Abn logo
May 4 2020 @ 01:12AM

భయం, భరోసాల మధ్య ఊగిసలాట

కరోనా నేపథ్యంలో అమెరికన్‌ తెలుగు రచయితలు

కరోనా విషశ్వాస తగిలి ఆర్చుకుపోతోంది అమెరికా. ప్రజలు వొట్టి అంకెలై రాలిపోతున్నారు. ఇక్కడ మృత్యు విలయం ఇటలీ స్పెయిన్‌ల కంటే వెనకే మొదలయింది. కానీ ఆ దేశాలు ప్రస్తుతానికి ముప్ఫై వేల లోపు మృతులతోనే నిమ్మళించాయి. అమెరికాలో మాత్రం మృతుల సంఖ్య త్వరితంగా ఊపందు కుని అరవై వేలు దాటిపోయింది. ఇంకా రోజుకు వందల్లో చనిపోతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ ఉంటున్న కొందరు తెలుగు రచయితల్ని వారి అనుభవాలు, అభిప్రాయాలను పంచుకొమ్మని అడిగింది వివిధ:

మానసికంగా యేదో

ఇరుగ్గా అనిపిస్తోంది

మా వూళ్ళో స్ర్పింగ్‌ బ్రేక్‌ తరవాత ఆ వుత్సాహమే వేరు. ఇక మంచు పడదు కాబట్టి రోడ్ల మీద హాయిగా వాకింగులూ రన్నింగులూ చేయవచ్చు అనుకున్నాం. పైగా, ఈ సారి మంచి ఎండలు కాస్తున్నాయి బయట. మేం మాత్రం లోపల కూర్చొని, మా పాటియోల మీద జలజల కురుస్తున్న ఎండల్ని ‘‘చూస్తున్నాం’’ అంతే! మామూలుగా కాంప్‌సలో వుంటే, ప్రతి క్లాసుకీ మధ్య అరగంటసేపు ఆ చెట్ల మధ్య హాయిగా తిరిగిరావడం నాకు అలవాటు. యెవరైనా తోడొస్తే, కుదిరితే కప్పు కాఫీ.. కాసిని కబుర్లూ! ఇప్పుడు క్లాస్‌ క్లాస్‌కీ మధ్య (కింద బేస్‌మెంట్‌ ఆఫీ్‌సలో లాప్‌టా్‌పలో ఆన్‌లైన్‌!) పైకి వచ్చి, కేవలం ఆ పాటియోలో వొక రౌండు! ఇంట్లో వుండడంలో ఆనందం లేదని కాదు. కానీ, ‘‘బలవంతాన వుండడంలో’’ ఆనందంలో లేదని చెప్పగలను. మానసికంగా యేదో ఇరుగ్గా అనిపిస్తోంది. పైగా, మా ఇంటి నుంచి కాంప్‌సకి వెళ్ళే దారి నాకు చాలా ఇష్టం. నేను బస్సులోనే వెళ్తాను. ఎక్కువసేపు నడిచే వీలు వెట్టుకొని అయిదారు బస్‌స్టాప్‌ల ముందే బస్‌ దిగేస్తాను. దారికి రెండు వైపులా అనేక రంగుల పూలు, కొత్త వాతావరణ ఉత్సాహంలో బైకుల మీదనో, నడుచుకుంటూనే వెళ్ళే విద్యార్థులూ--వాళ్ళ కిలకిలలూ--ఇవన్నీ జీవనోత్సాహాన్ని పెంచుతాయి. ఈ లాక్‌ డౌన్‌ వల్ల అదంతా చూస్తూండగానే జారిపోయిన కలలాగా వుంది. నిన్న చివరి క్లాస్‌లో విద్యార్థులకు వీడ్కోలు చెప్పాను. వాళ్ళలో అయిదుగురు గ్రాడ్యూయేట్‌ అయి వెళ్లిపోతున్నారు. వీడ్కోలు మాటల్లో వాళ్ళ గొంతులు గద్గదికమయ్యాయి. ""Professor, we will miss the conversations over our long walks on campus. Very sad, very sad... that we’re saying good bye to each other not sharing a coffee and a walk!'' వాళ్ళకి యేం చెప్పాలో నా దగ్గిరా మాటలు లేవు! యేదైనా అకస్మాత్తుగా వస్తే, ఎదుర్కోవడం కష్టం. ఎదుర్కోక తప్పదు అని చెప్పే పాఠం ఇదేనేమో! కానీ, దీని duration మరీ పొడుగ్గా వుంది... అంతే!

