Abn logo
Feb 21 2020 @ 05:35AM

అదే అసలైన జాగరణ

అహో విచారతో నాస్తి హ్యన్యతత్త్వార్థ వాదినః

నిష్కలం సకలం చిత్తే సర్వం శివమయం జగత్‌

సాకార లింగం గానీ.. నిరాకార లింగంగానీ.. భిన్నంగా ఉండవు! అవి శివతత్వాన్ని ఎరిగిన జ్ఞాని హృదయంలోనే ఉంటాయి. విచారించి చూస్తే.. ఈ జగత్తు మొత్తం శివునితోనే నిండి ఉందని శివ మహాపురాణం చెబుతుంది. ఉర్విలో సర్వం శివమయమనే సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు..


ఇతి జ్ఞానం సముత్పన్నం యావన్నైవ నరస్య వై

తావచ్చ కర్మణా దేవం శివమారాధయేన్నరః

సృష్టిలోని మానవులంతా జ్ఞానం కలిగేంతవరకూ శివుణ్ని వివిధ ఉపచారాలతో పూజించాలని చెబుతుంది. పూర్వం బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి నేను గొప్పంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. వారిద్దరి మాయను తొలగించేందుకు పరమేశ్వరుడు, వారిద్దరి మధ్యలో జ్యోతిర్లింగ రూపం దాల్చి ఆవిర్భవించాడు. తన ఆద్యంతాలు కనుక్కొని రమ్మన్నాడు. ఆ ప్రయత్నంలో విఫలురైన బ్రహ్మవిష్ణువుల ఆవేదన అంతరించింది. అది మాఘ బహుళ చతుర్దశి. చంద్రశేఖరుడైన ఆ పరమేశ్వరుడు శివుడు.. బ్రహ్మ, విష్ణువుల పూజలందుకున్న రోజు. అదే మహాశివరాత్రి.


శివుడు అభిషేక ప్రియుడు. భక్తులు శివరాత్రి రోజున లక్షబిల్వార్చన చేసి, పునీతభక్తితో పూజించి, రాత్రి మొదటి ఝాములో పాలతో, రెండవ ఝామున పెరుగుతో, మూడవ ఝామున నెయ్యితో, నాల్గవ ఝామున తేనెతో అభిషేకిస్తే శివానుగ్రహానికి పాత్రులవుతారు. పంచాక్షరీ మంత్ర జపంతో పునీతులవుతారు. ఆ విధానాలన్నీ సంసార సాగరాన్ని సులభంగా దాటించే ఓంకార స్వరూపాలనదగిన నావలు. అవి పాపభూయిష్టమైన మనసులను మంచిగా మలిచి, మనిషిని మనీషిగా మారుస్తాయి. ఇక జాగరణ అంటే.. కేవలం మేలుకొని ఉండడం కాదు. చిత్తాన్ని శివునిపైనే నిలిపి శివపూజతో, శివస్తుతితో, శివభజనామృతంతో, శివలీలావృత్తాంతాన్నీ వీనుల విందుగా వినడంతో ప్రకృతిలో అంతటా నిండి ఉన్న శివశక్తిని మేల్కొల్పి అంతరాత్మలో పరమాత్మను దర్శించడమే నిజమైన జాగరణ అని ఆత్మతత్వజ్ఞులంటారు. అలా చేయగలిగితే సాలోక్యం, సామీప్యం, సాయుజ్యమనే నాల్గు సత్ప్రయోజనాలు సిద్ధిస్తాయని తాత్వికుల అభిభావన. అలా ఒక్క మహాశివరాత్రి నాడే కాదు.. నిత్యం శివుణ్ని అర్చించాలి.


యోర్చయేచ్ఛివలింగం వై నిత్యం భక్తి పరాయణః

తస్యవై సఫలా సిద్ధిర్న స పాపైః ప్రయుజ్యతే

నిత్యం శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించేవారి కోరికలు సిద్ధిస్తాయి. పాపాలు వారిని అంటవు. ఓం.. నమశ్శివాయ!!

 విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య, 9948348918

Advertisement
Advertisement
Advertisement