ఒక ఏడాది కోల్పోయాం!: విద్యార్థులు

ABN , First Publish Date - 2021-05-07T09:53:08+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సర విద్యార్థులు ఓ విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు.

ఒక ఏడాది కోల్పోయాం!: విద్యార్థులు

ఓయూకి వేసవి సెలవులు.. సీపీగెట్‌-2020పై కరోనా ప్రభావం


హైదరాబాద్‌ సిటీ, మే 6(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సర విద్యార్థులు ఓ విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు. యూనివర్సిటీ సాధారణ అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మరో అకాడమిక్‌ ఇయర్‌ నెల రోజుల్లో ప్రారంభమవుతుండగా మొదటి సంవత్సర విద్యార్థులకు ఇప్పటికీ ఒక్క సెమిస్టర్‌ కూడా పూర్తి కాలేదు. ఈ విద్యార్థులకు తరగతులు ప్రారంభమై నెల రోజులు కూడా గడువలేదు. ఇంతలోనే యూనివర్సిటీ వేసవి సెలవులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్షా సీపీగేట్‌-2020పై కరోనా మహామ్మరి ప్రభావం చూపడంతో అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. దీంతో విద్యార్థులు ఏకంగా ఓ అకాడమిక్‌ ఇయర్‌ను నష్టపోయే పరిస్థితి వచ్చింది.


కాగా,  2020-21 విద్యా సంవత్సరానికి ఓయూలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ అడ్మిషన్‌ పొందిన విద్యార్థుల రెండేళ్ల కోర్సు 2021-22తో పూర్తవుతుంది. 2022లో మే నెలలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసి పీహెచ్‌డీ కోసం, ఇతర ఉన్నత చదువులకు ప్రవేశ పరీక్షలు రాస్తారు. కానీ ప్రస్తుతం కరోనా మహామ్మరి కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు అకాడమిక్‌ క్యాలెండర్‌ పూర్తిగా దెబ్బతింది. మరోవైపు, గతేడాది ఆగస్టులో ప్రారంభమవ్వాల్సిన తరగతులు గత నెలలో ఆన్‌లైన్‌లోనే ప్రారంభమయ్యాయి. అకాడమిక్‌ ఇయర్‌ ఎప్పటికీ పూర్తవుతుందో స్పష్టత లేదు. 

Updated Date - 2021-05-07T09:53:08+05:30 IST