లేబుల్‌ ఒరిజినల్‌... సరకు కల్తీ

ABN , First Publish Date - 2020-11-29T06:02:21+05:30 IST

అసలు సీసా కంటే అందంగా రూపొందించి, ఒరిజినల్‌ లేబుల్‌ అంటించి అందులో కల్తీ మద్యాన్ని నింపి సొమ్ము చేసుకుంటున్న ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏడీసీపీ వేజెండ్ల అజిత తెలిపారు.

లేబుల్‌ ఒరిజినల్‌... సరకు కల్తీ
స్వాధీనం చేసుకున్న వస్తువులను చూపించి వివరాలు తెలియజేస్తున్న ఏడీసీపీ అజిత

ఒడిశాలో తయారీ...ఆంధ్రాలో అమ్మకం

కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు

ముగ్గురు అరెస్టు, పరికరాలు స్వాధీనం


మహారాణిపేట, నవంబరు 28: అసలు సీసా కంటే అందంగా రూపొందించి, ఒరిజినల్‌ లేబుల్‌ అంటించి అందులో కల్తీ మద్యాన్ని నింపి సొమ్ము చేసుకుంటున్న ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏడీసీపీ వేజెండ్ల అజిత తెలిపారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈనెల 25వ తేదీన నకిలీ మద్యం రవాణా అవుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు గాజువాక వడ్లపూడి వద్ద నిఘా పెట్టామన్నారు. ఆ సమయంలో ఒడిశాలోని బరంపురం ప్రాంతానికి చెందిన నాగిరెడ్డి తిరుమల (48), కంకిపాడు శ్రీనివాస్‌ (47)లు కారులో వెళుతుండగా అడ్డుకుని తనిఖీ చేసినట్టు తెలిపారు. కారులో 250 క్వార్టర్‌ (180 ఎంఎల్‌) బాటిళ్లు లభించాయని, బాటిళ్లపై ఒడిశాలో మాత్రమే అమ్మాలని వుండడంతో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే బాటిళ్లన్నీ ఒకే బ్యాచ్‌ నంబర్‌తో వుండడంతో అనుమానం వచ్చి పరీక్షకు పంపించగా...అది రెక్టిఫైడ్‌ స్పిరిట్‌, ఇతర రసాయనాలతో కలిపి తయారుచేసిన నకిలీ మద్యం అని తేలిందన్నారు. దీన్ని మనుషులు తాగకూడదని, అలా జరిగితే లివర్‌ దెబ్బతింటుందని, ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి వారిచ్చిన సమాచారం మేరకు విశాఖ, శ్రీకాకుళం ఎస్‌ఈబీ విభాగాలు, పోలీసులతో కలిసి ఒడిశా రాష్ట్రం బరంపురంలోని తయారీ కేంద్రంపై దాడి చేసినట్టు తెలిపారు. అక్కడ నకిలీ మద్యం, రసాయనాలు, ఖాళీ మద్యం బాటిళ్లు, బాటిల్స్‌పై అంటించే లేబుల్స్‌, సీలింగ్‌ లేబుల్స్‌ స్వాధీనం చేసుకోవడంతోపాటు సాగర్‌కుమార్‌ సాహు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విశాఖలో అదుపులోకి తీసుకున్న ఇద్దరితోపాటు సాగర్‌కుమార్‌సాహుని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించిందని తెలిపారు. మద్యం తయారీ, ఇతర వస్తువులు పరీక్షా కేంద్రానికి తరలించామని, దీనిపై మరింత లోతైన విచారణ జరుపుతామని ఏడీసీపీ వేజెండ్ల అజిత తెలిపారు.  


Updated Date - 2020-11-29T06:02:21+05:30 IST