ఆలయాలపై ‘బకాయిల’ కత్తి

ABN , First Publish Date - 2022-06-24T08:33:30+05:30 IST

దేవదాయ శాఖలో నిబంధనలకు పాతరేశారు. ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు వినియోగించాల్సిన నిధులను ఇష్టానుసారం వాడేశారు. కారు అలవెన్సులు, వేతనాలు, గోశాలలు అంటూ ఎడాపెడా

ఆలయాలపై  ‘బకాయిల’ కత్తి

బాకీలు చెల్లించాల్సిందేనని సర్కారు హుకుం

ఎఫ్‌డీలు డ్రా చేసైనా కట్టాలని ఒత్తిడి 

దేవదాయ శాఖలో ఇష్టానుసారం ‘సీజీఎఫ్‌’ వాడకం

కారు అలవెన్సులు, వేతనాలు, గోశాలలకు

వెలంపల్లి నియోజకవర్గానికే 30 కోట్లు

ఎడాపెడా వాడటంతో సీజీఎఫ్‌ ఖాతా ఖాళీ

ఇప్పుడు ఆలయాలపై పడిన దేవదాయశాఖ

311 కోట్ల బకాయిలు కట్టాలని ఆదేశాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖలో నిబంధనలకు పాతరేశారు. ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు వినియోగించాల్సిన నిధులను ఇష్టానుసారం వాడేశారు. కారు అలవెన్సులు, వేతనాలు, గోశాలలు అంటూ ఎడాపెడా వాడుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఆలయాలకు పరిమితికి మించి కోట్లకు కోట్లు కేటాయించారు. కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) ఖాతాలో నిధులన్నీ వాడేశారు. తీరా సీజీఎ్‌ఫలో నిధులు నిండుకోగానే ఆలయాలపై పడ్డారు. రుసుముల రూపంలో ఉన్న బకాయిలు మొత్తం కట్టాలంటూ అధికారులు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  డబ్బులు లేకుంటే చివరికి ఎఫ్‌డీలు డ్రా చేసైనా కట్టి తీరాలంటూ ఆలయాలపై కత్తి పెట్టింది. దేవదాయ శాఖ తీరు చూస్తుంటే ఆలయాల ఖాతాలన్నీ ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు మొత్తం బకాయిలు కట్టాలనడం పట్ల ఆ శాఖలోనే అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేవదాయ నిబంధనల ప్రకారం రూ.2 లక్షల వార్షిక ఆదాయం దాటిన ఆలయాలన్నీ ఏటా వాటి ఆదాయంలో వివిధ రూపాల్లో 21.5శాతం దేవదాయ శాఖకు చెల్లించాలి.


కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద 9శాతం, ఎండోమెంట్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ఫండ్‌ కింద 8శాతం, అర్చక సంక్షేమ నిధి కింద 3శాతం, ఆడిట్‌ ఫీజు రూపంలో 1.5శాతం చెల్లించాలి. ఆలయాల్లో నగదు వెసులుబాటును బట్టి రెండు మూడు విడతలుగా చెల్లిస్తాయి. ఆలయాల్లో కొత్త నిర్మాణాలు చేపట్టినప్పుడు, ఇతరత్రా ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయాన్ని వాటికి వినియోగించి, దేవదాయ శాఖకు చెల్లించాల్సిన రుసుములను బకాయిలు పెడతాయి. ఇది శాఖలో సర్వసాధారణ ప్రక్రి య. ఈ క్రమంలో గత మార్చి వరకు ఆలయా లు దేవదాయ శాఖకు రూ.353 కోట్లు బకాయి పడ్డాయి. ఆ తర్వాత రూ.42 కోట్లు వసూలు కాగా ఇంకా రూ.311 కోట్లు చెల్లించాల్సి ఉంది.


