డ్వాక్రా మెడపై ఓటీఎస్‌ కత్తి

ABN , First Publish Date - 2022-01-25T06:26:56+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పక్కా ఇళ్ల లబ్ధిదారుల నుంచి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరిట రుణ బకాయిలను వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నది.

డ్వాక్రా మెడపై ఓటీఎస్‌ కత్తి

ఇళ్ల లబ్ధిదారుల్లో పొదుపు సంఘాల సభ్యుల గుర్తింపు

తొలుత ప్రతి మండలంలో 500 మంది నుంచి డబ్బులు వసూలు చేయాలని లక్ష్యం

గ్రామాల్లో వెలుగు వీవోఏలు, సీసీలు సమావేశాలు

డబ్బులు కట్టాలంటూ మహిళలపై ఒత్తిళ్లు

చేతిలో సొమ్ములు లేకపోతే బ్యాంకు రుణం తీసుకోవాలని హుకుం

ఓటీఎస్‌ కట్టకపోతే పొదుపు ఖాతాలు నిలిపివేస్తామని హెచ్చరికలు

27 నుంచి మూడు రోజులపాటు ఓటీఎస్‌ మేళాలు

జిల్లాలో లక్ష్యానికి దూరంగా ఓటీఎస్‌ వసూళ్లు

మొత్తం లబ్ధిదారులు 1,23,875 మంది

ఇంతవరకు డబ్బులు చెల్లించింది కేవలం 15,588 మందే


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పక్కా ఇళ్ల లబ్ధిదారుల నుంచి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరిట రుణ బకాయిలను వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నది. ముఖ్యంగా లబ్ధిదారుల్లో 70 నుంచి 80 శాతం మంది వరకు డ్వాక్రా మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు వుండడంతో డబ్బుల వసూళ్లకు వెలుగు సిబ్బంది ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఒకవేళ చేతిలో డబ్బులు లేకపోతే డ్వాక్రా సంఘం తరపున బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో ప్రతి మండలంలో 500 మంది డ్వాక్రా సభ్యుల నుంచి ఓటీఎస్‌ సొమ్ములు వసూలు చేయాలని మండల సమాఖ్యలకు లక్ష్యాలను నిర్దేశించారు.


గత నాలుగు దశాబ్దాల కాలంలో నిరుపేదలకు గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన ఇళ్లపై హక్కు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్లకు తెరతీసిన విషయం తెలిసిందే. జిల్లాలో 1983 నుంచి 2011 వరకు పేద వర్గాలకు 4,30,386 ఇళ్లు మంజూరు చేసినట్టు గృహ నిర్మాణ సంస్థ అఽధికారులు లెక్కలు కట్టారు. వీటిలో జీవీఎంసీలో (వాంబే) 30,180, ఏజెన్సీలో 81,220 ఇళ్లు మొత్తం 1,11,400 ఇళ్లను ఉచితంగా నిర్మించినట్టు గుర్తించారు. ఎటువంటి లిటిగేషన్‌ లేని స్థలాల్లో నిర్మించి, ప్రస్తుతం లబ్ధిదారులు లేదా వారి వారసులు నివాసం వుంటున్న ఇళ్లు 1,56,306 ఉన్నాయి. ఇక ఆలయ భూములు, కేంద్ర ప్రభుత్వ స్థలాలు, గెడ్డలు, ఇతర అభ్యంతర స్థలాల్లో నిర్మించినవి, ఇతరులకు విక్రయించినవి 1,62,680 ఇళ్లు వున్నట్టు లెక్కగట్టారు. తొలిదశలో లబ్ధిదారులు లేదా వారి వారసులు నివాసం వుంటున్న 1,56,306 ఇళ్లకు ఓటీఎస్‌ వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిలో ఇప్పటి వరకు 1,49,048 ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. వీరిలో 25,173 మంది ఐఏవై, ఇతర ఉచిత పథకాల లబ్ధిదారులతోపాటు రుణ బకాయిలను పూర్తిగా చెల్లించడంతో ఓటీఎస్‌ నుంచి మినహాయించారు. మిగిలిన 1,23,875 మంది నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇంటి రుణ బకాయితో సంబంధం లేకుండా గ్రామ పంచాయతీల్లో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, జీవీఎంసీలో రూ.20 వేలు ఒకేసారి (వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌) చెల్లించి హక్కు పత్రం పొందవచ్చని అధికారులు ప్రకటించారు.    


