ఊరూరా సారా!

ABN , First Publish Date - 2021-06-20T05:09:08+05:30 IST

జిల్లాలో నాటుసారా అంటే ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం గుర్తుకు వచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తన చేతుల్లోకి తీసుకుని, లిక్కర్‌ ధరలను ఎడాపెడా పెంచేయడంతో మద్యం ప్రియులు ప్రత్యామ్నాయంగా నాటుసారాను సేవిస్తున్నారు.

ఊరూరా సారా!
నాటుసారా

గ్రామీణ ప్రాంతంలో విచ్చలవిడిగా తయారీ, అమ్మకాలు

పెరిగిన లిక్కర్‌ ధరలు, అడ్డగోలు బ్రాండ్లతో నాటుసారా వైపు మందుబాబుల చూపు

నాడు మద్యం బెల్టు షాపులు... నేడు సారా బెల్టులు

తయారీ, అమ్మకందారులకు ఇబ్బడిముబ్బడి ఆదాయం

మారుమూల ప్రాంతాల నుంచి పంచాయతీ కేంద్రాలకు విస్తరిస్తున్న సారా బట్టీలు

ఎక్సైజ్‌ దాడులు బేఖాతరు


ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచేయడం, ఊరూ పేరూ లేని బ్రాండ్లు అమ్ముతుండ డంతో మందుబాబులు నాటుసారాను ఆశ్రయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు మారుమూల గ్రామాలకే పరిమితమైన సారా తయారీ, అమ్మకాలు... ఇప్పుడు మండల కేంద్రాలకు కూడా విస్తరించాయి. మద్యం ధరలతో పోలిస్తే రేటు తక్కువ వుండడం, కిక్కు ఎక్కువ ఇస్తుండడంతో మందుబాబులు సారాను సేవిస్తున్నారు. మరోవైపు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో పలువురు సారా తయారీ వైపు మళ్లుతున్నారు. ప్రతి ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో నిత్యం ఏదోఒకచోట సారా బట్టీలపై దాడులు చేస్తూ, భారీగా బెల్లం పులుసును ధ్వంసం చేస్తున్నారంటే తయారీ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. 


చోడవరం, జూన్‌ 18: జిల్లాలో నాటుసారా అంటే ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం గుర్తుకు వచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తన చేతుల్లోకి తీసుకుని, లిక్కర్‌ ధరలను ఎడాపెడా పెంచేయడంతో మద్యం ప్రియులు ప్రత్యామ్నాయంగా నాటుసారాను సేవిస్తున్నారు. దీంతో మైదాన ప్రాంతంలోని అత్యధిక గ్రామాల్లో నాటుసారా గుప్పుమంటున్నది. గతంలో మద్యం బెల్టు షాపులు నిర్వహించిన తరహాలోనే ఇప్పుడు సారా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే మద్యం అమ్మకాలకు దీటుగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. నాటుసారా వ్యాపారం మూడు సీసాలు...ఆరు ప్యాకెట్లుగా వృద్ధి చెందుతుండడంతో పలువురు దానిని ఉపాధిగా ఎంచుకుంటున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేస్తే...సురక్షితంగా తప్పించుకునేలా గ్రామాల శివార్లలో మామిడి, జీడిమామిడి, సరుగుడు, నీలగిరి తోటల్లో సారా తయారు చేస్తున్నారు. గతంలో చీప్‌ లిక్కర్‌ తాగేవారిలో అత్యధిక శాతం మంది ఇప్పుడు నాటుసారా తాగుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ధరలు అధికంగా వుండడం, గతంలో తామెన్నడూ చూడని, తాగని బ్రాండ్ల మద్యాన్ని అమ్ముతుండడంతో నాటుసారాను ఆశ్రయిస్తున్నట్టు మద్యం ప్రియులు చెబుతున్నారు. 


నానాటికీ పెరుగుతున్న సారా తయారీ

జిల్లాలోని మైదాన ప్రాంతంలో నాటుసారా తయారీ ఒక కుటీర పరిశ్రమగా మారింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండడం, అమ్మకాలు బాగుండడం, మరోవైపు కరోనా కారణంగా కూలి పనులు అంతంతమాత్రంగానే వుండడంతో పలువురు సారా తయారీ వైపు మళ్లుతున్నారు. మరికొంతమంది తయారీదారుల నుంచి సారా కొనుగోలు చేసి, గ్రామాల్లో అమ్ముతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. సారాకు డిమాండ్‌ పెరుగుతుండడంతో గ్రామాల్లో బట్టీలు కూడా అంతేస్థాయిలో విస్తరిస్తున్నాయి. మండల కేంద్రాలకు కూతవేటు దూరంలో కూడా సారా తయారుచేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు. 