అఫ్సర్‌ (ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా)


దయ స్వార్థం బహురూపాలలో 

బయటపడి ఆశ్చర్యపరుస్తున్నాయి


ఇంటి దగ్గరనుంచే పనీ, బంధుమిత్రులతో ఆన్‌లైన్‌ ద్వారా సంభాషణలతో ఇంటికే కట్టుబడ్డ ఛాయామాత్రపు జీవితం మిగతా ప్రాంతాల్లాగే డాల్‌సలోనూ కొనసాగుతూంది. చావు భయమూ, కుంగుతూన్న ఆర్థిక పరిస్థితికీ మధ్య పాలకులూ, ప్రజలూ భిన్న ప్రాధాన్యతలతో సతమతమవుతున్నారు. పుస్తకా లలో చదువుతూనే, సినిమాల్లో చూస్తూనే ఉన్నాం కానీ మనం ఇటువంటి ప్రపంచవ్యాప్తపు విపత్తు బారిన నిజంగానే పడతా మని ఏ కొద్దిమందో తప్ప ఊహించి ఉండరు. 

క్షణమాత్రంలో ప్రపంచమంతా ఎలా తలకిందులవుతుందో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. మనమం తా ఇందులో ఒకటేననీ, ప్రతి ఒక్కరి బతుకూ పక్కవాడి బతుకుతో ముడిపడి ఉందనీ గమ నింపు కలుగుతుంది. దయా, స్వార్థం వంటి లక్షణాలు బహు రూపాలలో బయటపడి ఆశ్చర్యపరుస్తున్నాయి. తాత్కాలికంగా కొన్ని జ్ఞానోదయాలు కలిగి ఉండొచ్చు. ఇది మామూలు పరిస్థితి కాదనీ, ఇకముందు ఎప్పుడూ మునుపటిలా ఉండబోదనీ ఇప్పటికి అనిపిస్తూనే ఉన్నా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే మళ్లీ ఇదంతా మర్చిపోయి ఇవన్నీ మన ముసలితనంలో కథలుగానే గుర్తు తెచ్చుకు చెప్పుకుంటామేమోననీ అనిపిస్తుంది. 

నియంత్రించబడిన కదలికలూ, వేరే మనిషి పొడ సోకకుండా బతకవలసి రావడమూ మన స్వేచ్ఛా ప్రవృత్తికీ, సహజాతానికీ విరుద్ధమే అయినా జీవనకాంక్ష వల్ల మనం నేర్చుకుంటాం, అలవాటు పడతాం, ఏదో రకంగా అధిగమిస్తాం. గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ వంటి దారుణమయిన విపత్తును ఎదుర్కొనేందుకు మానవజాతి సంసిద్ధమవడానికీ ఇది ఉపయోగపడవచ్చు. అనంత విశ్వంలో భూ గోళం నలుసైనట్టు, అనంత కాలంలో మానవ జాతి మనుగడ రెప్పపాటేననీ తెలిసీ నిష్ఫలమే కావొచ్చు.

చంద్ర కన్నెగంటి (డాలస్‌, టెక్సాస్‌)


ఎన్నో మార్పులని 

మనం న్యూ నార్మల్‌గా భావించక తప్పదు 


మొదటిసారి కరోనా వైరస్‌ గురించి విన్నపుడు ఆసియా, ఆఫ్రికా దేశాలకి పరిమితమయిన స్వైన్‌ ఫ్లూ, ఇబోలా వంటి ఇంకో వైరస్‌ కావొచ్చు, మన దాకా రాదులే అనిపించింది. అది సరైన అంచనా కాదని తెలుసుకుందుకు ఎక్కువ సమయం పట్టలేదు. కరోనా సరిహద్దులతో నిమిత్తం లేకుండా సర్వత్రా వ్యాపించి జనజీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. నేనుండే హ్యూస్టన్‌ మహానగరం ప్రపంచ (అనధికారిక) చమురు రాజధానిగా సుప్రసిద్ధం, ఇక్కడ లాకౌట్‌ ప్రకటించగానే వీధులన్నీ ఒక్కసారిగా బోసిపోయాయి, హ్యూస్టన్‌ రద్దీ తెలిసినవారికి ఇదొక అనూహ్యమైన దృశ్యం. కనిపించని శత్రువుని ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటించడం తప్ప వేరే గత్యంతరం లేదని లక్షలాదిమంది తొందరగానే అర్థం చేసుకున్నారు. కాస్త ఆలస్యమైనా కరోనాని పారద్రోలడానికి వాక్సిన్‌ లభిస్తుంది, వ్యవస్థ కుదుటపడుతుంది. ఇదంతా ముగిసాకా ప్రపంచం మునుపటిలా మాత్రం ఉండదు - మనుషులు మాస్కులు ధరించడం, తగినంత దూరం పాటించడం, కంపెనీలు ఉద్యోగులని కరోనా పరీక్షలు తరచుగా చేసుకోమని నిబంధనలు విధించడం... ఇలా ఎన్నో మార్పులని మనం న్యూ నార్మల్‌గా భావించక తప్పదు. 

