ఓటీఎస్‌ స్వచ్ఛందం కాదు నిర్భందమే..!

ABN , First Publish Date - 2021-12-05T07:34:01+05:30 IST

ప్రభుత్వం ఓటీఎస్‌ లక్ష్యాలను విధించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

ఓటీఎస్‌ స్వచ్ఛందం కాదు నిర్భందమే..!
లక్ష్యాలు పూర్తిచేయాలని సూచిస్తున్న పీడీ బాబూరావు


పొదుపు మహిళా గ్రూపులతో బలవంతంగా తీర్మానాలు

ప్రభుత్వ పథకాలు అందవని బెదిరింపులు

ఉలవపాడు, డిసెంబరు 4 : ప్రభుత్వం  ఓటీఎస్‌ లక్ష్యాలను విధించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్‌ మెగామేళ నిర్వహించగా మండలంలోని అధికారులు  లక్ష్యాల వెంట పరుగులు తీశారు. ఉలవపాడు మండలానికి శనివారం రోజుకు 306 ఓటీఎస్‌ లక్ష్యాలు ఇవ్వగా అన్ని శాఖల అధికారులు 81 మాత్రమే పూర్తిచేశారు. ఓటీఎస్‌ లక్ష్యాన్ని సాధించడంలో ఉలవపాడు మండలం వెనుకబడి ఉందని డీఆర్‌డీఏ పీడీ బీ.బాబురావు స్వయంగా పర్యవేక్షించి అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ఆదివారంలోగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పైకి స్వచ్చందంగా ఓటీఎస్‌ కట్టిస్తున్నామని చెప్తున్నప్పటికీ, దీనిపై స్థానికంగా ఎవరు పెద్దగా ముందుకురావడం లేదు. దీంతో తమ పందాను మార్చుకొని డ్వాక్రా సంఘాల పొదుపులను లక్ష్యంగా చేసుకొని ఓటీఎ్‌సలకు అవసరమైన సొమ్మును బ్యాంక్‌ ఖాతాలను నేరుగా తీసుకుంటున్నారు. 1983 నుంచి 2011 వరకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న వారు రూరల్‌ మండలాల్లో రూ.10000 చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేయించుకొని ప్రభుత్వం నుంచి పూర్తి హక్కుపత్రం పొందవచ్చని వెలుగు సిబ్బంది పొదుపు సంఘాల మహిళలపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. 

మండలంలో 2131 మంది లబ్ధిదారులుంగా, వీరిలో మండలానికి తొలివిడతగా 533 ఓటీఎస్‌ కట్టించాలని లక్ష్యం విధించారు. ఇప్పటి వరకు 334 మంది లబ్ధిదారులతో అధికారులు నగదు కట్టించారు. గతంలో  పక్కా ఇళ్లు నిర్మాణం భర్తపేరుతో ఉన్నప్పటికీ, సంబంధిత భార్య ఏ పొదుపు సంఘంలో ఉందో తెలుసుకొని ఆ పొదుపు సేవింగ్స్‌ నుంచి ఓటీఎస్‌ నగదు జమ చేసుకుంటున్నట్లు సీసీలు, వీవోఏలు పొదుపు లీడర్లను బలవంతం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వెలుగు సీసీలు, వీవోఏలు, సచివాలయ సిబ్బంది జగనన్న చేయూత, ఇతర పథకాలను బూచిగా చూపి పొదుపు సంఘాల లీడర్లలతో బలంతంగా తీర్మానాలు రాయించి బ్యాంక్‌ల నుంచి ఓటీఎస్‌ కింద జమచేసుకుంటున్నారు. ఏదోవిధంగా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీచేయడంతో క్రిందిస్థాయి సిబ్బందికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. కొందరు అధికారులు భయటపడకపోయినప్పటికీ, లోలోపల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు.

Updated Date - 2021-12-05T07:34:01+05:30 IST