సారా తయారీ అధికంగా జరిగే మండలాలు....

ఎక్సైజ్‌ శాఖ అధికారుల సమాచారం ప్రకారం మైదాన ప్రాంతంలో రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి, పాయకరావుపేట,  నక్కపల్లి, కోటవురట్ల, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, అచ్యుతాపురం మండలాల్లో సారా తయారీ ఎక్కువగా ఉంది.


సారా మత్తులో ఎమ్మెల్యేతో వాగ్వాదం

గతంలో చోడవరం మండలంలోని పంచాయతీలకు చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లోని కొన్ని గ్రామాల నుంచి నాటుసారా సరఫరా అయ్యేది. అయితే ఇప్పుడు చోడవరం మండలంలోని పలు గ్రామాల్లో సారా బట్టీలు వెలిశాయి. ఇటీవల మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని ఓ చెరకుతోటలో నాటుసారా తయారీ కోసం నిల్వ వుంచిన బెల్లం పులుపును స్థానిక ఎస్‌ఐ పి.విభీషణరావు ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. చోడవరం పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వున్న ఈ గ్రామంలో సారా తయారు చేస్తారని ఎవరూ ఊహించరు. నాలుగు నెలల క్రితం జన్నవరంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్న సభలో ఓ మందుబాబు సారా మత్తులో సాక్షాత్తూ ఎమ్మెల్యేతోనే వాదనకు దిగడంతో, పల్లెల్లో నాటుసారా తయారీపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ధర్మశ్రీ విజ్ఞప్తి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాగా మండల కేంద్రానికి శివారులో వున్న చాకిపల్లి పంచాయతీ, అనకాపల్లి సరిహద్దులోని కొన్ని ప్రదేశాల్లో నాటుసారా తయారవుతున్నట్టు తెలిసింది.


గ్రామాల్లో విచ్చలవిడిగా సారా బట్టీలు...

నూతన మద్యం పాలసీ తర్వాత పెరిగిన సారా

సారా పేకెట్‌ స్థానంలో 200ఎంఎల్‌ బాటిల్స్‌

నర్సీపట్నం చుట్టుపక్కల మండలాల్లో పెరిగిన సారా విక్రయాలు


నర్సీపట్నం, జూన్‌ 19: నర్సీపట్నం చుట్టుపక్కల పలు గ్రామాల్లో సారా బట్టీలు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. గతంలో సారా తాగాలనుకుంటే నర్సీపట్నం నుంచి డౌనూరు వెళ్లేవారు. ఇప్పుడు ధర్మసాగరం, వేములపూడి, పెదబొడ్డేపల్లిలో బట్టీలు పెట్టేశారు. ఇక్కడ నుంచి చుట్టు పక్కల మండలాలకు కూడా సరఫరా చేస్తున్నారు. అలాగే నాతవరం మండలం డి.ఎర్రవరం, గుణుపూడి, వలసంపేట, మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం, రాచపల్లి, గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట, చీడిగుమ్మల, రత్నంపేట గ్రామాల్లో సారా బట్టీలు ఉన్నాయి. రోలుగుంట మండలం పెదపేట, జె.నాయుడుపేట, బుచ్చింపేట, కోటవురట్ల మండలం ఏఎస్‌ పేట, పాములవాక, కొయ్యూరు మండలం డౌనూరు, మర్రిపాలెంలో విచ్చలవిడిగా సారా తయారుచేస్తున్నారు. 

250 ఎంఎల్‌ బాటిల్‌ సారా రూ.100

గతంలో 50 ఎంఎల్‌, 100 ఎంఎల్‌, 200 ఎంఎల్‌ సారా ప్యాకెట్లలో లభ్యమయ్యేది. రూ. 10, రూ.20, రూ.30కు విక్రయించేవారు. మద్యం ధరలు ఎప్పుడైతే పెరిగాయో సారా ధరలు కూడా బాగా పెంచేశారు. ఇప్పుడు సీసాల్లోకి మార్చి 250 ఎంఎల్‌ రూ.100కు విక్రయిస్తున్నారు. గతంలో మద్యం తాగే అలవాటు వున్నవారు కిక్కు చాలదని సారా తాగేవారు. ఇప్పుడు కొంతమంది యువకులు కూడా లీటర్‌ వాటర్‌ బాటిల్‌లో సారా తీసుకుపోయి డ్రింక్‌లో కలుపుకొని తాగుతున్నారు.

Updated Date - 2021-06-20T05:09:08+05:30 IST