ముక్కుపిండించి.. ఆపై మళ్లించి..

ABN , First Publish Date - 2022-07-05T07:10:54+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో జిల్లాలో పేదల ముక్కుపిండి వసూలు చేసిన డబ్బుల ను రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల లేఅవుట్లలో సదుపాయాలకు అడ్డంగా మ ళ్లిస్తోంది. ఈ నిధులతోనే మౌలిక వసతులకు ఖర్చుచేస్తోంది. పోనీ ఇక్కడ ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు వస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో లేఅవుట్ల అభివృద్ధికి డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలను పీడించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాన్నాయి.

ముక్కుపిండించి.. ఆపై మళ్లించి..

  • -జగనన్న ఇళ్ల లేఅవుట్లలో మౌలిక సదుపాయాలకు ఓటీఎస్‌ నిధులు
  • -రూ.5.67కోట్లు మళ్లించేసిన రాష్ట్రప్రభుత్వం
  • -జిల్లాలో వేలమంది పేదల నుంచి ఓటీఎస్‌ పేరుతో డబ్బులు పిండిన సర్కార్‌
  • -డబ్బులు కట్టలేదని ఇళ్లకు తాళాలు కూడా వేసిన అధికారులు
  • -తీరా ముక్కుపిండిన డబ్బులు లేఅవుట్‌లలో సదుపాయాలకు ఖర్చు
  • -లేఅవుట్లు అభివృద్ధి చేసినా స్థలాలు దూరంగా ఉండడంతో లబ్దిదారుల అనాసక్తి
  • -తొలివిడతలో 77,896 గృహాలకు 4,157 మాత్రమే పూర్తి 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఓటీఎస్‌ పేరుతో జిల్లాలో పేదల ముక్కుపిండి వసూలు చేసిన డబ్బుల ను రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల లేఅవుట్లలో సదుపాయాలకు అడ్డంగా మ ళ్లిస్తోంది. ఈ నిధులతోనే మౌలిక వసతులకు ఖర్చుచేస్తోంది. పోనీ ఇక్కడ ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు వస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో లేఅవుట్ల అభివృద్ధికి డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలను పీడించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాన్నాయి. అక్కడ నిధులు కుమ్మరించడానికే ఇక్కడ పేదలను పిండిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు నిదర్శనమే రూ.5.67కోట్ల ఓటీఎస్‌ నిధులతో లేఅవుట్లలో సివిల్‌ పనులకు మళ్లించడం. జిల్లాలో వేల కోట్లు వెచ్చించి ఎక్కడో శివారు ప్రాంతాల్లో అధిక ధరలకు భూములు కొని జగన్‌ ప్రభుత్వం పేదలకు అంటగట్టింది. తీరా ఇప్పుడు ఈలేఅవుట్ల అభివృద్ధికి మాత్రం సొంత నిధులు ఇవ్వకుండా పేదలనుంచి పిండిన ఓటీఎస్‌ డబ్బులు మళ్లించడంపై పేదలు మండిపడుతున్నారు.

ఎంత వేధించారో..

జగన్‌ ప్రభుత్వం గతేడాది ఓటీఎస్‌ పేరుతో పథకాన్ని తీసుకువచ్చింది. పేదలను ఇబ్బందులకు గురిచేసేలా ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట అప్పటి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రుణాలు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లకు బాకీలు కట్టాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలనుంచి రూ.10వేలు, ము న్సిపాల్టీల్లో రూ.15వేలు, నగరపాలక సంస్థల పరిధిలో రూ.20వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేసింది. తామంతా 20ఏళ్ల కిందట ప్రభుత్వ సాయం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని, ఆ అప్పులు తీరిపోయాయని పేదలు వాదించారు. తాము బకాయిలుంటే అప్పటి ప్రభుత్వాలు అడిగేవి కదా? అని ప్రశ్నించారు. కానీ జగన్‌ ప్రభుత్వం ఇవేవీ వినిపించుకోలేదు. ఓటీఎస్‌ పేరుతో డబ్బులు కట్టాల్సిందేనని ఖరాఖండీగా చెప్పింది. చెప్పిన మొత్తం కడితేనే ఇళ్లు యజమాని పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని లేకపోతే భవిష్యత్తులో విక్రయించుకోవడానికి కూడా కుదరదని బెదిరించింది. జిల్లాలో వేలాదిమంది పేదలు తాము అంత మొత్తం కట్టలేమని చేతులెత్తేశారు. అయినా ప్రభుత్వం వినలేదు. కాకినాడ, పిఠాపురం తదితర ప్రాంతాల్లో అయితే డబ్బులు కట్టని పేదల ఇళ్లకు తాళాలు కూడా వేయించింది. ఇలా జిల్లావ్యాప్తంగా అధికారులకు టార్గెట్లు విధించి ముక్కుపిండి ఓటీఎస్‌ డబ్బు వసూలు చేసింది. ఇలా జిల్లావ్యాప్తంగా 1,90,942మందిని ఓటీఎస్‌ కింద గుర్తించింది. ఇందులో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు 31,137ఇళ్లకు పూర్తికాగా, రూ.19.81కోట్లు వసూలు చేసింది. ఇదంతా పేదలను బెదిరించి, ఒత్తిడి తెచ్చి, అదేపనిగా వాళ్ల ఇళ్లకు పంపి ఒత్తిడి తెచ్చి కట్టించినవే. అనేక మంది పేదలైతే అప్పులు తెచ్చి ఓటీఎస్‌ డబ్బులు కట్టారు. ఇలా ఎప్పుడో ఇళ్లు కట్టుకున్న పేదలనుంచి తనకు సంబంధం లేకపోయినా రాష్ట్రప్రభుత్వం డబ్బులు గుంజింది. ఎందరో పేద లబ్ధిదారుల ఉసురుపోసుకుంది.

