డిజిటల్‌ బొమ్మ... దుమ్మురేపుతోంది!

ABN , First Publish Date - 2020-08-02T05:50:29+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఇప్పటికి దక్షిణాది భాషలు సహా హిందీని కలుపుకుంటే సుమారు పాతిక, ముప్ఫై చిత్రాలకు పైగా ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌లోకి డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌కి వచ్చాయి.

డిజిటల్‌ బొమ్మ... దుమ్మురేపుతోంది!

  • ప్రతి చిత్రానికి ప్రత్యేకంగా టికెట్‌ కొనక్కర్లేదు!
  • పార్కింగ్‌, పాప్‌కార్న్‌ ఖర్చు లేదు!
  • ప్రతి నెలకో లేదా ఏడాదికో సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకుంటే...
  • పిల్లాపాపలతో కలిసి హాయిగా ఇంట్లోనో సినిమా చూడొచ్చు!
  • లాక్‌డౌన్‌ డిజిటల్‌ తెరకు కొత్త రెక్కలు ఇచ్చింది!
  • థియేటర్లలో విడుదల కావాల్సిన చిత్రాలు డిజిటల్‌ తెరకు వస్తున్నాయ్‌!
  •  ఓటీటీ వేదికల ద్వారా  ప్రేక్షకులకు చేరువవుతున్నాయ్‌!
  • ఇప్పుడు.. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో చిత్రాలు నచ్చాయంటున్నారు!
  • ‘జీ 5’, ‘హాట్‌స్టార్‌’కి వీక్షకులు హై ఫైవ్‌ ఇస్తున్నారు!
  • ‘అమెజాన్‌ ప్రైమ్‌’, ‘ఆహా’కి వహ్వా పలుకుతున్నారు!
  • లాక్‌డౌన్‌లో వినోదం కోసం వీటినే ఆశ్రయిస్తున్నారు!
  • మొత్తానికి డిజిటల్‌ బొమ్మ... ఇప్పుడు దుమ్ము రేపుతోంది!


లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఇప్పటికి దక్షిణాది భాషలు సహా హిందీని కలుపుకుంటే సుమారు పాతిక, ముప్ఫై చిత్రాలకు పైగా ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌లోకి డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌కి వచ్చాయి. మరో పాతిక చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జీ 5, హాట్‌స్టార్‌ లాంటి ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) వేదికలలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. థియేటర్లు మూతపడి ఉండటం... తమకు అనువైన సమయంలో, ప్రదేశంలో నచ్చిన చిత్రం చూసే అవకాశం ఉండటంతో వీక్షకులు డిజిటల్‌ తెరకు ఆకర్షితులు అవుతున్నారు. విడుదలకు సిద్ధమైన చిత్రాలను థియేటర్లు తెరిచే వరకూ వేచి చూసే బదులు పెట్టుబడి కన్నా ఎక్కువ మొత్తం వస్తే ఓటీటీలకు ఇవ్వడానికి కొందరు దర్శక-నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. అందువల్ల... ఇటు చిత్రసీమకు, అటు వీక్షకులకు ఓటీటీ లాభసాటిగా ఉంటోంది.


తెలుగునాట ఓటీటీ విడుదలకు పునాది వేసిన చిత్రం ‘అమృతరామమ్‌’. కరోనా తొలి రోజుల్లో ‘జీ 5’లో విడుదలైంది. దాంతో థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌, ఓటీటీ వేదికలలో విడుదల చేసే సంస్కృతి తెలుగులో మొదలైందని చెప్పాలి. ఏప్రిల్‌ నెలాఖరుకు కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గదనీ, మరికొన్ని రోజులు ఉంటుందనీ అంచనా వేసిన ఓటీటీ యాజమాన్యాలు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌ కోసం కొత్త సినిమాలు కొనడంపై దృష్టి సారించాయి. అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’ (హిందీ), జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ (తమిళం),  ‘లా, ఫ్రెంచ్‌ బిర్యానీ’ (కన్నడ), కీర్తీ సురేశ్‌ నటించిన ‘పెంగ్విన్‌’ (తెలుగు, తమిళం), విద్యా బాలన్‌ నటించిన ‘శకుంతలాదేవి’ (హిందీ), అదితీరావ్‌ హైదరి నటించిన ‘సూఫియమ్‌ సుజాతయమ్‌’ (మలయాళం) చిత్రాలను ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనున్నట్టు అమెజాన్‌ ప్రైమ్‌ ప్రకటించింది. ఆల్రెడీ ఈ చిత్రాలన్నీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసే విషయంలో పడిన తొలి భారీ అడుగు ఇది.