మధు పెమ్మరాజు (హ్యూస్టన్‌, టెక్సాస్‌)


తమ దాకా వస్తే కానీ కదలని

మనుషులను చూస్తుంటే విసుగు


నేనూ, నా పదకొండేళ్ల అమ్మాయి అనన్య, న్యూ జెర్సీలోని పెన్నింగ్టన్‌ అనే ఊర్లో ఉంటున్నాం. మా ప్రాంతంలో పబ్లిక్‌ స్కూల్స్‌ మార్చి 16 నుంచి మూసేసి, ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెట్టారు. మామూలు రోజుల్లోనే పిల్లల పట్ల టీచర్లుకు ఉండే ప్రేమ, రెస్పాన్సిబిలిటీ చూస్తే అబ్బురమనిపిస్తుంది. ఈ లాక్‌డౌన్‌తో అది ఇంకా తెలిసొచ్చింది. ఓ వారం తిరగకుండానే హైస్కూల్‌ టీచర్‌ ఒకరు, పిల్లలను ఎంత మిస్‌ అవుతున్నారో పాట కూడా కట్టారు. యూట్యూబ్‌లో ఇలా వెతికితే చూడొచ్చు: "Hey There, My Students" ("Hey There Delilah" Parody)


మా గురించి కన్సర్న్‌తో ‘‘బాగానే ఉన్నారా?’’ అంటూ కొంతమంది బంధువులూ, స్నేహితులూ ఎన్నో ఏళ్ల తరువాత పలకరించడం, ఓ రెండు నెలలకోసం హైదరాబాదులో గడిపి వస్తామంటూ వెళ్లిన మా అమ్మానాన్న అక్కడే చిక్కుకుపోవడం, ఇంట్లోంచే నా పనీ, అనన్య బడీ వంటివి తప్ప మా ఇద్దరి జీవితాల్లో పెద్ద మార్పులేం లేవు. మా జీవితాల్లోనే కాదు ఇండియాలో, అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనల్లోనూ ఏ మార్పూ లేకపోవడం గురించి మాట్లాడుకున్నాం. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రోజున్నే మానవ హక్కుల కార్యకర్తలైన గౌతం నవ్‌లఖానూ, ఆనంద్‌ తెల్తుంబ్డేను ఇంతటి సంక్షోభంలోనూ అరెస్ట్‌ చెయ్యడం గురించీ మాట్లాడుకుంటున్నప్పుడు, ‘‘కరోనావైరస్‌ వల్లనైనా మనుషుల్లో క్రూరత్వం పోతుందనుకున్నా అమ్మా, మనుషులు ఎప్పటికీ మారరా? ఎవడి గ్రిడ్‌ వాడిదేనా?’’ అని అనన్య అడగడం ఒక వైపు బాధ, మరోవైపు కొత్త ఉత్సాహం. తమ దాకా వస్తే కానీ కదలని మనుషులను చూస్తుంటే విసుగూ, అనన్యలా బాధ పడుతున్న పిల్లలు కొందరైనా ఉండి ఉంటారు, మార్పు కోసం పోరాడుతారు అన్న ఉత్సాహం మరో వైపు - వెరసి ఈ కరోనావైరస్‌ సమయంలో సమాజాన్ని కొత్త దృష్టితో చూస్తున్న ఒక అమ్మాయీ, తనకు తోడుగా ఒక అమ్మా.