అన్నింటికీ సీజీఎఫ్‌ నిధులే 

దేవదాయ శాఖలో నాలుగు రకాల రుసుముల్లో సీజీఎఫ్‌ కీలకం. దేవదాయ చట్టంలోని సెక్షన్‌ 70 ప్రకారం సీజీఎఫ్‌ నిధుల్ని కచ్చితంగా ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు మాత్రమే వినియోగించాలి. కానీ దేవదాయ శాఖ ఇష్టానుసారంగా సీజీఎఫ్‌ నిధులు వాడుతోంది. గతంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఏర్పాటు చేసి ధర్మప్రచారానికి సీజీఎఫ్‌ నిధులు వాడింది. దానిపై దాఖలైన పిల్‌ను విచారించిన కోర్టు.. సీజీఎఫ్‌ నిధులను ఇష్టానుసారంగా వాడేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో  అప్పట్లో దేవదాయ శాఖ వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు దేవదాయ శాఖలో ఎలాంటి అదనపు ఖర్చుకైనా సీజీఎఫ్‌ నగదే వాడుతున్నారు. అధికారుల కారు అలవెన్సులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు, సలహాదారుల వేతనాలు.. ఇలా ప్రతిదానికీ సీజీఎఫ్‌ నిధులు ఎడాపెడా వాడేస్తున్నారు.


ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో జిల్లాల దేవదాయ కార్యాలయాల్లో ఫర్నీచర్‌కు ఆలయాల నగదు వాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. విచారణ జరిగితే సీజీఎఫ్‌ నిధుల వివరాలు న్యాయస్థానానికి వివరించాల్సి వస్తుందని, అప్పుడు అసలు విషయాలన్నీ బయటపడతాయనే భయంతోనే ఆ ఉత్తర్వులను హడావుడిగా వెనక్కి తీసుకున్నారు.


ఇష్టానుసారం కేటాయింపులు 

ఆలయాల జీర్ణోద్ధరణ పనుల్లోనూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఆలయానికి గరిష్ఠంగా రూ.40 లక్షలకు మించి సీజీఎఫ్‌ నుంచి ఇవ్వకూడదు. అలాగే రూ.5 లక్షల ఆదాయం దాటిన ఆలయాలకు సీజీఎఫ్‌ నిధులు వినియోగించకూడదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల ఆదాయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఇక రూ.40 లక్షల గరిష్ఠ పరిమితిపై నీళ్లు చల్లింది. రాష్ట్రంలోని ఓ ఆలయానికి సీజీఎఫ్‌ నుంచి ఏకంగా రూ.1.75 కోట్లు విడుదల చేశారు. దేవదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని విజయవాడ వన్‌టౌన్‌లోనే రూ.30 కోట్లు ఇచ్చారు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఆలయాలకు కోట్లకు కోట్లు కేటాయిస్తున్నారు. ఇలా సీజీఎఫ్‌ ఖాతాను ఖాళీ చేశారు. జీర్ణోద్ధరణ పనులకు నిధుల్లేకపోయినా ఇటీవల ఆలయాలకు భారీగా మంజూరు చేశారు.


వాటికి నిధులు ఇచ్చేందుకోసం ఎలాగైనా సీజీఎఫ్‌, ఇతర రుసుములు కట్టాలంటూ ఆలయాలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుకున్న ఎఫ్‌డీలను కూడా కొన్ని ఆలయాల్లో డ్రా చేసి రుసుములు చెల్లిస్తున్నారు. ఆలయాల ఖాతాలు పూర్తిగా ఖాళీ అవుతున్నాయి. ఆలయాల్లో అత్యవసరంగా ఏవైనా పనులు చేపట్టాలంటే ఖాతాల్లో రూపాయి కూడా ఉండదు. అయినా సరే అధికారులు ఆలోచించకుండా మొత్తం కట్టాలంటూ ఆలయాలపై కత్తి పెట్టారు. 

Updated Date - 2022-06-24T08:33:30+05:30 IST