Advertisement
Advertisement
Abn logo
Advertisement

బైపాస్‌ సర్జరీకి ప్రత్యామ్నాయం!

గుండె రక్తనాళాల్లో పూడికలకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ఒక్కటే పరిష్కారం కాదు!

నూటికి నూరు శాతం పూడికల తొలగింపులో సి.టి.ఒ యాంజియోప్లాస్టీ... మెరుగైన ప్రత్యామ్నాయం!


గుండె రక్తనాళాల పూడికల్లో 30 శాతం, 70 శాతం, 100 శాతం... ఇలా మూడు రకాలు ఉంటాయి. 30 శాతం పూడిక ఉన్నవారికి చికిత్సతో ఒరిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. మందులు, ఆహారపుటలవాట్లు, జీవనశైలి మార్పులతో కొంతమేరకు పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే 70 శాతం, అంతకంటే ఎక్కువ పూడికలు ఏర్పడితే తప్పనిసరిగా చికిత్స అవసరం పడుతుంది. ఆ సమయంలో సాధారణ యాంజియోప్లాస్టీతో కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ పరిస్థితి కూడా విషమించి రక్తనాళాలు పూర్తిగా పూడుకుపోతే ఆ పూడికలను సమర్థంగా, విజయవంతంగా తొలగించడానికి బైపాస్‌ సర్జరీ చేస్తూ ఉంటారు. క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌తో బైపాస్‌ సర్జరీతో పని లేకుండా సమస్యను పరిష్కరించుకునే వీలుంది. అయితే ఈ చికిత్సా విధానం నూటికి నూరు శాతం పూడికలు ఉన్న వారికి మాత్రమే ఉద్దేశించినది. 


అత్యాధునిక యాంజియోప్లాస్టీ!

సాధారణంగా రక్తనాళాల్లో పూడికలను తొలగించడం కోసం యాంజియోగ్రామ్‌ చేసి, స్టెంట్స్‌ వేస్తారనే విషయం అందరికీ తెలిసిందే! దీనిలో సాంకేతిక సవాళ్లకు ఆస్కారం ఉండదు. రక్తనాళాల్లోకి తీగను పంపించి, విప్పార్చి, స్టెంట్‌ అమర్చడంతో పని పూర్తవుతుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన  (సి.టి.ఒ) చికిత్సా విధానం భిన్నమైనది. ఇది యాంజియోప్లాస్టీ విధానంలో అత్యంత కచ్చితమైన, ఆధునికమైన, మెరుగైన ప్రభావాన్ని చూపించే  చికిత్స. సాధారణ యాంజియోప్లాస్టీ చేసే సమయంలో, పూడిక మరీ గట్టిపడిపోయినట్టు అనిపించినా, మూడు రక్తనాళాలు నూటికి నూరు శాతం పూడుకుపోయినట్టు తెలిసినా యాంజియోప్లాస్టీకి బదులుగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని వైద్యులు మొగ్గు చూపుతారు. అయితే క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌ యాంజియోప్లాస్టీలో పూడిక ఎంత గట్టిగా మారినా, దాన్ని వేర్వేరు నైపుణ్యాలతో తొలగించే పరికరాలను చికిత్స సమయంలో వాడుకునే వీలుంటుంది. పూడిక తొలగించి, స్టెంట్స్‌ కూడా వేసే వెసులుబాటు ఉంటుంది. 


చికిత్సా విధానం ఇలా....

నూరు శాతం పూడిక ఏర్పడినప్పుడు సాధారణ యాంజియోప్లాస్టీలో తీగ ఆ పూడికను ఛేదించలేదు. ప్రధాన సవాలు అక్కడే ఎదురవుతుంది. ఆ సమయంలో పూడికను ఛేదించడానికి క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌ చికిత్సా విధానంలో యాంటీగ్రేడ్‌, రిట్రోగ్రేడ్‌ అనే రెండు టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. 


