ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్టా‘రాజ్యం’.. పలుకుబడితో పైరవీలు!

ABN , First Publish Date - 2021-11-12T17:05:02+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీలోని పలు డిపార్ట్‌మెంట్‌ల అధిపతులతో...

ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్టా‘రాజ్యం’.. పలుకుబడితో పైరవీలు!

  • వర్సిటీ పరిధిలోని పలు డిపార్ట్‌మెంట్ల అధిపతులు, ప్రిన్సిపాళ్ల తీరు
  • వీసీ అనుమతి లేకుండానే బదిలీలు
  • నోటిఫికేషన్లు ఇవ్వకుండానే పోస్టుల భర్తీ

హైదరాబాద్‌ సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని పలు డిపార్ట్‌మెంట్‌ల అధిపతులతో పాటు వర్సిటీ పరిధిలోని పలు కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వీసీలుగా ఎవరు వచ్చినా తమ పలుకుబడితో వివిధ పోస్టులను దక్కించుకుంటున్నారు. వీసీ అనుమతి లేకుండానే పలు పోస్టులు భర్తీ చేస్తున్నారు. బదిలీలు చేపడుతున్నారు.


అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ

కోఠి విమెన్స్‌ కాలేజీలో నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను భర్తీ చేశారు. నిబంధనల ప్రకారం భర్తీ చేయాలంటే వైస్‌ చాన్స్‌లర్‌ అనుమతితో నోటిఫికేషన్‌ వేయాలి. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో పోస్టులను భర్తీ చేయాలి. కానీ, కోఠి విమెన్స్‌ కాలేజీలో నిబంధనలను ఉల్లంఘించి అక్కడ గతంలో ఉన్న ప్రిన్సిపాల్‌ దాదాపుగా 40 కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేశారు. ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇటీవల వీసీ దృష్టి సారించినట్లు తెలిసింది. అవకతవకలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.


బది‘లీలలు’..

వర్సిటీ చరిత్రలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను తొలిసారిగా బదిలీలు చేశారు. అయితే, బదిలీ చేసే అధికారం వీసీ ఆదేశాలతో రిజిస్ర్టార్‌కు మాత్రమే ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రిన్సిపాల్స్‌ మౌఖిక ఆదేశాలతో బదిలీ చేశారు. దీనిపై నిజాం కాలేజీలో పని చేసే కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇష్టానుసారంగా బదిలీలు సరికాదని కమిషన్‌ పేర్కొంది. ఈ క్రమంలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల వేతనాల్లో ఐదు రోజులను వర్సిటీ కోతలు పెట్టింది. అలాగే కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు బాండ్‌ పేపర్‌పై అగ్రిమెంట్‌ చేయాలనే నిబంధన విధించారు. ఇందులో ఎలాంటి కారణం లేకుండా తొలగించే అధికారం వర్సిటీ అధికారులకు ఉందంటూ పొందుపరిచారు. దీనిపై కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.


రూ. 1.14 కోట్ల ఖర్చు..

ఉస్మానియా యూనివర్సిటీలోని ది రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (ఆర్‌సీయూఈఎ్‌స)లో నిబంధనలకు విరుద్ధంగా పోస్టులను సృష్టించుకున్నారు. కొందరు పాఠాలు బోధించకుండా అదనపు పోస్టులతో కాలం గడుపుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఆర్‌సీయూఈఎ్‌సలో వైస్‌ చాన్స్‌లర్‌ అనుమతి లేకుండానే రూ.1.14 కోట్లు ఖర్చు చేశారు. అంబేడ్కర్‌ సెంటర్‌లోనూ పుస్తకాల కొనుగోలులో, యూనివర్సిటీ హాస్టల్స్‌, తరగతి గదుల మరమ్మతుల్లోనూ, కంప్యూటర్ల కొనుగోలులోనూ అవకతవకలు జరిగినట్లుగా పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ పేరుతో కమిటీలు వేయడం, కాలయాపన చేయడంతో వీసీల పదవీ గడువు ముగిసిపోతోంది. విచారణ నివేదికలన్నీ బుట్టదాఖలవుతున్నాయి.

Updated Date - 2021-11-12T17:05:02+05:30 IST