మమత కె. (షెన్నింగ్టన్‌, న్యూ జెర్సీ)


అమెరికా జీవితంలో ఇన్నాళ్ళూ చూడని కొత్తకోణాలు


మార్చ్‌ నెల సగం గడిచేసరికే ఇక్కడ అందరికీ ఏదో తెలియని భయం మొదలైంది. డొమెస్టిక్‌ ఫ్లయిట్స్‌ కేన్సిల్‌ చెయ్యడం వల్ల, ఉగాదికి కలవాల్సిన స్నేహితులు రాలేకపోతున్నారన్న కబురందింది అప్పుడే. ఆఫీసులుంటాయి, డే కేర్‌లు నడుస్తాయి అన్న వార్తలు కూడా రెండోవారానికి ఉత్తిమాటలని తేలిపోయింది. పబ్లిక్‌ స్కూళ్ళు మూసెయ్యడం, తిరిగి ఎప్పుడు తెరుస్తారో చెప్పలేమనడం, ఆఫీసులవాళ్ళు ఎదురు డబ్బులిచ్చి మరీ వర్క్‌ ఫ్రం హోంకి కావలసిన ఏర్పాట్లు చేసుకొమ్మని చెప్పడం, డేకేర్‌లు, లైబ్రరీలు, పార్కులూ అన్నీ రెండుమూడురోజుల తేడాలో మూతబడిపోవడంతో, ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలో పడ్డామనిపించింది. కర్ఫ్యూ రానుందన్న పుకారుతో, ఎప్పుడూ లెక్కలేనన్ని పార్కింగ్‌ స్లాట్‌లు ఖాళీగా కనపడే ఇండియన్‌ మార్కెట్‌ పరిసరాలన్నీ కిక్కిరిసి, సరుకులు లూటీ చేసినట్టే ఖాళీ అయిపోయాయి. అర్ధరాత్రి ఎదురైనా నవ్వుతూ పలకరించే ఇక్కడి స్థానికులు ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు తలొంచుకు తప్పించుకుపోవడం, యాచకుల ఊసే లేని ఈ ఊళ్ళో, మేం బయటకు వెళ్ళాల్సి వచ్చిన రెండు సార్లూ ‘‘మాక్కాస్త డబ్బుసాయం కావాలి; హోంలెస్‌ ఐపోయాం’’ అంటూ పార్కింగ్‌లో కొందరు వెంటపడటం... అమెరికా జీవితంలో నేను ఇన్నాళ్ళూ చూడని కొత్తకోణాలు. అయితే, ఏప్రిల్‌ మొదటివారం గడిచేసరికి ఈ వాతావరణంతో, భయంతో మా అందరికీ ఏదో సంధి కుదిరింది. తలుపులన్నీ బిడాయించుకుని కూర్చున్న వాళ్ళు కూడా మెల్లిగా మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని కొలుచుకుంటూ వాకింగ్‌కి బయటకొస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం రిమోట్‌ టీచింగ్‌ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుని పెద్దపిల్లల క్లాసులు యథావిధిగా నడిచేట్టు చేస్తోంది. పసిపిల్లలను పనిచేస్తూ కూడా నిభాయించుకోగల ఒడుపేదో అమ్మలకూ ఒంటబట్టినట్టే ఉంది. నిర్బంధంలోనే గడించిందని చెప్పాల్సిన నెలాపదిరోజుల తర్వాత, ఈ వారమే మా రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి, ఫరవాలేదు, ఇది పూర్తిగా సమసిపోతుందన్న భరోసానిస్తోంది.

మానస చామర్తి (ష్రూస్‌బరీ, మసాచుసెట్స్‌)