యాంటీగ్రేడ్‌: డమ వైపు రక్తనాళం పూడుకుపోయినప్పుడు, కుడివైపు రక్తనాళం నుంచి సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తాయి. గుండె కండరాలను కాపాడుకోవడం కోసం శరీరంలో చోటుచేసుకొనే సహజసిద్ధమైన చర్య ఇది. వీటితో గుండెకు కొంతమేరకు మేలు జరిగినా, సంపూర్ణ స్థాయిలో గుండెకు రక్తసరఫరా జరగకపోవచ్చు. కానీ ఈ సూక్ష్మ రక్తనాళాలే యాంటీగ్రేడ్‌ టెక్నిక్‌కు తోడ్పడతాయి. వీటి ద్వారా యాంజియోప్లాస్టీ తీగను పంపించి, పూడికను తొలగించవచ్చు. కొన్ని సందర్భాల్లో పూడిక మరీ దృఢంగా ఉన్నప్పుడు మెత్తని తీగ మొనను సూదిగా దృఢంగా మార్చి పూడికను ఛేదించవలసి ఉంటుంది. అప్పటికీ పూడిక తొలగకపోతే, పూడిక లోపలి నుంచి కాకుండా, క్రాస్‌ బౌస్‌, స్టింగ్‌ రే అనే పరికరాలతో రక్తనాళం గోడల లోపల నుంచి పూడిక అవతలి వైపు చేరుకొని, దాన్ని ఛేదించవలసి ఉంటుంది. ఇలా యాంటీగ్రేడ్‌ వైర్‌ ఎస్కలేషన్‌, యాంటీగ్రేడ్‌ డిసెక్షన్‌ రీ ఎంట్రీ అనే భిన్న పద్ధతులతో పూడికలను తొలగిస్తారు. 


రిట్రోగ్రేడ్‌: ఈ విధానంలో తీగ ద్వారా పూడిక ముందు నుంచి కాకుండా వెనకకు చేరుకుని, ఛేదించడం జరుగుతుంది. దీనిలో కూడా రిట్రోగ్రేడ్‌ వైర్‌ ఎస్కలేషన్‌; రిట్రోగ్రేడ్‌ డిసెక్షన్‌ రీ ఎంట్రీ విధానాలు అవసరాన్ని బట్టి అనుసరించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు విధానాలు కలిపి ఉపయోగించవలసి రావచ్చు. ఇలా పూడికల తొలగింపు ప్రక్రియలో అప్పటి పరిస్థితిని బట్టి, పద్ధతులను, పరికరాలను మార్చుకుంటూ చేసే చికిత్స ఇది. 


ప్రణాళికే కీలకం!

గుండె సమస్యల తీవ్రతను గుర్తించడం కోసం ఇ.సి.జి, టుడి ఎకో లాంటి పరీక్షలు, తర్వాత యాంజియోగ్రామ్‌ క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌ చికిత్సా విధానంలో కూడా చేస్తారు. అయితే సాధారణ యాంజియోప్లాస్టీ మాదిరిగా యంజియోగ్రామ్‌ చేసే సమయంలోనే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్స్‌ అమర్చే విధానం దీనిలో అనుసరించరు. యాంజియోగ్రామ్‌లో కనిపించిన పూడిక తీవ్రతను బట్టి, నూటికి నూరు శాతం పూడుకుపోయిందని తేలినప్పుడు, చికిత్సను అక్కడితో ఆపేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని, చికిత్సా విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అంచనా వేస్తారు. ఈ ప్రణాళికకు రెండు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాతే క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌ చికిత్సా విధానాన్ని అమలు చేస్తారు. చికిత్స సమయంలో ఎదురయ్యే పరిస్థితికి తగ్గట్టు అప్పటికప్పుడు ప్రణాళిక మార్చుకుంటూ ఎంతో చాకచక్యంగా ముగించే ప్రక్రియ ఇది. పూర్తి చికిత్సకు నాలుగు గంటల సమయం పడుతుంది.


సర్జరీతో ఉన్న ఇబ్బందులు ఇవే!

కొన్ని సందర్భాల్లో బైపాస్‌ సర్జరీతో సమస్య శాశ్వతంగా పరిష్కారం కాకపోవచ్చు. సర్జరీ తర్వాత, ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. రక్తస్రావం జరగవచ్చు. తిరిగి రక్తనాళాలు పూడుకుపోవచ్చు. దాంతో రెండోసారి సర్జరీ అవసరం పడవచ్చు. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత ఆ ప్రదేశంలోని కణజాలం క్లిష్టంగా మారుతుంది. కండరాలతో పాటు, ఆ ప్రదేశంలోని కణజాలాలు వైద్యులను కొంతమేరకు గందరగోళపరుస్తాయి. సర్జరీ నుంచి కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పట్టవచ్చు. సర్జరీ తదనంతరం దీర్ఘకాలం పాటు నొప్పులనూ భరించవలసి రావచ్చు. ఇవన్నీ ఈ సర్జరీలో ఉన్న ఇబ్బందులు. అలాగే బైపాస్‌ సర్జరీలో మోర్టాలిటీ రేట్‌ రెండు శాతం ఉంటుంది. క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌ ఇంటర్‌వెన్షన్స్‌ చికిత్స మోర్టాలిటీ రేటు ఒక్క శాతం మాత్రమే. ఈ చికిత్సతో దుష్ప్రభావాలు, ఇన్‌ఫెక్షన్లు, కోలుకొనే సమయం తక్కువ.

- డాక్టర్‌ శరత్‌ రెడ్డి

ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ ఎండోవాస్క్యులర్‌ స్పెషలిస్ట్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...