ఓటీఎస్‌ ‘టార్గెట్‌’ ముంచింది!

ABN , First Publish Date - 2022-07-03T08:08:30+05:30 IST

ఓటీఎస్‌ ‘టార్గెట్‌’ ముంచింది!

ఓటీఎస్‌ ‘టార్గెట్‌’ ముంచింది!

సచివాలయాల సిబ్బంది మెడకు 82 కోట్ల బాకీ

జమ చేస్తేనే ప్రొబేషన్‌ అనడంతో తీవ్ర ఆవేదన

వసూలుచేసి వాడుకోలేదంటున్న సిబ్బంది

ఇటు టార్గెట్‌ ఒత్తిడి..అటు జనం తిరుగుబాటు

బెంబేలెత్తి కట్టకపోయినా ఓటీఎస్‌ క్లియరెన్స్‌

అలా వారి నెత్తిన కోట్ల రూపాయల భారం

ఆ డబ్బులు చెల్లించలేదని ప్రొబేషన్‌ కట్‌

పైగా డబ్బులు మింగేశారన్న అపవాదు

ఏపీపీఎస్సీ టెస్ట్‌ ఫలితాలివ్వకపోవడంతో

అయోమయంలో మరికొందరు సిబ్బంది 


ప్రజలను బాదడానికి తెచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కువిధానం (ఓటీఎస్‌)... సచివాలయ ఉద్యోగుల మెడకు చుట్టుకుంది. ఈ బాదుడుపై జనం తిరుగుబాటు చేయడంతో ఓటీఎస్‌ బకాయిల భారం అటు తిరిగి ఇటు తిరిగి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపైనే పడింది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

టార్గెట్‌ ఛేదించలేక.. అలాగని ఉద్యోగాలను పణంగా పెట్టలేక ఓటీఎస్‌ డబ్బులు తామే చెల్లించేందుకు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు సిద్ధపడ్డారు. అలా వారు  చెల్లించాల్సిన డబ్బులకు.. తాజాగా ప్రకటించిన ప్రొబేషన్‌కు జగన్‌ ప్రభుత్వం లింకు పెడుతూ జీవో విడుదల చేసింది. ఆ బకాయి మొత్తం రూ.82 కోట్లుగా తేల్చింది. ప్రొబేషన్‌ దక్కిందన్న ఆనందం ఈ మెలికతో చాలామందికి ఆవిరైపోయింది. జనం నుంచి ఓటీఎస్‌ వసూలు చేసుకుని తామేమీ తినేయలేదని. ‘టార్గెట్‌’లు చేయలేక తమ జేబుల్లోనుంచే కట్టేందుకు సిద్ధమయ్యామని వారు వాపోతున్నారు. కానీ, ఇప్పటికిప్పుడు కట్టలేని పరిస్థితి తమదని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయం వల్లే తమకు ప్రొబేషన్‌ అవకాశం చేజారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఎప్పుడో గతంలో ప్రభుత్వ హౌసింగ్‌ సొసైటీ ద్వారా అరకొర అప్పుతీసుకుని ఇళ్లు ఏర్పాటుచేసుకున్నారు. పేదలకు అందించిన సాయంగా భావించి.. గత ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఈ అప్పు వసూలుకు ప్రయత్నించలేదు. కానీ, జనం ముక్కుపిండి బాదేయడం జగన్‌ ప్రభుత్వం ఒక విధానంగా మార్చివేసింది. ఈ క్రమంలో ఓటీఎస్‌ బకాయిలపైనా కన్ను వేసింది. చెల్లించాల్సిన బకాయిలను ఓటీఎస్‌ విధానంలో చెల్లించాలని హుకుం జారీచేసింది. లబ్ధిదారుల నుంచి ఒక్కో ఇంటికి ఒకేసారి రూ.10 వేలు చొప్పున సుమారు రూ.నాలుగు వేల కోట్లు బకాయి కింద వసూలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు తమను డబ్బులు చెల్లించమంటారేందంటూ జనం ఆగ్రహించారు. ఎక్కడా ఒక్క పైసా వసూలు కాలేదు. దీంతో ప్రభుత్వం గ్రామ, వార్డ్‌ల్లో పనిచేసే సచివాలయ సిబ్బందికి ఈ బాధ్యత అప్పగించింది. రంగంలోకి దిగిన సచివాలయ సిబ్బంది జనాలపై అన్నివిధాల ఒత్తిడికి ప్రయత్నించారు. ఓటీఎస్‌ కట్టకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బెదిరించారు. రేషన్‌ కార్డ్‌లు తీసేస్తారని సంక్షేమ పథకాలకు అనర్హులను చేస్తారని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయినా.. ప్రజలు ముందుకురాలేదు. ఈ విషయం అధికారులకు చెబితే తమ ఉద్యోగాలు ఊడతాయని భయపడ్డారు. అధికారులకు పరిస్థితి అర్థమై... రోజుకు కనీసం ఒక్క ఇంటి నుంచైనా ఓటీఎస్‌ కట్టించాలని టార్గెట్‌ పెట్టింది. జనం తిరుగుబాటుతో ఆ టార్గెట్‌ను కూడా చాలా ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది చేరలేకపోయారు.  జాయింట్‌ కలెక్టర్లు అదే పనిగా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. సాయంత్రం లోపు టార్గెట్లు చేయలేకపోతే ఉద్యోగం వదిలేసి ఇంటికి పోవాలని చాలాసార్లు హెచ్చరించారు. కొంత మంది సిబ్బంది జాయింట్‌ కలెక్టర్ల ఒత్తిడి తట్టుకోలేక తిరగబడ్డారు కూడా. 