అమెజాన్‌ తర్వాత డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌ మీద దృష్టి సారించిన మరో ఓటీటీ వేదిక ‘హాట్‌స్టార్‌’. అయితే, హిందీ చిత్రాలకు, అందులోనూ స్టార్స్‌ నటించిన చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అందులో భాగంగా ముందు దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి సినిమా ‘దిల్‌ బేచారా’ను విడుదల చేసింది. సినిమా కంటెంట్‌ ఎలా ఉందనేది పక్కన పెడితే... సుశాంత్‌ మరణానంతరం విడుదలైన చిత్రం కావడంతో స్పందన బావుంది. త్వరలో అక్షయ్‌కుమార్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన ‘లక్ష్మీ బాంబ్‌’ (సౌత్‌ హిట్‌ ‘కాంచనా’కు రీమేక్‌), అజయ్‌ దేవగణ్‌, సోనాక్షీ సిన్హా, ప్రణీతా సుభాష్‌ నటించిన ‘భుజ్‌ - ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’, సంజయ్‌ దత్‌, పూజా భట్‌, ఆలియా భట్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌ నటించిన ‘సడక్‌ 2’, అభిషేక్‌ బచ్చన్‌, ఇలియానా జంటగా అజయ్‌ దేవగణ్‌ ఓ నిర్మాతగా చేసిన ‘ది బిగ్‌ బుల్‌’, విద్యుత్‌ జమాల్‌ ‘కుదా హఫీజ్‌’ చిత్రాలు హాట్‌స్టార్‌లో విడుదల కానున్నాయి. 


అమెజాన్‌, హాట్‌స్టార్‌ ఓటీటీలకు గట్టిపోటీ ఇస్తున్న మరో ఓటీటీ ‘జీ 5’. హిందీ సహా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాలు, వెబ్‌ కంటెంట్‌ వీక్షకులకు అందిస్తోంది. ‘అమృతరామమ్‌’ తర్వాత తెలుగులో సత్యదేవ్‌ నటించిన ‘47 డేస్‌’, రాహుల్‌ రవీంద్రన్‌ నటించిన ‘దృష్టి’ చిత్రాలు విడుదల చేసింది. హిందీ చిత్రాలు ఊర్వశీ రౌటేల ‘వర్జిన్‌ భానుప్రియ’, విద్యుత్‌ జమాల్‌ ‘యారా’, తమిళ చిత్రం ‘కాక్‌టైల్‌’ను విడుదల చేసింది. జూలై 31న ఒరిజినల్‌ తెలుగు సినిమా ‘మేక సూరి’ని విడుదల చేసింది. ఈ నెల 6న ఆదిల్‌ హుస్సేన్‌, ప్రియాంకా బోస్‌, సంజయ్‌ సూరి ప్రధాన పాత్రల్లో ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘పరీక్ష’, 14న వైభవ్‌, వెంకట్‌ ప్రభు నటించిన తమిళ చిత్రం ‘లాకప్‌’, 21న నసీరుద్దీన్‌ షా నటించిన ‘మీ రక్‌సం’ చిత్రాలు ‘జీ 5’లో విడుదల కానున్నాయి. 


హిందీతో పోలిస్తే... ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలవుతున్న తెలుగు చిత్రాల సంఖ్య తక్కువే. అయితే... ఇప్పటికే విడుదలైన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటిలో మొదటి, చివరి చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాయి. ఈ నెల 12న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సేనా’ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేయనుంది. ‘మేక సూరి’ రా అండ్‌ రియలిస్టిక్‌ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోలు నటించిన చిత్రాలు ఒక్కటీ ఓటీటీ వేదికల్లోకి రాలేదు. అందువల్ల, నగర-పట్టణ వీక్షకులు మంచి పేరొచ్చిన పరభాషా చిత్రాలను సైతం చూస్తున్నారు.


