ఓయూలో చిన్న వీరప్పన్‌లు..!

ABN , First Publish Date - 2021-01-11T06:40:12+05:30 IST

సుమారు 1800 ఎకరాల్లో

ఓయూలో చిన్న వీరప్పన్‌లు..!

గంధం చెట్లు మాయం

రెండు చెట్లు నరికి ఎత్తుకెళ్ళిన దుండగులు

ఆస్తులకు కరువైన రక్షణ

నిర్మాణ చర్యలు చేపట్టని అధికారులు

పని చేయని సీసీ కెమెరాలు


ఓయూ ఆస్తులకు రక్షణ కరువవుతోంది. భూములే కాదు.. చెట్లు కూడా మాయం అవుతున్నాయి. విలువైన చెట్లను సైతం దుండగులు నరికేస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి లక్షలాది రూపాయల విలువైన రెండు గంధం చెట్లను నరికి తరలించుకు పోయారు. వాటిలో ఒకటి సైన్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్నది కాగా మరొకటి మాత్రం వీసీ లాడ్జి పక్కనే కావడం గమనార్హం. సౌండ్‌ ప్రూఫ్‌ బ్యాటరీ రంపంతో వాటిని కోసినట్లు తెలుస్తోంది. ఆ రెండు దుండగులు సుమారు 5 అడుగుల పొడవు ఉండవచ్చని ఆ చెట్ల వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒకే రోజు రాత్రి వీటిని నరికి ఎత్తుకెళ్ళారంటే పక్కా ప్రణాళికే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. నాలుగేళ్ళ కిత్రం కూడా ఓయూ నుంచి గంధం చెట్లను నరికి దొంగిలించుకుపోయారు. వాటి వెనుక సెక్యూరిటీ ప్రమేయం కూడా ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఉప్పల్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : సుమారు 1800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓయూలో భూములకు రక్షణ కరువైనట్లే.. చెట్లు, ఇతర ఆస్తులకు కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ అధికారులు తేరుకోవడం లేదు. పకడ్బందీ చర్యలు చేపట్టడం లేదు. ఓ వైపు ఓయూ భుముల విషయంలో తరచూ వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే డీడీ కాలనీ ప్రాంతంలో ఓయూ భూమి తమదేనంటూ చోటు చేసుకున్న వివాదం అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇటీవల ఓ బిల్డర్‌ ఓయూ ప్రహరిగోడ తనదే అన్నట్టు దానిపై మరో గోడ నిర్మించిన సంఘటన కూడా తెలిసిందే. అదే విధంగా హబ్సిగూడ వైపు ఓయూ భూముల్లోని చెట్లను నరికి కాల్చివేశారు. బాధ్యులైన వారిపై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల ఓయూ భూముల చుట్టూ 10 చోట్ల ప్రహరీ గోడ కూలిపోయినట్లు అధికారులే చెబుతున్నారు. ఇలా తరచూ వివాదాలు వస్తున్నా మరమ్మతు చర్యలు చేపట్టడం లేదు. ఇది ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఓయూ శతాబ్ధి ఉత్సవాల సమయంలో వర్సిటీలోని అనేక ప్రాంతాల్లో 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు. దీంతో యూనివర్సిటీ భద్రతపై ఉన్నతాధికారులకు ఏ మాత్రం శ్రద్ధ లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.


సెక్యూరిటీ వైఫల్యం..

ఓయూలో నిత్యం మూడు షిఫ్ట్‌ల్లో రౌండ్స్‌ వేసేందుకు మొత్తం 75 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వీరు పగలు, రాత్రి పెట్రోలింగ్‌ జీప్‌లో తిరుగుతూ భూములు, ఆస్తుల రక్షణ చర్యలు చేపడుతారు. వీరికి తోడు ప్రతి కళాశాల, హాస్టల్స్‌, ఇతర భవనాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. ఇంత మంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ విలువైన గంధం చెట్లు దొంగిలించుకుపోయారంటే లోపం ఎక్కడున్నదో వర్సిటీ అధికారులే చెప్పాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వైఫల్యమే కారణమని చెబుతున్నారు. అయితే ఓయూలో గంధం, టేకు చెట్లు ఎన్ని ఉన్నాయనే వివరాలు కూడా సెక్యూరిటీ సిబ్బందికి తెలియడం లేదని అంటున్నారు. ఆ వివరాలు వర్సిటీ గ్రీన్‌ బెల్ట్‌ను పరిరక్షించే హార్టికల్చర్‌ విభాగం వద్ద కూడా లేకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


రక్షణ చర్యలు పెంచుతాం : ప్రొ.గోపాల్‌రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌

గంధం చెట్లు నరికి వేసిన ప్రాంతాన్ని సందర్శించాను. తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనల దృష్ట్యా రక్షణ చర్యలను పెంచుతాం. సెక్యూరిటీ సిబ్బందికి తోడు ఉన్నటువంటి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టి, కూలిపోయిన చోట్ల ప్రహరిగోడను సత్వరమే నిర్మిస్తాం. ఓయూలోకి స్థానిక బస్తీవాసులతో పాటు వారి బంధువుల ముసుగులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడుతున్నారు. సెక్యూరిటీ చర్యలు చేపట్టినా ఫలితం ఉండడం లేదు. ఇకపై పకడ్బందీ చర్యలు తీసుకుంటాం.


అధికారుల తప్పిదమే.. : కాంపెల్లి శ్రీనివాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు

వర్సిటీలో తరచూ దొంగతనాలు జరుగుతున్నా గట్టి రక్షణ చర్యలు తీసుకోకపోవడం అధికారుల తప్పిదమే. ఇక్కడి సిబ్బంది, కొందరు ఉద్యోగులు ప్రమేయంతోనే గంధం చెట్ల నరికివేత సాగుతోంది. వర్సిటీలోని చెట్లు, ఇతర ఆస్తులపై సర్వేకు ఓ ఉన్నతస్థాయి కమిటీని వేయాలి. వీసీ లేకపోవడంతో వర్సిటీని ఎవరికి ఇష్టవచ్చినట్లు వారు దోచుకుంటున్నారు. 

Updated Date - 2021-01-11T06:40:12+05:30 IST