‘ఏడు’పొక్కటే తక్కువ.!

ABN , First Publish Date - 2021-11-10T16:52:40+05:30 IST

అదో డైనింగ్‌ హాల్‌. నేడు అదే 60 మందికి పైగా విద్యార్థినులకు వసతిగా మారింది. ఆ హాల్‌లోనే ఉండాలి. అందులోనే తినాలి. అక్కడే చదువుకోవాలి. వారందరికీ కలిపి ఉండేది నాలుగైదు

‘ఏడు’పొక్కటే తక్కువ.!

ఉస్మానియా వర్సిటీ హాస్టల్స్‌లో విద్యార్థినుల వెతలు..

ఒక్కో గదిలో ఆరు నుంచి ఏడుగురు.. 

హాల్‌లో 60 మందికి వసతి

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన

లేడీస్‌ హాస్టల్స్‌ అధ్వానం


హైదరాబాద్‌ సిటీ: అదో డైనింగ్‌ హాల్‌. నేడు అదే 60 మందికి పైగా విద్యార్థినులకు వసతిగా మారింది. ఆ హాల్‌లోనే ఉండాలి. అందులోనే తినాలి. అక్కడే చదువుకోవాలి. వారందరికీ కలిపి ఉండేది నాలుగైదు బాత్రూమ్‌లే. ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడ క్యూలు కనిపిస్తాయంటే అతిశయోక్తికాదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో నరకయాతనపడుతున్నారు. సమయం లేకపోవడంతో ఒక్కోసారి స్నానాలు చేయకుండానే కాలేజీకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. 60 మంది ఒకే చోట ఉండాల్సి రావడంతో కనీసం దుస్తులు మార్చుకోవాలన్నా ఇబ్బందే. నిద్ర కూడా కరువే. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న తల్లుల పాత చీరలను అడ్డుగా కట్టుకుని కాలం గడుపుతున్నారు.

 ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. విశ్వనగరంగా కీర్తిస్తున్న హైదరాబాద్‌ మహా నగరంలో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో కావడం గమనార్హం. వర్సిటీలోని లేడీస్‌ హాస్టల్‌లో కనీస సదుపాయాలు లేవు. ఒక్కో గదిని ఇద్దరు లేదా ముగ్గురికి కేటాయించాల్సి ఉండగా, ఆరు నుంచి ఏడుగురు ఉంటున్నారు. హాల్‌ లాంటి గదుల్లో 60 మందికి పైగా విద్యార్థినులను ఉంచారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ వసతి గృహాలను ప్రారంభించాలని ప్రభుత్వం సూచిస్తే.. ఉస్మానియా యూనివర్సిటీలో నిబంధనలు తుంగలో తొక్కారు.


లేడీస్‌ హాస్టల్స్‌లో ఇదీ పరిస్థితి

ఉస్మానియా యూనివర్సిటీలో నాలుగు బ్లాక్‌లతో లేడీస్‌ హాస్టల్‌ ఉంది. ఒక్కో బ్లాక్‌లో వందకు పైగా గదులు ఉన్నాయి. వీటితో పాటు పీహెచ్‌డీ విద్యార్థినుల కోసం మరో 150కి పైగా గదులున్నాయి. కొన్ని బ్లాక్‌ల్లో కోఠి విమెన్స్‌ కాలేజీ, నిజాం కాలేజీకి చెందిన విద్యార్థినులకు కూడా వసతి కల్పించారు. ఇక్కడి నుంచే కాలేజీలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం కొన్ని అంతస్తుల్లో మరమ్మతు పనులు సాగుతున్నాయి. నిర్వహణ లేకపోవడంతో కొన్ని శిథిలంగా మారాయి. ప్రస్తుతం హాస్టల్‌లో 1100 మంది ఉన్నారు. వారికి సరిపడా సౌకర్యాలు లేవు. బాత్రూమ్‌లు అరకొరగానే ఉన్నాయి. తెల్లవారు జామున 5 నుంచి 10 గంటల వరకు కాలకృత్యాల కోసం విద్యార్థినులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. స్నానాలు చేయలేని పరిస్థితి. కొన్నింటికి లోపల గడియలు లేవు. విద్యార్థినులకు మినరల్‌ వాటర్‌ సదుపాయం కూడా లేదు. పీహెచ్‌డీ బ్లాక్‌కు వెళ్లాల్సిందే. అక్కడ కూడా ఒక ట్యాప్‌లో మాత్రమే మినరల్‌ వాటర్‌ వస్తోంది. దుస్తులు ఉతుక్కోవడానికి, ఆరబెట్టడానికి తగిన ఏర్పాట్లు లేవు. విద్యార్థినులు అక్కడ ఉండలేక, బయట అద్దెలు చెల్లించే స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


సంఖ్య పెరుగుతున్నా..

కొవిడ్‌ కారణంగా సుమారు ఏడాదిన్నరకు పైగా హాస్టల్స్‌ మూతపడ్డాయి. ఆ సమయంలో హాస్టల్స్‌ మరమ్మతులు, ఇతర సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అధికారులు భిన్నంగా వ్యవహరించారు. విద్యార్థినులు హాస్టళ్లకు వచ్చిన తర్వాత మరమ్మతు పనులు చేపట్టారు. ఏటా వర్సిటీలో విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్నా, అందుకనుగుణంగా హాస్టళ్ల నిర్మాణం చేపట్టడం లేదు. ఇప్పటికైనా సౌకర్యాల కల్పనపై వర్సిటీ నిర్వాహకులు దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-10T16:52:40+05:30 IST