అతిపేదవారిని, 

నల్లవారిని చాలా బాధిస్తున్నది


మిషిగన్‌ రాష్ట్రం, అందులో ముఖ్యంగా డిట్రాయిట్‌ నగర పరిసర ప్రాంతం అంతా కార్ల తయారీకి ప్రసిద్ధి. బిగ్‌ 3 అని పిలవబడే జెనరల్‌ మోటర్స్‌, ఫొర్డ్‌, క్రైజ్లర్‌ కంపెనీల ముఖ్య కార్యాలయాలు, ఇరవైకి పైగా కర్మాగారాలు ఇక్కడున్నాయి. 2008లో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన ఆర్థిక సంక్షోభంలో అమెరికా కార్ల కంపెనీలు బాగా కుదేలయినాయి. అప్పట్లో ఈ కంపెనీల ఉద్యోగస్తుల కళ్ళల్లో నిజమైన భయాన్ని చూశాను నేను. జెనరల్‌ మోటర్స్‌ లాంటి కంపెనీ దివాలా తీసింది. ఆర్థిక వ్యవస్థ సర్దుకున్నాక గత పదేళ్ళుగా ఆకాశమే హద్దు అన్నట్టు పారి శ్రామిక ఉత్పత్తీ, అభివృద్ధీ వ్యాపిస్తూ వస్తున్నాయి. అలా వ్యాకోచ మేఘంలా వ్యాపిస్తున్న ఈ అంతర్జాతీయ కార్ల వాణిజ్య వ్యవస్థ మీద ఉరుములేని పిడుగులా పడింది ఈ కొరోనా మహమ్మారి. వాణిజ్య సంబంధాల రీత్యా డిట్రాయిట్‌కీ, చైనాలో వూహాన్‌ రాష్ట్రానికీ సన్నిహిత సంబంధాలూ, రాకపోకలూనూ. దాంతో అమెరికాలో ఈ వ్యాధి వ్యాప్తిలో మిషిగన్‌ రాష్ట్రమూ, అందులోనూ ముఖ్యంగా డిట్రాయిట్‌ నగర ప్రాంత మూ బాగా దెబ్బతిన్నాయి. గత యాభై ఏళ్ళకి పైగా భయంకరమైన రాజకీయ నిర్లక్ష్యంలో కుళ్ళిపోయిన డిట్రాయిట్‌ నగరం- ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటున్న పరిస్థితుల్లో, అతిపేదవారిని, నల్లవారిని చాలా దారుణంగా అసంఖ్యాకంగా బాధి స్తున్నది ఈ కరోనా. లెక్కల్లో వ్యాధిగ్రస్తులూ, చావులూ ఈ నగరంలో, పేద వర్గాలలోనే ఎక్కువగా ఉన్నారు. ఆసుపత్రులు చేతులెత్తేసేంత పరిస్థితి ఐతే రాలేదు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్య భాగమయిన కార్ల పరిశ్రమ అంతా బ్రేకు పడి ఆగిపోయింది. కొన్ని లక్షలమంది తాత్కాలికంగా నిరుద్యోగులయ్యారు. మే 18న మెలమెల్లగా వ్యాపారాలు తెరవడానికి అనుమతిస్తాము అంటున్నారు కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయంపై మాత్రం చాలా అయోమయమే ఇప్పటికి.

శంకగిరి నారాయణస్వామి (బ్లూంఫీల్డ్‌ హిల్స్‌, మిషిగన్‌)


మా దేశ అధ్యక్ష్యుడు ఎప్పుడు

 ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదు


 నలభై నాలుగు రోజులు దాటింది, స్వేచ్ఛగా బయటకు అడుగుపెట్టి. చివరిసారి ఆఫీసుకు పోయి ఇంటి నుండి పనిచేయడానికి అవసరమైనవన్నీ వెంట తెచ్చుకున్నా. అప్పటి నుండి ఇంట్లోనే బందీ. ఇది రాస్తున్న సమయానికి మా రాష్ట్రం న్యూ జెర్సీ లక్షా పదహారువేలమంది వైరస్‌ సోకిన వాళ్ళతో, ఆరువేల ఎనిమిదివందల దాకా చావులతో రెండో స్థానంలో ఉంది. భద్రపరచడానికి జాగా లేక వందలాదిగా శవాలు ఫ్రీజర్‌ ట్రక్కుల్లో కిక్కిరిసిపోతున్నాయి. శ్మశానాల్లేక సామూహిక ఖననం చేస్తున్నారు. బతుకరని ఏమాత్రం అనుమానమొచ్చినా, ఆసుపత్రులు ట్రీట్‌మెంట్‌ చెయ్య డానికి అడ్మిట్‌ చేసుకోవడం లేదు. ఈ వార్తలన్నీ రోజూ టీవీలో చూస్తుంటే వెన్నుపూసలో సన్నగా వణుకు. రోజూ పొద్దున్నే క్రికెట్‌ మాచ్‌ స్కోర్‌ చూసినట్టు, నిన్న ఎన్ని కొత్త కేసులొచ్చాయి, ఎంతమంది చనిపోయారు అనుకుంటూ అంతులేకుండా పెరుగుతున్న స్కోర్‌ చూడడం హృదయ విదారకంగా, భయకంపితంగా ఉన్నది.


