ఏ ఒఆర్‌ఎస్‌ ఉత్తమం?

ABN , First Publish Date - 2021-10-26T09:07:45+05:30 IST

ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు కారణమయ్యే ప్రధాన రుగ్మతల్లో డయేరియా ఒకటి. ప్రతి వంద మంది పిల్లల్లో 13 మంది పిల్లల మరణాలకు డయేరియా కారణంగా ఉంటోంది.

ఏ ఒఆర్‌ఎస్‌ ఉత్తమం?

వాంతులు, విరోచనాలతో పిల్లలు నీరసపడితే ఒఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్‌) తాగిస్తాం. మరి మందుల షాపుల్లో మనం కొంటున్న ఒఆర్‌ఎస్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినదేనా?

ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు కారణమయ్యే ప్రధాన రుగ్మతల్లో డయేరియా ఒకటి. ప్రతి వంద మంది పిల్లల్లో 13 మంది పిల్లల మరణాలకు డయేరియా కారణంగా ఉంటోంది. డయేరియాతో శరీరంలోని నీరు, లవణాల లోటు ఏర్పడడం మూలంగా మూర్ఛ, షాక్‌, కోమా, పేగు వాపు, పక్షవాతం మొదలైన సమస్యలతో పిల్లలు మరణానికి చేరువ అవుతూ ఉంటారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే డయేరియా మూలంగా కోల్పోయిన నీరు, లవణాలను సరైన మోతాదుల్లో పిల్లల శరీరాల్లో భర్తీ చేయాలి. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఒఆర్‌ఎస్‌ ఫార్ములాలనే వాడుకోవాలి. వీటిలో గ్లూకోజు, సోడియం, పొటాషియం, క్లోరైడ్‌ మొదలైన లవణాలు ఉంటాయి. దీన్లో ఉండే గ్లూకోజ్‌, సోడియం శరీరంలో శోషణ చెందడానికి తోడ్పడే పరిమాణంలో పరిమితంగా మాత్రమే ఉంటుంది. ప్యాకెట్‌ మీద డబ్ల్యుహెచ్‌ఒ రికమెండెడ్‌ ఫార్ములా అనే గుర్తు కూడా ఉంటుంది. అయితే మందుల షాపుల్లో ఒఆర్‌ఎస్‌ పేరుతో దొరికే కొన్ని టెట్రాప్యాక్స్‌లో లవణాల మోతాదులు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఫార్ములాకు భిన్నంగా ఉంటున్నాయి. 


వేరే ఫార్ములా ఇస్తే...

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఫార్ములాకు బదులుగా మార్కెట్లో దొరికే ఇతర ఫార్ములాలను అందిస్తే సమస్య తగ్గకపోగా, పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. డీహైడ్రేషన్‌ అదుపులోకి వచ్చి, డయేరియా తగ్గాలంటే తక్కువ చక్కెర, ఎక్కువ సోడియం, పొటాషియంలు కలిగిన ఒఆర్‌ఎస్‌ అందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఫార్ములాకు భిన్నంగా తయారయ్యే ఒఆర్‌ఎస్‌లలో అధిక మోతాదులో చక్కెర, తక్కువ మోతాదులో సోడియం, పొటాషియం ఉంటాయి. వీటిని ఇవ్వడం వల్ల విరేచనాలు అదుపు కాకపోగా, విపరీతంగా పెరిగిపోతాయి. దాంతో డీహైడ్రేషన్‌ మరింత పెరిగి పరిస్థితి విషమిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏవి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందినవో, ఏవి పొందనివో తెలుసుకొని వినియోగించాలి. 


ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ పర్మిషన్‌తో...

ఒఆర్‌ఎస్‌లను తయారు చేసే కొన్ని ఔషథ సంస్థలు ‘ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ ఆమోదంతో ఒఆర్‌ఎస్‌ను తలపించే పానీయాలను తయారుచేస్తున్నాయి. ప్యాకెట్ల మీద ‘ఒఆర్‌ఎస్‌’ఎల్‌, విఐటి‘ఒఆర్‌ఎస్‌’ అనే అయోమయానికి గురి చేసే లేబుళ్లతో రోగులను పక్కదారి పట్టిస్తున్నాయు. వైద్యులు ఒఆర్‌ఎస్‌ సూచించినప్పుడు ఫార్మసీలలో ఈ రకం పానీయాలనే రోగులు కొని వాడుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఏది సరైన ఒఆర్‌ఎస్‌ పానీయమో, ఏది కాదో తెలుసుకోవడం అవసరం.


ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందినవి

వీటి మీద డబ్ల్యుహెచ్‌ఒ ఫార్ములా అని స్పష్టంగా ముద్రించి ఉంటుంది. దీని కోసం గమనించాలి.

ఎలెక్ట్రాల్‌ వాలైట్‌

 రాన్‌బాక్సీ ఒఆర్‌ఎస్‌

 వాలైట్‌ ఒఆర్‌ఎస్‌

సిప్లా తయారీ ఒఆర్‌ఎస్‌ 

(ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్‌) 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందనవి

ఇవి ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆమోదం మాత్రమే పొంది ఉంటాయి. 

ఒఆర్‌ఎస్‌ఎల్‌ (గ్రీన్‌ యాపిల్‌, యాపిల్‌, ఆరెంజ్‌, లెమన్‌)

 ఒఆర్‌ఎస్‌ఎల్‌ ప్లస్‌ 

(రెడీ టు సర్వ్‌)

రెబాలాంజ్‌ విట్‌ ఒఆర్‌ఎస్‌

డాక్టర్‌ శివరంజనిపిడియాట్రీషియన్‌.

Updated Date - 2021-10-26T09:07:45+05:30 IST