో లేకపోయినా తమ సంతకాలు పెట్టేసుకుని తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తున్నారు. ఇందువల్లే గతంలో ఎన్నడూలేని విధంగా 37 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుని మేయర్‌ పీఠాన్ని దక్కించుకుందంటున్నారు. ఎన్నికలు జరిగితే 20 డివిజన్లకు తగ్గకుండా టీడీపీ, 4 చోట్ల బీజేపీ- జనసేన, ఒక చోట సీపీఎం- టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందనే అంచనాకు రావడంతోనే వైసీపీ  నాయకులు ఈ చీకటి వ్యూహాలకు తెర లేపారంటున్నారు. అందువల్లే  ఫోర్జరీ సంతకాల అస్త్రం ఉపయోగించి 22 డివిజన్లను అక్రమ మార్గంలో ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శిస్తున్నారు. 


22 డివిజన్లలో ఏకగ్రీవాలను రద్దు చేయాలి

తిరుపతి కార్పొరేషన్‌లోని 7వ డివిజన్‌లో ఫోర్జరీ సంతకాలతో తన నామినేషన్‌ ఉపసంహరించారని బాధిత అభ్యర్థి విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఆ డివిజన్‌లో ఎన్నికలను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ గురువారం నిర్ణయం తీసుకుంది. కాబట్టి చిత్తూరులోనూ అదే తరహాలో ఫోర్జరీ సంతకాలతో విత్‌ డ్రా చేసుకున్న 22 డివిజన్లలో ఏకగ్రీవాలను రద్దు చేయాలని టీడీపీ నాయకులు, బాధిత అభ్యర్థులు గురువారం ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని కలెక్టర్‌కు, మున్సిపల్‌ కమిషనర్‌కు కూడా అందించారు.పోలీస్‌స్టేషన్లలోనూ ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రాత్రే పలువురు టీడీపీ అభ్యర్థులు తమ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా ఎదుట తమ నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించారంటూ వాపోయిన విషయం తెలిసిందే.


గట్టి పోటీ ఇస్తున్న డివిజన్లు ఇవే

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లుండగా.. వాటిలో 22 చోట్ల విపక్షాల అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో వీరిని బరి నుంచి తప్పించేందుకు  ఫోర్జరీ సంతకాలను ఉపయోగించుకున్నారు. 2వ డివిజన్‌లో వెంకటేష్‌, 5లో రాజ్‌కుమార్‌, 9లో వనజమ్మ, 10లో లక్ష్మి, 12లో రాజానాయుడు, 14లో భార్గవి, 21లో లక్ష్మీపతి, 22లో రాణి, 28లో భువనేశ్వరి, 30లో ప్రమీల, 34లో వీణారాణి, 37లో మురుగానంద, 42లో ధరణి, 44లో వంశీ ప్రియ, 48లో రతీదేవి, 49లో కుప్పన్‌, 50లో గోపి గట్టి పోటీ ఇస్తుండడంతో ఇక్కడ వాళ్లు లేకపోయినా ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను విత్‌ డ్రా చేశారు. అలాగే 31లో రూపేష్‌, 32లో యశ్వంత్‌, 25లో జయలక్ష్మి, 43లో రామచంద్ర జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా గట్టి పోటీనిస్తున్నారు. దీంతో ఈ డివిజన్లలోనూ ఫోర్జరీ సంతకాల అస్త్రాన్ని ఉపయోగించారంటున్నారు. ఇక 36వ డివిజన్‌లో టీడీపీ తరఫున మాజీ డిప్యూటీ మేయర్‌ సుబ్రి వేసిన నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగా అధికారులు పరిశీలనలో తిరస్కరించారనే ఆరోపణలున్నాయి. దీంతో ఇక్కడ సీపీఎం జిల్లా నేత చైతన్య టీడీపీ సహకారంతో బలమైన ప్రత్యర్థిగా మారారు. దీంతో ఇక్కడా ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవం చేసుకున్నారని చైతన్య ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం 36వ డివిజన్‌ వార్డు సచివాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా చేసి, అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థులూ గురువారం అధికారులు ఫిర్యాదు చేసి ఆందోళనకు దిగారు.


ఫోర్జరీ మోసం

నామినేషన్‌ వేసిన రోజు నుంచి వైసీపీ నేతలు, పోలీసులు మా ఇంటికి వచ్చి విత్‌డ్రా చేసుకోమని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో మేము ఊరొదిలి వెళ్ళిపోయాం.అయితే మా ప్రమేయం లేకుండానే సంతకాలను ఫోర్జరీ చేసి మా డివిజన్‌ను ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. గత ఎన్నికల్లో నేను పోటీలో గెలిచి కార్పొరేటర్‌గా ప్రజలకు సేవ చేశాను. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి వుంటే పోటీలో గెలిచి కార్పొరేటర్‌ పదవి దక్కించుకోవాల్సింది.

- భార్గవి, 14వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి


మా సంతకాలు పెట్టేసుకున్నారు

పోలీసులు, వైసీపీ నేతలు నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకోమని బెదిరిస్తుండడంతో నేను, నా ప్రపోజర్‌ తిరువన్నామలైకి వెళ్ళిపోయాం. మాకు తెలియకుండానే మా సంతకాలను ఫోర్జరీ చేసి మా డివిజన్‌ను ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. నామినేషన్‌ వేసినప్పటి నుంచి పోలీసులు ఇంట్లోకి చొరబడి తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్నికల్లో పోటీచేసి గెలవలేక ఇలా అడ్డదారుల్లో ఏకగ్రీవాలను ప్రకటించుకున్నారు.

-గోపి, 50వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి


విత్‌ డ్రా రోజు తిరుమలలో ఉన్నా

వైసీపీ నేతలకు, పోలీసులకు భయపడి నేను, మా ప్రపోజర్‌ విత్‌ డ్రా గడువున్న రెండు రోజులూ తిరుమలలోనే వున్నాం. అందుకు తగిన ఆధారాలు కూడా మా వద్ద వున్నాయి. అయితే మా సంతకాలను ఫోర్జరీ చేసి మా డివిజన్‌ను ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. ఎన్నికల అధికారులు కూడా ఈ అక్రమ పద్ధతులకు సహకరించడం దారుణం. వైసీపీ నేతలు ఇంత దిగజారిపోతారనుకోలేదు.

-లక్ష్మీపతి నాయుడు, 21వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి


దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలి

 ఎన్నికల్లో పోటీ చేసే అధికారం అందరికీ ఉంటుంది. నా ప్రమేయం లేకుండానే నా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించడం దుర్మార్గం. నిజంగానే నేను విత్‌ డ్రా చేసుకుని ఉంటే అధికారులు వీడియో సాక్ష్యాలను చూపించాలి. లేకుంటే ఏకగ్రీవాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలి.

- చైతన్య, 36వ డివిజన్‌ సీపీఎం అభ్యర్థి

Updated Date - 2021-03-05T07:34:39+05:30 IST