అలా మళ్లించేశారంతే..

జిల్లాలో పేద కుటుంబాలనుంచి బలవంతంగా వసూలు చేసిన ఓటీఎస్‌ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జగనన్న ఇళ్ల స్థలాల లేఅవుట్లకు డబ్బులు లేవనే కారణంతో మళ్లించింది. తొలివిడత కింద రూ.5.67కోట్లు జిల్లా గృహనిర్మాణ సంస్థకు ఇచ్చింది. ఈ డబ్బులతో లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. వాస్తవానికి జిల్లాలో నవ రత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద తొలివిడత కింద 77,896మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కానీ తాము ఇళ్లు కట్టలేమని ప్రభుత్వం ఇప్పటికే చేతులు ఎత్తేసింది. దీంతో లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలా నిర్మించుకునేందుకు కొందరు ముందుకు రాగా స్థలాలు కేటాయించిన చోట లేఅవుట్లు ఇంకా సిద్ధం కాలేదు. మొదట్లో ఈ భూములను పేదలకు ఇచ్చే ముసుగులో ఊరి శివార్లలో ఎందుకూ పనికిరాని భూములను వైసీపీ కీలక నేతలు, అధికారులు కలిసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు అంటగట్టేశారు. ఇవి లోతట్టు ప్రాంతాలు కావడంతో చిన్నపాటి వర్షాలకు మునిగిపోతున్నాయి. దీంతో ఇళ్లు కట్టుకోవాలనుకునే లబ్ధిదారులు వీటిని చూసి భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్యం చేరుకునేందుకు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. అందులోభాగంగా తొలివిడత లబ్ధిదారులకు కేటాయించిన 353 లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని పేర్కొంది. వీటి చదును, మార్కింగ్‌, అంతర్గత రహదారులు, బోర్ల తవ్వకం తదితర వాటికి కోట్లలో నిధులు అవసరం అయ్యాయి. వీటికి ప్రభుత్వం డబ్బు కేటాయించాల్సి ఉన్నా నిధుల కొరతతో ఇవ్వలేదు. లేఅవుట్లలో అడపాదడపా ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు సైతం నిధులు విడుదల చేయలేదు. దీంతో లేఅవుట్ల అభివృద్ధి పనుల దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో లేఅవుట్ల అభివృద్ధికోసం ఓటీఎస్‌ నిధులను ప్రభుత్వం మళ్లించేసింది. రూ.5.67కోట్లు లేఅవుట్ల అభివృద్ధికి మళ్లిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు పేదలనుంచి బలవంతంగా పిండిన ఓటీఎస్‌ డబ్బులతో లేఅవుట్లలో సౌకర్యాలకు ఖర్చుచేస్తున్నారు. జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కింద కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పురోగతి దారుణంగా ఉంది. లేఅవుట్లు ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడం, జనావాసాలకు అత్యంత దూరంగా ఉండడంతో ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి పెద్దగా మొగ్గుచూపడం లేదు. మొత్తం 77,896 ఇళ్లు నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా, 4,157 మాత్రమే పూర్తికావడం విశేషం.

Updated Date - 2022-07-05T07:10:54+05:30 IST