మరోవైపు మా దేశ అధ్యక్ష్యుడు ఎప్పుడు ఏమి మాట్లాడతాడో, అందులో నిజమెంతో, అబద్ధమెంతో, ఎవరికి ఉపయోగపడే ‘నిజాలో’ ఎవరికీ తెలియదు. ఒక రోజు క్లోరోక్వీన్‌, అజిత్రోమైసిన్‌ కోవిడ్‌కు సరైన మందు అంటాడు, కాదు దానికి ఎటువంటి నిర్ధారణ లేదు పైగా గుండె లయతప్పి ఆగిపోవచ్చు అని వైద్యులంటారు. మరో రోజు లైసాల్‌ డిసిన్ఫెక్టంట్‌ తాగమని సలహా ఇస్తాడు. కేసులాగిపోయినై ఇక అమెరికా తెరవాలి అంటాడు. అన్న వెంటనే వైద్యబృందాలు మరో రెండు వేల చావులు ప్రకటిస్తాయి. తెరవద్దు అన్న రాష్ట్రాల గవర్నర్లపై ప్రజలని తిరుగుబాటు చెయ్యమంటాడు. రాష్ట్రాలకు వైద్యపరికరాల సహాయం కేంద్రం బాధ్యత కాదంటాడు. రోజుకో మాట నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల చావులు, ఇబ్బందులు, కష్టాలు తనకేమీ పట్టనట్టు తన గొప్పలే చెప్పుకుంటాడు. అమెరికాలో వ్యాపారం సజావుగా జరగాలి, అందుకే వెంటనే తెరవాలి అంటూ పెట్టుబడిదార్ల వంత పాడతాడు. 


ఎన్నడూ లేనిది గత యాభై రోజులుగా మా కుటుంబమంతా, ఒకే చోట ఇంట్లో కలిసున్నాము. కలిసి వండుకుంటున్నాము, కలిసి తింటున్నాము, కలిసి సినిమాలు సీరియళ్ళు చూస్తున్నాము. అయితే ఇదంతా మా చుట్టూ ఆవరించి ఉన్న మృత్యుభయాన్ని జయించడానికే. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రేపు ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన అసందిగ్ధ మృత్యుశైతల్య నిశ్శబ్దంలో బిక్కు బిక్కుమనుకుంటూ కొట్టుమిట్టాడడమే!

నారాయణస్వామి వెంకటయోగి (ప్రిన్స్‌టన్‌, న్యూజెర్సీ)


ఆత్మరక్షణ కోసం 

తుపాకులు కొనుక్కున్నారు


నేనుండే ఊరు రోనోక్‌. పెద్ద పట్టణాలకి కాస్త దూరంలో ఉండటం వలన ఇక్కడి వరకు కరోనా రావడం కాస్త ఆలస్యం అయ్యింది. నిత్యావసరాలకు ఏమీ ఇబ్బందులు లేవు. ఊరు పూర్తిగా ఆగిపోలేదు. ఇప్పటివరకైతే ఆఫీస్‌ పనులు కూడా ఇంట్లోంచే చేస్తూ బయటికి రాకుండా ఉండగలిగాం. ఆఫీస్‌ పనిమీద ఫిబ్రవరి చివర్లో ఇటలీ వెళ్ళి కూడా కరోనాతో చేయి కలపకుండా తిరిగి రాగలిగాను. అప్పుడేం భయం అనిపించలేదు కానీ, ఇలా జీవితాంతం ఇంట్లో ఉండాల్సివస్తుందేమోననే దిగులు మాత్రం ఉంది. పొద్దున్నే మంచం మీంచే confe-rence calls అటెండ్‌ కాగలగడం ఒక కొత్త అనుభవం.  కానీ, చే స్తున్న పని నిర్దిష్టంగా ఎన్నింటికి ఆపాలో ఇంకా నా అదుపులోకి రాలేదు, ఎందుకంటే సాయంత్రం పనికట్టేసి టంచనుగా ఇంటికెళ్లాల్సిన అవ సరం లేదిప్పుడు. అంతకు ముందు ఆఫీస్‌లో వరుసగా తొమ్మిదిగంటలు పనిచేసి మిగతా సమయం వేరే పనులు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 24 గంటలూ ఆఫీస్‌ పనులుచేస్తూ మధ్యమధ్యలో విరామం తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇన్నాళ్ళూ ఉద్యోగంలో టెక్నికల్‌ స్కిల్స్‌ అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోయేది. కానీ ఎలాంటి pandemicsకైనా త్వరగా అడాప్ట్‌ అయి పనిచేయగలిగే నేర్పును సాధించడం ఇప్పటి కొత్త అవసరం. Food riots ఏమైనా జరుగుతాయేమోనని ఇక్కడ కొంతమంది మిత్రులు ఆత్మరక్షణ కోసం తుపాకులు కొనుక్కున్నారు. సానిటైజర్లు, టాయిలెట్‌ పేపర్లతో పాటూ స్థానిక దుకాణాల్లో బుల్లెట్స్‌ (ammo) కొరత కూడా ఉంది. ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తయి ఉద్యోగాల్లో జాయిన్‌ అవ్వాల్సిన పిల్లలు, స్కూల్‌ పూర్తయి కాలేజీకి వెళ్లాల్సిన పిల్లల భవిష్యత్తు విషయంలో కొంత అయోమయం ఉంది.

