సంస్థాగత బలమే గెలుపు మంత్రం

ABN , First Publish Date - 2022-07-03T08:34:42+05:30 IST

‘‘సంస్థాగత బలమే గెలుపు మంత్రం. సంస్థాగతంగా బలోపేతమైతే ఎన్నికల్లో గెలుపు అదే వస్తుంది’’ అంటూ తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాన మంత్రి మోదీ దిశానిర్దేశం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజు మోదీ ఎలాంటి ప్రసంగం చేయలేదు.

సంస్థాగత బలమే గెలుపు మంత్రం

  • ఇతర రాష్ట్రాల్లో విజయానికి కారణమిదే
  • తెలంగాణ నేతలకు మోదీ దిశానిర్దేశం
  • అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ప్రజల మధ్య 
  • గడపాలని పార్టీ నేతలకు సూచన
  • నియోజకవర్గాల్లో నేతల టూర్లపై ఖుషీ
  • సాయంత్రం టీ బ్రేక్‌ తెలంగాణ నేతలతోనే


హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘‘సంస్థాగత బలమే గెలుపు మంత్రం. సంస్థాగతంగా బలోపేతమైతే ఎన్నికల్లో గెలుపు అదే వస్తుంది’’ అంటూ తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాన మంత్రి మోదీ దిశానిర్దేశం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజు మోదీ ఎలాంటి ప్రసంగం చేయలేదు. కొన్ని సందర్భాల్లో పార్టీ నేతలతో మాత్రం మాట్లాడారు. సాయంత్రం టీ, స్నాక్స్‌ సమయంలో తెలంగాణ నేతలతో కలిసి కూర్చున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులు మోదీతో చర్చలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలు-వాటి ఫలితాలపై కొద్దిసేపు చర్చ జరిగిందని సమాచారం. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఎన్నికల వ్యూహాలు.. అక్కడ విజయం సాధించిన తీరుపై పార్టీ నేతల మధ్య చర్చ జరిగింది. గుజరాత్‌లో వరుస విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయన్న అంశమూ ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగానే, సంస్థాగత బలాన్ని పెంచుకుంటేనే విజయం సాధ్యమవుతుందని తెలంగాణ నేతలకు మోదీ సూచించారు. కాగా, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో అనుసరించిన వ్యూహంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 119 నియోజకవర్గాలకూ పార్టీ సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ పార్టీ నేతలు.. ఇలా అందరినీ పంపాలన్న ప్రణాళిక విజయవంతమైందని నేతలు ఆయనతో చెప్పారు. మొత్తం 119లో 116 నియోజక వర్గాలను కవర్‌ చేశామన్నారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా ర్యాలీ ఉండడంతో ఒక నియోజకవర్గం, ఇతర కారణాలతో మరో రెండు నియోజక వర్గాలను కవర్‌ చేయలేదన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందేశం తెలంగాణలోని ప్రతి పల్లెకు వెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని మోదీకి వివరించారు. ఈ కార్యక్రమం, జాతీయ కార్యవర్గ ఏర్పాట్లకు సంబంధించి మోదీ సంతోషం వ్యక్తం చేశారని తెలిసింది.


ప్రతి జిల్లాలోనూ 24 గంటలూ..

ప్రతి రాష్ట్రంలో నేతలంతా జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లోనూ బృందాలుగా విడిపోయి 24 గంటలూ ప్రజల మధ్య గడపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రోజుకు ఒక జిల్లా చొప్పున ఎంచుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల పర్యటనలు జరపాలని, సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలను కలుసుకోవాలని, వారి జీవితాల గురించి తెలుసుకోవాలని సూచించారు. కార్యవర్గ సమావేశాల్లో భాగంగా శనివారం ఆర్థిక తీర్మానం, గరీబ్‌ కల్యాణ్‌ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మోదీ జోక్యం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలను తెలుసుకున్నప్పుడే వారికి అనుకూలమైన కార్యక్రమాలను చేపట్టగలమని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలలో అట్టడుగున ఉన్న నేతను గుర్తించి మంత్రి పదవి ఇచ్చామని, పార్టీ ఇలాంటి వర్గాలను గుర్తించాలని నిర్దేశించారు. సహకార రంగంలో మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు. 

Updated Date - 2022-07-03T08:34:42+05:30 IST