OU Hostel : ఇదే తినాలి.. ఇంతే తినాలి.. ప్రశ్నించారో అంతే.. విద్యార్థినుల వ్యథ..

ABN , First Publish Date - 2022-03-10T15:43:16+05:30 IST

నాలుగు ఇడ్లీలు ఇస్తారు. అవి చిన్నగా ఉంటాయి. కొంచెం చట్నీ కప్పులో ఇస్తారు. పొద్దున ఎనిమిది గంటలకు..

OU Hostel : ఇదే తినాలి.. ఇంతే తినాలి.. ప్రశ్నించారో అంతే.. విద్యార్థినుల వ్యథ..

  • పెట్టింది తిను..
  • ఓయూ హాస్టళ్లలో విద్యార్థినులపై వివక్ష      
  • ఇంతే తినాలని నిబంధన  
  • చిన్న చిన్న ఇడ్లీలు.. గట్టి పూరీలు
  • మరో రెండు అడిగితే.. వివరాలు అడుగుతున్న వైనం
  • హాస్టల్‌ నిర్వాహకుల ఇష్టారాజ్యం

హైదరాబాద్‌ సిటీ : ‘నాలుగు ఇడ్లీలు ఇస్తారు. అవి చిన్నగా ఉంటాయి. కొంచెం చట్నీ కప్పులో ఇస్తారు. పొద్దున ఎనిమిది గంటలకు ఆ నాలుగు ఇడ్లీలు తిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండలేకపోతున్నాం. ఇంకో రెండు ఇడ్లీలు అడిగితే పేరు, క్లాస్‌ ఇలా వివరాలన్నీ చెప్పమంటారు. లేకుంటే పెట్టింది తిను అంటారు. ఏమీ అనలేక పెట్టింది తింటాం. ఫ్లీజ్‌ అన్నా.. పేపరులో నా పేరు రాయకు’ ఇదీ ఓయూ హాస్టల్‌లో ఉండే కోఠి ఉమెన్స్‌ కాలేజీ విద్యార్థిని వ్యథ.


‘పూరీలు గట్టిగా ఉంటాయి. రెండు ఇస్తారు. కప్పు చట్నీ ఇస్తారు. అవి తింటే కడుపులో నొప్పి. ఒక్కోసారి కాలేజీకి వెళ్లలేని పరిస్థితి. ఒక్కో రోజు అవి తినలేక కడుపు మాడ్చుకోవాల్సి వస్తోంది. పొద్దున పెట్టే టిఫిన్‌ తిని కాలేజీ వరకు నడుచుకుని వెళ్లేసరికి ఏమీ ఉండదు. మధ్యాహ్నం హాస్టల్‌ వరకు నడిచేందుకు ఓపిక ఉండడం లేదు.’ ఇదీ ఓయూలోని సైన్స్‌ కాలేజీ విద్యార్థిని ఆవేదన.


పెరిగిన సంఖ్య

ఓయూలో విద్యార్థినుల సంఖ్య గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. సుమారు 5వేల మంది గార్ల్స్‌, లేడీస్‌, విమెన్స్‌ హాస్టళ్లతో పాటు సెంటినరీ హాస్టల్‌లో ఉంటున్నారు. రోజుకో రకం టిఫిన్‌ చొప్పున సోమవారం కిచిడి, మంగళవారం చపాతీ, బుధవారం ఊతప్ప, గురువారం పూరి, శుక్రవారం చపాతీ, శనివారం దోశ, ఆదివారం ఇడ్లీ పెట్టాలని మెనూ ఉంది. కానీ అది అమలుకావడం లేదు. నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు పెడుతుండడంతో విద్యార్థినులు ఆకలికి అలమటిస్తున్నారు. ఓయూలోని లేడీస్‌ హాస్టల్స్‌ నుంచి క్యాంప్‌సలోని ఆర్ట్స్‌ కాలేజీ, సైన్స్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ ఇలా పలు కాలేజీలు కిలోమీటర్ల దూరం ఉంటాయి. నడుచుకుంటూ వెళ్లాలి. నడుచుకుంటూ రావాలి. కోఠి, నిజాం కాలేజీ విద్యార్థినులైతే ఆర్టీసీ బస్సులో వెళ్లి రావాలి. వర్సిటీలోని అమ్మాయిల హాస్టళ్లలో పెట్టే టిఫిన్‌ పదేళ్ల బాబుకు  కూడా సరిపోదని అంటున్నారు. ఇంతే తినాలనే నిబంధనలతో విద్యార్థినులు అల్లాడుతున్నారు.


ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్‌లో తిండికి కొదవ ఉండదు. ఎంత కావాలంటే అంతా. సాంబారు రుచికి ఎంతటివారైనా కానీ ఫిదా కావాల్సిందే. అన్నం, కూరలు, కూడా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే ఓయూ హాస్టళ్లలో అన్నం బాగోలేకపోయినా, కూరలు సక్రమంగా లేకపోయినా, అపరిశుభ్రంగా ఉన్నా వెంటనే విద్యార్థులు ప్లేట్లు విసిరేస్తారు. ఆ భయంతోనే ఉస్మానియా హాస్టళ్లలో భోజనం నాణ్యతగా వండుతారు. టిఫిన్‌, భోజనం ఎంత కావాలంటే అంత పెడతారు. అదనపు ఖర్చును యూనివర్సిటీయే విద్యార్థుల నుంచి వసూలు చేస్తుంది. విద్యార్థుల మెస్‌ చార్జీలు క్లియర్‌ చేస్తేనే సర్టిఫికెట్లు ఇస్తారు.


వారికో రూలు.. వీరికో రూలు..

వర్సిటీలో కొన్నాళ్లుగా పరిస్థితులు మారాయి. బాయ్స్‌కు మాత్రమే నాణ్యమైన భోజనం పెడుతున్నారు. అమ్మాయిలకు మాత్రం పెట్టింది తిను.. లేకుంటే మానుకో అంటూ హాస్టల్స్‌ నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హాస్టల్‌ విద్యార్థినులకు ‘ఇదే తినాలి. ఇంతే తినాలి’ అనే నిబంధనలు పెట్టారు. ప్రధానంగా అల్ఫాహారం మరీ తక్కువగా ఉంటోంది. రెండు, మూడు గంటల తర్వాత కడుపులో మళ్లీ ఆకలి మొదలవుతోందని విద్యార్థినులు చెబుతున్నారు.




ప్రశ్నిస్తే బెదిరింపులు

విద్యార్థినుల పట్ల సాగుతున్న వివక్షపై ఎవరైనా ప్రశ్నిస్తే నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారు. వివరాలు చెప్పాలని దబాయిస్తున్నారు. దీంతో చేసేదిలేక విద్యార్థినులు మౌనంగా ఉంటున్నారు. గతంలో యూనివర్సిటీ సంఘాల్లో బలమైన విద్యార్థిని నాయకురాళ్లు ఉండేవారు. సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తే మరుసటి రోజే ఆందోళన చేసేవారు. దీంతో నాణ్యమైన భోజనం పెట్టేవారు. ప్రస్తుతం వర్సిటీలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. బెదిరింపులకు గురి చేస్తుండడంతో ప్రశ్నించేవారు లేకుండా పోయారు.  దీంతో అమ్మాయిల హాస్టల్స్‌ నిర్వాహకులదే మెను.. పెట్టింది తిను అనే తీరుగా మారింది.

Updated Date - 2022-03-10T15:43:16+05:30 IST