గోలీల్లేని..గాంధీ..

ABN , First Publish Date - 2022-04-07T16:38:15+05:30 IST

పీహెచ్‌సీల సంగతి పక్కన పెడితే రాష్ట్రరాజధానిలో పెద్ద ఆస్పత్రులుగా పేరున్న ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, చెస్ట్‌, ప్రసూతి ఆస్పత్రుల్లోనూ

గోలీల్లేని..గాంధీ..

ఉస్మానియాలో ఉన్నవే ఇస్తం..

విరోచనాలు నియంత్రించలేని నిలోఫర్‌

పెద్దాసుపత్రుల్లోనూ బయట కొనాల్సిందే.. 

నాలుగు రాస్తే రెండే.. 

ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తున్న రోగులు


హైదరాబాద్ సిటీ: పీహెచ్‌సీల్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రోగులకు మందులు బయటకు రాస్తే ఉపేక్షించబోం, మందుల్లేక వైద్యం అందలేదని ఫిర్యాదొస్తే చర్యలు తప్పవు.  

ఇవీ.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు మంగళవారం పీహెచ్‌సీలపై నిర్వహించిన సమీక్షలో అన్న మాటలు.. 

పీహెచ్‌సీల సంగతి పక్కన పెడితే రాష్ట్రరాజధానిలో పెద్ద ఆస్పత్రులుగా పేరున్న ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, చెస్ట్‌, ప్రసూతి ఆస్పత్రుల్లోనూ సరైన మందులు లేవు. ఇక్కడి వైద్యులు రాసిన మందులు ఆస్పత్రి ఫార్మసీల్లో లేవనే సమాధానం వస్తోంది. దీంతో రోగులు బయటి మెడికల్‌ షాపుల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రుల్లో ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ నిర్వహించగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


ఖరీదైన మందులు బయటే.. 

గాంధీ ఆస్పత్రికి రోజూ రెండు వేల మందికి పైగా రోగులు వస్తుంటారు. డాక్టర్లు పరీక్షించి రాసిన మందులు ఆస్పత్రి ఫార్మసీలో అందుబాటులో ఉండవు. బలానికి, దగ్గు, జ్వరం, బీపీ, షుగర్‌ మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన మందులు బయటే కొనుక్కోవాల్సి వస్తుంది. బయట కొనుగోలు చేసుకుంటామంటే.. మంచి మందులు రాస్తామని, లేకపోతే అందుబాటులో ఉన్నవి రాస్తామని వైద్యులు చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. దీంతో గత్యంతరం లేక బయటి మెడికల్‌ షాపుల్లో మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ప్రసూతి ఆస్పత్రిలో

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చికిత్స కోసం పలు జిల్లాల నుంచి గర్భిణులు, బాలింతలు వస్తుంటారు. ఇక్కడ కొన్ని రకాల మందులు దొరకకపోవడంతో బయట కొనుగోలు చేస్తున్నారు. సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే వారు మందుల కోసం ప్రైవేట్‌ మెడికల్‌ దుకాణాన్ని ఆశ్రయిస్తున్నారు. 


ఉస్మానియా ఆస్పత్రిలో.. 

రాష్ట్రంలోనే పెద్ద ఆస్పత్రి ఉస్మానియా. రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. ఒక్క ఓపీలోనే దాదాపు వెయ్యి మంది వరకు ఉంటారు. అయితే, అవసరమైన మందులు దొరకకపోవడంతో సుమారు రెండు వందల మంది ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.  


చెస్ట్‌ ఆస్పత్రిలో.. 

ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో శ్వాసకోశ, క్షయ, ఛాతీ సంబంధిత రోగులు చికిత్స పొందుతుంటారు. ఇక్కడ ఇన్‌హేలర్‌ మినహా ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని, ఇతర వ్యాధులకు సంబంధించిన రోగులు వస్తే ఆస్పత్రిలో ఉన్న మందులు అందజేస్తామని, లేనిపక్షంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపిస్తామని వైద్యులు తెలిపారు.


విటమిన్‌ టాబ్లెట్లూ లేవు.. 

నిలోఫర్‌ ఆస్పత్రిలో కనీసం విటమిన్‌, మల్టీ విటమిన్‌ సిరప్‌లు కూడా దొరకడం లేదు. విరోచనాలను నియంత్రించే మందులు లేవు. ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు సంతృప్తికరంగా లేకపోవడంతో వైద్యులు బయటకు రాస్తున్నట్లు సమాచారం. 


అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.. 

ఓపీలో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఫార్మసీలో మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. రోగుల కోసం ఖరీదైన మందులు తెప్పిస్తున్నాం. ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. 

- డాక్టర్‌ రాజారావు 

(గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌)  


బయట కొనాల్సి వస్తోంది.. 

పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కొన్ని రకాల మందులు దొరకడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వైద్యం బాగానే ఉంది. అవసరమైన మందులు దొరకకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో బయట కొనాల్సి వస్తుంది.    

 - శాంతమ్మ, శంషాబాద్‌


ఖరీదైనవి లేవు 

చెస్ట్‌ ఆస్పత్రిలో తక్కువ ధరకు లభించే మందులను ఇస్తున్నారు. ఖరీదైన మందులను బయట కొనుక్కోమని చీటీ రాస్తున్నారు. నాకు ఆస్తమా, ఇన్‌హేలర్‌ వాడాలి. ఫార్మసీలో  ఇవ్వడం లేదు. బయట కొనాలంటే రూ. 300 అవుతోంది.   

- ప్రభావతి, రోగి


నాలుగురాస్తే.. రెండే.. 

గాంధీ ఆస్పత్రి వైద్యులు నాలుగు మందు లు రాస్తే.. ఆస్పత్రి ఫార్మసీలో రెండు రకాల మందులే ఇస్తున్నారు. మిగిలినవి బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.

 -రహీం, ముషీరాబాద్‌


ఉన్న మందులే ఇస్తున్నాం

ఫార్మసీలో ఉన్న మందులనే రోగులకు ఇస్తున్నాం. లేని వాటిని బయట కొనుక్కోమని చెబుతున్నాం. వైద్యులు ఏ మందులు రాస్తారో వాటినే ఫార్మసీలో స్టాకు పెట్టుకుంటాం. 

-శ్రీనివాస్‌ (గాంధీ ఫార్మసీ ఇన్‌చార్జి) 

Updated Date - 2022-04-07T16:38:15+05:30 IST