లబ్ధిదారుల నుంచి అంతంతమాత్రంగానే స్పందన  

జిల్లాలో మొదటి దశలో 1,23,875 మంది లబ్ధిదారుల నుంచి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద డబ్బులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 15,588 మంది నుంచి రూ.17.42 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మండల స్థాయి అధికారులతోపాటు  గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు తరచూ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, ఓటీఎస్‌ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. అయినా లబ్ధిదారులు స్పందించడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. లబ్ధిదారుల్లో అత్యధికులు డ్వాక్రా సంఘాల మహిళలు, లేదా వారి కుటుంబ సభ్యులు వుండడంతో వీరి నుంచి డబ్బులు వసూలు బాధ్యతను వెలుగు సిబ్బందికి అప్పగించింది. డ్వాక్రా సంఘాల్లో ఎంతమంది ఇళ్ల లబ్ధిదారులు వున్నారో మండలాల వారీగా వివరాలు సేకరించారు. వీరి నుంచి దశల వారీగా ఓటీఎస్‌ సొమ్ములు వసూలు చేయాలని నిర్ణయించారు. తొలుత ప్రతి మండలంలో 500 మంది నుంచి డబ్బులు వసూలు చేయాలని వెలుగు సిబ్బందిని ఆదేశించారు. సభ్యురాలి బ్యాంకు ఖాతాలో డబ్బులు వుంటే వెంటనే వసూలు చేయాలని, లేకపోతే బ్యాంకు నుంచి రుణం మంజూరుచేయించి ఓటీఎస్‌కు చెల్లించేలా చూడాలని మండల సమాఖ్యలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగా ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు ఓటీఎస్‌ మేళాలు నిర్వహించాలని నిర్ణయించారు. 


స్వచ్ఛందమని చెబుతూ... ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు

వెలుగు సిబ్బందిపై డ్వాక్రా మహిళల ఆగ్రహం

బుచ్చెయ్యపేట, జనవరి 24: వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద డబ్బులు చెల్లించాలంటూ వెలుగు సిబ్బంది ఒత్తిడి తీసుకురావడంపై డ్వాక్రా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మండలంలోని బంగారుమెట్టలో సోమవారం వెలుగు వీవోఏలు, సీసీ కొండయ్య...డ్వాక్రా మహిళల్లో ఓటీఎస్‌ లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ నెల 25వ తేదీలోగా రూ.10 వేల చొప్పున చెల్లించాలని, లేకపోతే పొదుపు ఖాతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఒకవేళ చేతిలో డబ్బులు లేకపోతే పొదుపు ఖాతా వున్న బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని, ఈ సొమ్మును నెలకు రూ.1,100 చొప్పున పది నెలలపాటు తిరిగి చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. దీంతో పలువురు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉచితంగా కట్టించిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం ఏమిటంటూ మండిపడ్డారు. ఓటీఎస్‌ స్వచ్ఛందమేనని ఒకపక్క చెబుతూ, డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడం ఏమిటని నిలదీశారు. దీనిపై సీసీ కొండయ్యను వివరణ కోరగా, ఓటీఎస్‌ వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరిస్తున్నామే తప్ప డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడం లేదని చెప్పారు.


నిరుపేదలం...డబ్బులు కట్టే స్థోమత లేదు

తాళ్లవలస కొండమ్మ, బంగారుమెట్ట, బుచ్చెయ్యపేట మండలం


నా భర్త దివ్యాంగుడు. అతనికి వచ్చే పింఛన్‌తోపాటు నేను కూలి పనులకు వెళ్లి పొట్ట నింపుకుంటున్నాం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మంజూరైన ఇంటికి ఇప్పుడు డబ్బులు కట్టమంటూ వెలుగు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. నా వయసు 60 ఏళ్లు దాటడంతో డ్వాక్రా సంఘం సభ్యత్వం రద్దు చేశారు. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయలేదు. ఓటీఎస్‌ కింద డబ్బులు కట్టే స్థోమత మాకు లేదు.

Updated Date - 2022-01-25T06:26:56+05:30 IST