ఓటీఎస్‌ పచ్చి దగా

ABN , First Publish Date - 2021-12-28T07:51:39+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం- ఓటీఎ్‌సను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఓటీఎస్‌ పచ్చి దగా

  • పేదల రక్తాన్ని పీల్చేస్తున్న వైసీపీ సర్కారు 
  • రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు 
  • జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు 
  • కలెక్టరేట్‌లో వినతి పత్రాల అందజేత 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం- ఓటీఎ్‌సను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని పేదల రక్తాన్ని పీల్చేస్తున్న ఓటీఎస్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల పోలీసులు ఆందోళనలను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత లక్ష్మీ టాకీస్‌ సెంటరులోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అక్కడినుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. స్పందన కార్యక్రమంలో ఉన్న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 




గుంటూరులో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ శ్రేణులు కార్యాలయం ప్రాగణంలోకి వెళ్తుండగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరగింది. దీంతో కార్యకర్తల చేతుల్లోని జెండాలను లాక్కున్న పోలీసులు వాటికున్న కర్రలతోనే విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో వేమూరు నియోజకవర్గ కార్యకర్త సునీల్‌ కాలు, మాచర్లకు చెందిన వెంకటేశ్వర్లుకు చేయి విరిగాయి. నగర కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీరామ్‌పై కూడా పోలీసులు చేయిచేసుకోగా, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మాజీమంత్రి ఆలపాటి రాజా హెచ్చరించారు. కలెక్టరేట్‌లో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన పార్టీ కార్యకర్తలపై కూడా లాఠీచార్జి చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నెల్లూరులో వీఆర్సీ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు వినతి పత్రం అందించారు. 


వెల్లువెత్తిన నిరసనలు 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు నేతలు ర్యాలీగా వెళ్లగా పోలీసులు అడ్డుకుని నెట్టేశారు. దీంతో పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామంటూ గేట్లు తీసే ప్రయత్నం చేశారు. పోలీసులు నేతలందరినీ వెనక్కు నెట్టేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం నేతలంతా నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించేందుకు వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన వచ్చేవరకూ కదిలేది లేదని భీష్మించారు. దీంతో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వచ్చి వినతి పత్రం స్వీకరించారు. విజయనగరంలో టీడీపీ నేతలు క్లాక్‌టవర్‌ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. తరం కలెక్టర్‌ సూర్యకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ ర్యాలీని జేసీబీలతో అడ్డగించేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. విశాఖలో టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ జరిగింది. 


కడపలో స్వల్ప ఉద్రిక్తత 

కడప జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నేతలు కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ విజయరామరాజుకు వినతిపత్రం ఇచే ్చందుకు కలెక్టరేట్‌కు వెళ్తుండగా పోలీసులు ప్రధాన గేటు వద్ద, కలెక్టర్‌ కార్యాలయంలో మరోసారి అడ్డగించారు. దీంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అనంతపురం నగరంలోని పవర్‌ ఆఫీస్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు టీడీపీ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓటీఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ ఆందోళనతో కలెక్టరేట్‌ అట్టుడికిపోయింది. అనంతరం నాయకులు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. చిత్తూరులో ఓటీఎస్‌ రద్దు కోరుతూ కలెక్టరేట్‌ వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలులో టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ఆ పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ కోటేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

Updated Date - 2021-12-28T07:51:39+05:30 IST