హైదరాబాద్‌ కంటే ఓరుగల్లుది గొప్ప చరిత్ర

ABN , First Publish Date - 2022-01-24T08:30:35+05:30 IST

ఓరుగల్లు చరిత్ర హైదరాబాద్‌ చరిత్ర కంటే గొప్పదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు.

హైదరాబాద్‌ కంటే ఓరుగల్లుది గొప్ప చరిత్ర

  • ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి: చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ 
  • అగ్గలయ్యగుట్ట జైన క్షేత్రం ట్రస్ట్‌కు.. ఇక నిత్యపూజలు


హనుమకొండ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఓరుగల్లు చరిత్ర హైదరాబాద్‌ చరిత్ర కంటే గొప్పదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హైదరాబాద్‌ది 500 ఏళ్ల చరిత్ర అయితే.. వరంగల్‌ది వెయ్యేళ్లకుపైనే అన్నారు. హనుమకొండలో పద్మాక్షి దేవాలయం సమీపంలోని అత్యంత ప్రాచీనమైన జైన క్షేత్రాన్ని (అగ్గలయ్య గుట్ట) శాంతిలాల్‌ దిగంబర్‌ జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆదివారం అప్పగించింది. కుడా రూ.1.3 కోట్లతో హృదయ్‌ పథకం కింద ఈ క్షేతాన్ని అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా 16వ జైన తీర్థంకరుడైన శాంతినాథుడి దిగంబర విగ్రహం ఎదుట శాంతి విధాన్‌ (విశ్వశాంతి) పూజను ట్రస్ట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినయ్‌భాస్కర్‌  జైన భక్తుల ను ఉద్దేశించి మాట్లాడుతూ... చాళుక్యులు, జైనులు, కాకతీయులు పాలించిన ఓరుగల్లు నేలపై ఎటుచూసినా ప్రాచీన, చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయన్నారు. ఈ జైనక్షేత్రం భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి త్వరలో సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు జైన సమ్మేళనాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. శాంతినాథ్‌ దిగంబర్‌ జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి సుమేర్‌ లాల్‌ జైన్‌ మాట్లాడుతూ.. అగ్గలయ్య గుట్ట ప్రాంతంలో అయిదెకరాల స్థలాన్ని ట్రస్ట్‌కు అప్పగిస్తే 100 గదులతో సత్రాన్ని నిర్మిస్తామని అన్నారు. అగ్గలయ్య గుట్టపై శాంతినాథుడి దిగంబర విగ్రహం వద్ద ఇక నుంచి ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు అభిషేకం, అర్చనలను నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ అధ్యక్షుడు రాజేష్‌ పహాడ్‌ గార్ల పాల్గొన్నారు. కాగా, అగ్గలయ్య గుట్టపై 16వ జైన తీర్థంకరుడైన శాంతినాథుడి దిగంబర విగ్రహం 30 అడుగుల ఎత్తులో ఉంది. ఇదే గుట్టపై తొమ్మిదో శతాబ్దానికి చెందిన 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడి విగ్రహం కూడా ఉంది.  ఇదే గుట్టపై ఏడుగురు జైన తీర్థంకరుల అర్థ శిల్పాలు ఉన్నాయి. వీటిలో పార్శ్వనాథుడి విగ్రహం కూడా ఉంది. ఈ శిల్పాలు రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు పాలించిన 9, 10వ శతాబ్దాలనాటివి. అగ్గలయ్య వెయ్యేళ్ల కిందట పశ్చిమ చాళుక్య రాజైన జగదేకమల్ల జయసింహుడి (1015-1042) ఆస్థానంలో వైద్యాచార్యుడిగా పనిచేశాడు.

Updated Date - 2022-01-24T08:30:35+05:30 IST