ఓటీఎస్‌ వసూలులో అలసత్వమొద్దు

ABN , First Publish Date - 2021-12-03T06:31:41+05:30 IST

ఓటీఎస్‌ వసూలులో అలసత్వమొద్దు

ఓటీఎస్‌ వసూలులో అలసత్వమొద్దు
ఉంగుటూరు సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జేసీ(హౌసింగ్‌) శ్రీవాస్‌ నుపూర్‌

జేసీ(హౌసింగ్‌) శ్రీవాస్‌ నుపూర్‌

ఉంగుటూరు, డిసెంబరు 2: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారుల నుంచి ఓటీఎస్‌ వసూళ్లను వేగవంతం చేయాలని, ఓటీఎస్‌ వసూలులో అలసత్వం పనికిరాదని, నూరుశాతం వసూలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌(హౌసింగ్‌) శ్రీవాస్‌ నుపూర్‌ ఆదేశించారు. మండల పరిషత్‌ సమావేశ హాలులో ఓటీఎస్‌పై పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఓటీఎస్‌ కింద గృహరుణాలు పూర్తిగా చెల్లించిన లబ్ధిదారులకు ఈనెల 8వతేదీ నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించి సంపూర్ణ గృహహక్కు కల్పించనున్నట్లు తెలిపారు. గృహరుణాలు తీసుకున్న లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలను వివరించి, ప్రభుత్వం నిర్దేశించిన నగదును ఒకేసారి చెల్లించే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు. మండలంలో 782 మంది లబ్ధిదారుల నుంచి సుమారు రూ.65 లక్షలు వసూలు కావాల్సి ఉందని, ఇప్పటివరకు 135 నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలయ్యాయని హౌసింగ్‌ ఏఈ మండవ సురేష్‌బాబు అన్నారు. సమావేశం అనంతరం హౌసింగ్‌ జేసీ ఉంగుటూరు సచివాలయం, జగనన్న లేఅవుట్లను సందర్శించారు. లేఅవుట్లను మెరకచేసే పనులపై ఆరా తీశారు. గ్రావెల్‌తో మెరకచేసేందుకు అనుమతులకోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు, ఉత్తర్వులకోసం ఎదురుచూస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో ఎస్‌.అశోక్‌కుమార్‌ తెలిపారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఓటీఎస్‌ కింద ఒకే రోజులో 12మంది నుంచి నగదు వసూలు చేసిన ఆత్కూరు పంచాయతీ కార్యదర్శి జి.సత్యసాయిబాబును ఆమె సన్మానించారు. హౌసింగ్‌ డీఈఈ కె.ఎస్‌.ప్రకాశరావు, తహసీల్దార్‌ డి.వనజాక్షి, ఈవోపీఆర్డీ వీఏ విజయకుమార్‌, సూపరింటెండెంట్‌ కె.రమణబాబు, వెలుగు ఏపీఎం ఎం.సాంబశివరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T06:31:41+05:30 IST