రవి వీరెల్లి (రొనోక్‌, వర్జీనియా)


ఈ విపత్తు ఒక గొప్ప 

‘‘ఈక్వలైజర్‌’’ కూడా


నేనుండే కాలిఫోర్నియా లోని బే ఏరియాలో, దాదాపు ఏభై వేల కేసులు, రెండు వేల మరణాలు. ఏడు వారాలుగా సాగుతోంది ‘‘షెల్టర్‌ ఇన్‌ ప్లేస్‌’’. ఈ గృహ దిగ్బంధనం మొదలైన రెండు మూడు వారాల వరకూ రోజూ ఈ అంకెలను జాగర్తగా గమనించటం, మా అధ్యక్షుడు రోజూ టీవీలో ఇచ్చే ప్రదర్శనని తిలకించడం మా దినచర్యలో ఒక భాగమై ఉండేవి. ఆ తరవాత ఆకాశం వైపుకు దూసుకుపోతున్న అంకెలకు, ఆ దిశలోనే వెళ్తున్న నిత్య ప్రదర్శనలోని మూర్ఖత్వానికి, ఆశ్చర్యపోవటం ఆపేశాం. ఇక్కడి పరిస్థితుల గురించి మన తెలుగు టీవీ చానెళ్లలో వేడిగా వండుతున్న వార్తలను తిలకించి, మా గురించి దిగులు చెందుతూ మా యోగక్షేమాలు గురించి చాలామంది వాకబు చేశారు. వాస్తవానికి ఇలా సాగుతోంది ఇక్కడ. తొమ్మిది గంటలకి సమావేశం ఉంటే, ఎనిమిదిన్నరదాకా నిద్ర పోవటం, జూమ్‌ వీడియో ఆన్‌ చేసే ముందు స్నానం చెయ్యటం, లాగులూ, టీ షర్టులలో రోజంతా గడపటం, మధ్యాహ్న సాయంకాల భోజనాలు ఎంతో ఆరోగ్యకరంగా ఇంట్లోనే వండుకొని తినటం, పెరట్లో ఆట లూ, అసురసంధ్య వేళ షికార్లు, నెట్‌ఫ్లిక్స్‌లో సిరీ్‌సలు, సినిమాలు, ఆన్‌లైన్‌ షాపింగులు, అనవసర ఖర్చులు తగ్గటంతో పెరిగిన బ్యాంకు ఖాతాలతో, అంతుపట్టని స్టాక్‌ మార్కెట్‌ విన్యాసాలతో, ఏ రోజు ఏ వారమో కూడా తెలియకుండా జారుకుంటోంది జీవితం. కానీ ఇది ఒక ‘‘ప్రివిలెజ్డ్‌ లైఫ్‌’’. మరో పక్క, ఎన్నో లక్షల మంది ఉపాధి కోల్పోయి ఎన్నో రకాల ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ విపత్తు ఒక గొప్ప ‘‘ఈక్వలైజర్‌’’ కూడా. అమెరికా, ఇండియా అని భేదాల్లేకుండా అందరినీ ఒకే నావలో తెచ్చి పడేసింది. ఒక రకంగా ఏ ఇజమూ సాధించలేని సమానత్వాన్ని ఇది తెచ్చింది. వంద సంవత్సరాలకి ఒక్క సారి జరిగే చారిత్రాత్మక ఘటనలో మనకీ స్థానాన్ని కలిపించింది. అందరినీ మరికొంత దగ్గరకు చేర్చింది.

