తాను కన్నుమూసి మరికొందరికి వెలుగునిచ్చాడు..

ABN , First Publish Date - 2022-05-12T16:52:20+05:30 IST

తాను చనిపోతూ మరికొందరికి జీవితాన్ని ఇచ్చాడు ఓ కానిస్టేబుల్‌. భౌతికకంగా లేకపోయినా.. ఇతరుల శరీరాల్లో సజీవంగా మిగిలాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రంగశాయిపేట

తాను కన్నుమూసి మరికొందరికి వెలుగునిచ్చాడు..

-చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ సెల్వం సతీష్‌ మృతి

-అవయవాలను దానం చేసిన కుటుంబసభ్యులు

హనుమకొండ: తాను చనిపోతూ మరికొందరికి జీవితాన్ని ఇచ్చాడు ఓ కానిస్టేబుల్‌. భౌతికకంగా లేకపోయినా.. ఇతరుల శరీరాల్లో సజీవంగా మిగిలాడు.  వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రంగశాయిపేట సమీపంలోని గణపతినగర్‌ కాలనీకి చెందిన సెల్వం సతీష్‌(36) వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు రోజుల కిందట సతీష్‌ విధులకు హాజరయ్యేందుకు తనతో పనిచేసే మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఉర్సుగుట్ట వద్దరోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదుపుతప్పి బైక్‌పై నుంచి కిందపడిపోగా వెనుక వేగంగా వస్తున్న కారు అతడిపై నుంచి దూసుకుపోయింది. తలకు బలమైన దెబ్బ తాకడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. 

సతీష్‌ ఆశయాలకు జీవం పోయాలనే నిర్ణయంతో కుటుంబసభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. విషయం డాక్టర్లకు చెప్పడంతో అక్కడి వైద్యులు మృతదేహం నుంచి అవయవాలను సేకరించారు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, కార్నియా అవయవదానం చేశారు. సతీష్‌ అవయవాలను ఏడుగురికి దానం చేయవచ్చని డాక్టర్లు వెల్లడించారు. కాగా, అవయవదానానికి ముందుకు వచ్చిన సతీష్‌ కుటుంబసభ్యులను సీపీ తరుణ్‌ జోషి, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్‌ ప్రతినిధులు, సహచర పోలీసులు, స్థానికులు అభినందించారు.

Read more