ఓటీటీలోనూ పోటీ!

థియేటర్ల సంఖ్య, పండగ సీజన్లు, సరైన విడుదల తేదీ... గతంలో వీటి కోసం చిత్రాల మధ్య పోటీ ఉండేది. ఒకేసారి భారీ చిత్రాలు విడుదలైతే వసూళ్ళ నుంచి థియేటర్ల వరకూ బోలెడు గోల ఉంటుంది. ఉదాహరణకు... ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల మధ్య పోటీ నడిచింది. వసూళ్ళ లెక్కలు, థియేటర్ల సమస్య లేదు కనుక ఓటీటీలో పోటీ లేదనుకుంటే పొరపాటే. కొత్తరకం పోటీ మొదలైంది. జూలై నెలాఖరున నాలుగు హిందీ చిత్రాలు గంటల వ్యవధిలో ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో విద్యా బాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలాదేవి’ విడుదలైతే... ‘జీ 5’లో విద్యుత్‌ జమాల్‌, శ్రుతీ హాసన్‌ నటించిన ‘యారా’, నెట్‌ఫ్లిక్స్‌లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రాధికా ఆప్టే నటించిన ‘రాత్‌ ఆకెలీ హై’, హాట్‌స్టార్‌లో కునాల్‌ కేము నటించిన ‘లూట్‌కేస్‌’ విడుదలయ్యాయి. వీటిలో ‘యారా’ జూలై 30న వస్తే... మిగతా మూడూ 31న వచ్చాయి. గంటలకు గంటలు డిజిటల్‌ తెర ముందు కూర్చుని ఒకేరోజు అన్ని చిత్రాలూ వీక్షకులందరూ చూడరు కదా! ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న చిత్రాన్ని చూస్తారు. అందువల్ల, మరో చిత్రానికి తొలి రోజు వచ్చే వీక్షకుల సంఖ్యకు గండి పడుతుంది. రెండో రోజు నెట్టింట సినిమాకి వస్తున్న స్పందన గమనించి, చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య తక్కువేమీ కాదు. ఒకవేళ అంతంత మాత్రం స్పందన వస్తే... స్కిప్‌ బటన్‌ నొక్కుతున్నారు. ఓటీటీలో ఇదొక ప్రమాదం పొంచి ఉంది. ఓటీటీ వేదికల నడుమ పోటీ వల్ల చిత్రాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే, ఓసారి ప్రీమియమ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకుంటే ప్రత్యేకంగా టికెట్‌ కొనాల్సిన అవసరం లేదు కనుక ఏదో ఒక సమయంలో సరదాగా సినిమా చూసే సదుపాయం ప్రజలకు ఉంటోంది. నచ్చితే పూర్తిగా చూస్తారు. లేదంటే మధ్యలో ఆపేసి, మరో చిత్రం చూస్తారు.


శకుంతల... తల్లీకూతుళ్ళ కథ


హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతలాదేవి జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్‌ ‘శకుంతలాదేవి’. చిన్నతనం నుంచి లెక్కలపై ఆమెకు అంత పట్టు ఎలా వచ్చింది? హోమోసెక్సువాలిటీ మీద ఎందుకు పుస్తకం రాశారు? ఎన్నికల్లో ఇందిరా గాంధీపై ఎందుకు పోటీ చేశారు? వంటి అంశాల కంటే కుమార్తె అనుపమతో శకుంతలాదేవి బంధం, బాల్యం, భర్తకు ఎందుకు దూరమయ్యారనే విషయాలను విపులంగా చిత్రంలో చెప్పారు. శకుంతలాదేవిగా విద్యా బాలన్‌, ఆమె కుమార్తె అనుపమగా సాన్యా మల్హోత్రా నటన... వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.


అనువాదాలతో... ‘ఆహా’ హడావిడి!


