గగనయానానికి అంతర్జాతీయ రెక్కలు

ABN , First Publish Date - 2022-04-05T13:39:15+05:30 IST

దాదాపు రెండేళ్ళ తర్వాత గగనయానంలో అంతర్జాతీయ రెక్కలు విచ్చుకున్నాయి. విదేశీ విమానాలకు పచ్చజెండా ఊపడంతో చెన్నై విమానాశ్రయం

గగనయానానికి అంతర్జాతీయ రెక్కలు

- ఎయిర్‌పోర్టు కళకళ

- పెరిగిన విమానాలు, ప్రయాణికుల సంఖ్య


అడయార్‌(చెన్నై): దాదాపు రెండేళ్ళ తర్వాత గగనయానంలో అంతర్జాతీయ రెక్కలు విచ్చుకున్నాయి. విదేశీ విమానాలకు పచ్చజెండా ఊపడంతో చెన్నై విమానాశ్రయం ప్రయాణికులతో కళకళలాడుతోంది. రాష్ట్రంతో పాటు దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ విమానాలను పూర్తిగా అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయానికి వచ్చే డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ విమానాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వీటిలో నగరానికి రాకపోకలు సాగించే స్వదేశీ, విదేశీ ప్రయాణికుల సంఖ్య కూడా అధికమైంది. కరోనా మహమ్మారికి ముందుకు ఈ ఎయిర్‌పోర్టుకు రోజుకు 398 డొమెస్టిక్‌, 116 ఇంటర్నేషనల్‌ విమాన సర్వీసులు నడిచేవి. వాటిలో దాదాపు 38 వేల మంది స్వదేశీ, 8 నుంచి 10 వేల మంది విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కరోనా కారణంగా 2020 మార్చి నెలాఖరులో విమాన సేవలను కేంద్రం పూర్తిగా నిలిపివేసింది. ఇపుడు దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా సడలించడం వంటి సానుకూల అంశాల నేపధ్యంలో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మలేసియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఫ్రాన్స్‌, అరబ్‌ దేశాల నుంచి చెన్నై వచ్చే విమానాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కరోనా తర్వాత ఈ ఎయిర్‌పోర్టుకు 402 విమానాలు వచ్చిపోతుండగా, ఈ విమానాల్లో 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 328 డొమెస్టిక్‌ విమానాల్లో 40 వేల మంది స్వదేశీ, 74 ఇంటర్నేషనల్‌ విమానాల్లో 11 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శుభపరిణామంతో విమానాశ్రయ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 

Updated Date - 2022-04-05T13:39:15+05:30 IST