యాజి (సారటోగా, కాలిఫోర్నియా)


ఏప్రిల్‌ ఈజ్‌ ద క్రుయెలెస్ట్‌ మంత్‌


ఇంట్లోనే ఉండమని జార్జియా గవర్నర్‌ కెంపు (ఓ్ఛఝఞ) అందరికన్నా ఆలస్యంగా ఆజ్ఞ జారీచేసాడు. ఆ శాసనాన్ని అందరికన్నా ముందే కొంపమునిగిందేమో అన్నట్టు అంతే తొందరగా రద్దుచేసాడు. అది ప్రపంచానికి పెద్ద హాస్యవార్త అయ్యింది. అధ్యక్షుడు ట్రంపూ, గవర్నరు కెంపు-- ఇద్దరిలో ఎవడు పెద్ద దద్దమ్మ అనే వివాదం ప్రపంచ పత్రికలన్నింటిలో చోటు చేసుకుంది.


మా రాష్ట్రం ఎఱ్ఱ రాష్ట్రం. చైనా ఎఱ్ఱ రంగు అని మురిసిపోయే ఎఱ్ఱ రంగు కాదు. రాష్ట్రంలో ఏదయినా మార్పు అంటే, ఏకె-47 తుపాకి కోసం పరిగెత్తే జాతి; సంప్రదాయ (‘ఎవాంజెలికల్‌’) వాదుల జాతి. వూహాన్‌లో ఏం జరిగిందో జరగలేదో మాకనవసరం అనే జాతి. కాని, ట్రంపు మాట్లాడితే యోహాను సువార్తకన్నా ముఖ్యంగా పరిగణించే జనం మా ఎఱ్ఱ రాష్ట్రాలలోనే పెక్కుమంది ఉన్నారన్నది జగమెరిగిన పచ్చి నిజం. క్షౌర శాలలు, చర్మచిత్రపార్లర్లూ, నఖమిసిమి శాలలూ వెంటనే తెరవమని గవర్నరు కెంపు ఆజ్ఞాపించటం--ట్రంపు అందుకు ప్రత్యక్షంగా వ్యతిరేకత చూపించడం--నిజమేనని నమ్మిన వాళ్ళు లేకపోలేదు. అసలునిజం ఏమిటంటే, వీళ్ళిద్దరూ తోడుదొంగలు. పైన చెప్పిన వృత్తులతో పొట్ట పోసుకునే వాళ్ళల్లో 95ు మైనారిటీలు. పనికి వెళ్తే, కరోనా భయం. వెళ్ళకపోతే,  నిరుద్యోగ భత్యం దొరకదనే భయం. ఉద్యోగం ఉండగా నిరుద్యోగ భత్యం ఇవ్వడానికి కెంపు చట్టం ఒప్పుకోదు.  ఇది కావాలని ఆర్థిక వ్యవస్థ పేరిట ఇద్దరూ కుమ్మక్కయి చేసిన రాజకీయ కుతంత్రం. కావాలని మైనారిటీలపై అక్కసుతో చేసిన ఆర్థిక దాడి. 


మాసంగతి. బయటికి పోలేం. మనం జాగ్రత్తగా ఉన్నా మన పక్కవాడు ఉండకపోవచ్చుగా అన్న భయం. ఈ ఎండాకాలం మొత్తం ఇంట్లోనే ఉండాల్సిన అవసరం కనిపిస్తూన్నది. మానసికంగా అది మంచిది కాదని తెలుసు. వాక్సీను వచ్చేవరకూ ఇంటిపట్టునే ఉండటం వయసు  మళ్ళిన మాబోంట్లకి తప్పదు. స్థానిక ప్రయాణాలకి కూడా కొంతకాలం స్వస్తి. ‘‘April is the cruelest month,'' We’ll erase it from the calendar.

వేంకటేశ్వరరావు వేలూరి (లారెన్స్‌విల్‌, జార్జియా)


Advertisement
Advertisement
Advertisement