‘ఆహా’ ఓటీటీ ఓ ప్రత్యేకతతో ప్రారంభమైంది. తెలుగు కంటెంట్‌ మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది. ప్రస్తుతం ‘ఆహా’ నుంచి రాబోతున్న చిత్రాల జాబితా చూస్తే... తెలుగు కంటెంట్‌ తక్కువే ఉంటుంది. ఈ నెల 14న విడుదల కానున్న ‘జోహార్‌’ ఒక్కటే స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌. డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌ సినిమా. మిగతావి అనువాదాలే. జ్యోతిక ‘36 వయసులో’ (తమిళ చిత్రం ‘36 వయదినిలే’కి అనువాదం), ‘మగువలకు మాత్రమే’ (తమిళ చిత్రం ‘మగళిర్‌ మట్టుమ్‌’కి అనువాదం) త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటి ఒరిజినల్స్‌ ఇప్పటికే ఇతర ఓటీటీ వేదికలలో విడుదలయ్యాయి. సబ్‌ టైటిల్స్‌ సౌకర్యంతో ఆసక్తి ఉన్నవారు చూసేశారు కూడా. థియేటర్లలో కాకుండా ఇప్పటివరకూ ‘ఆహా’లో నేరుగా విడుదలైన చిత్రాలు చూసినా... ‘భానుమతి రామకృష్ణ’ ఒక్కటే స్ట్రయిట్‌ తెలుగు సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన వారం తర్వాతే ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ ఈ ఓటీటీలోకి వచ్చింది. ఆల్రెడీ స్ట్రీమింగ్‌ అవుతున్న మమ్ముట్టి ‘షైలాక్‌’, జీవా ‘జిప్సీ’, ‘ఫోరెన్సిక్‌’ అనువాదాలే. అయితే, ఇంగ్లిష్‌ సబ్‌ టైటిల్స్‌తో సినిమాలు చూడటం ఇష్టంలేని వాళ్ళు, తెలుగులో మాత్రమే చిత్రాలు చూడాలనుకునేవాళ్ళకు ఈ ఓటీటీ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఒరిజినల్‌ వెబ్‌ సిరీ్‌సలు, షోస్‌తో మాత్రం ‘ఆహా’ సందడి చేస్తోంది. త్వరలో ఒరిజినల్‌ తెలుగు కంటెంట్‌ ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’, ‘తమాషా విత్‌ హర్ష’, ‘పలాస’ దర్శకుడు తీస్తున్న ‘మెట్రో కథలు’తో సందడి చేయడానికి 

సిద్ధమవుతోంది.


పరిణితి చెందిన ప్రేమ


అమ్మాయిది హైదరాబాద్‌. మోడరన్‌ కల్చర్‌. తెనాలి నుంచి వచ్చిన అబ్బాయిది పద్దతులు ఉన్న స్వభావం. ఇద్దరి కామన్‌ క్వాలిఫికేషన్‌... పెళ్లి కాలేదు. ఇంగ్లిష్‌ రాని అబ్బాయి, ఆ మోడరన్‌ అమ్మాయి ప్రేమలో పడితే? ఏమైందో ‘భానుమతి రామకృష్ణ’ చిత్రం చూసి తెలుసుకోవాలి. ఇందులో పరిణితి చెందిన ప్రేమను చూపించారు. హీరో హీరోయిన్లు నవీన్‌ చంద్ర, సలోనీ లుత్రా పాత్రల్లో జీవించారు.


ఇద్దర్ని ప్రేమిస్తే?

మగాడి మనసు మహాచెడ్డది. అది ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తే? ఇద్దరి ప్రేమను వదులుకోలేక సంఘర్షణకు లోనయితే? ఓ యువకుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడనే కథాంశంతో రూపొందిన చిత్రం 

‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’. ఈతరం యువత అలవాట్లు, ఆలోచనలను ప్రతిబింబిస్తూ ‘క్షణం’ ఫేమ్‌ రవికాంత్‌ పేరేపు తెరకెక్కించిన ఈ చిత్రం వీక్షకులను ఆకట్టుకుంది. కృష్ణగా సిద్ధూ జొన్నలగడ్డ, అతడి సత్యగా శ్రద్ధా శ్రీనాథ్‌, రాధగా శాలినీ వడ్నికత్తి, రుక్సార్‌ పాత్రలో సీరత్‌ కపూర్‌ నటనకు మంచి పేరొచ్చింది. సంభాషణల్లో ఈతరం మాటలు ధ్వనించాయి.

Updated Date - 2020-08-02T05:50:29+05:30 IST