బాబ్బాబు బకాయి...

ఉద్యోగాలను కాపాడుకునే క్రమంలో సచివాలయ ఉద్యోగులు కొందరు ఆయా గ్రామాల్లో పొదుపు గ్రూపుల వీవోఏలను ఆశ్రయించి ఆయా లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఓటీఎస్‌ చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో తమ ఉద్యోగాలు పోతాయని, తమకు సహకరించాలంటూ గ్రామ, వార్డు పరిధిలోని నేతలను ఆశ్రయించి...వారి సహకారంతో ఓటీఎస్‌ టార్గెట్లు పూర్తి చేశారు. ఇంకొంతమంది ఉన్నారు. వారు ముందు ఉద్యోగాలు కాపాడుకుందాం అని భావించారు. ఓటీఎస్‌ ద్వారా ఆయా గ్రామాల్లోను, వార్డ్‌ల్లోను బకాయిలు చెల్లించినట్లు రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఆ తర్వాత నుంచి లబ్ధిదారులను బతిమిలాడుకోవడం మొదలుపెట్టారు. కొందరైతే ఉద్యోగాలు కాపాడుకునేందుకు అప్పులు తెచ్చి చెల్లించారు. మరికొందరికి ఆ స్థోమత లేకపోవడంతో ప్రభుత్వానికి బకాయిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్‌ చెల్లించినట్లు రికార్డ్‌ అయి ప్రభుత్వానికి నగదు చెల్లించకుండా సుమారు రూ.82 కోట్లు బ్లాక్‌ అయినట్లు ఇటీవల గ్రామ, వార్డ్‌ సచివాలయ ఉద్యోగులశాఖ ప్రకటించింది. అలాంటి గ్రామ, వార్డ్‌ సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ప్రకటించరాదని కలెక్టర్లను ఆదేశించింది. 


‘ఫలితం’ తేలేనా?

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటివరకు సుమారు 70 వేల మంది దాకా క్రమబద్ధీకరణకు అర్హత పొందినట్టు సమాచారం. మరో 18 వేల మంది ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ను ఈ నెల 20-25 తేదీల మధ్యలో రాశారు. వారందరు ఈ నెలాఖరు లోపు పాసయితేనే వారిని కూడా క్రమబద్ధీకరించే అవకాశముంది. ఏపీపీఎస్సీ మంచి మనసుతో వెంటనే ఫలితాలు ప్రకటించాలని గ్రామ, వార్డ్‌ సచివాలయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు ఒక ప్రకటనలో కోరారు. 

Updated Date - 2022-07-03T08:08:30+05:30 IST