విచారణపై అ‘ధిక్కారం!

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

ఉన్నతాధికారుల ఆదేశాలను ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు.

విచారణపై అ‘ధిక్కారం!

ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ

అచూకీలేని ఉద్యోగి స్థానంలో మరొకరికి పోస్టింగ్‌

మృతిచెందిన ఉద్యోగి పోస్టును పొందిన యువతి

ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు

విచారణకు ఆరుసార్లు ఆదేశించినా బేఖాతరు

 

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఉన్నతాధికారుల ఆదేశాలను ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. అడ్డగోలు వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని సూచించినా పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా సెలవులో ఉన్న ఉద్యోగి స్థానంలో మరొకరు, మృతిచెందిన ఉద్యోగి పోస్టులో అనర్హురాలు విధుల్లో కొనసాగుతున్నారు. జిల్లాలో జరిగిన ఈ వ్యహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఇక్కడి అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. 

వైద్య, ఆరోగ్య శాఖలో ఇద్దరు మహిళలు ఆఫీస్‌ సబార్డినేట్స్‌గా విధుల్లో చేరారు. ఈ వ్యవహారం 2016లో జరిగింది. వీరిలో ఒకరు కాపు, మరొకరు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. కాగా ఇద్దరూ ఎస్సీలుగా పేర్కొంటూ ఉద్యోగాల్లో చేరారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా కొందరు ఉద్యోగుల ఫిర్యాదుతో అప్పటి జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు కూడా విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో ఆయన వైద్య, ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. నెలలు గడుస్తున్నా విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో మరికొందరు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటివరకు ఆరుసార్లు ఆదేశాలు వచ్చాయి. అయినా జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోలేదు. తాజాగా మరోసారి ఆదేశాలందినా విచారణకు కదలడం లేదు. 


అక్రమ వ్యవహారాలివే...

ఉమ్మడి విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కేజేపురం పీహెచ్‌సీలో 2005 నుంచి 2009 వరకు డ్రైవర్‌గా పనిచేసిన ఉద్యోగి పరారయ్యాడు. అతని స్థానంలో అధికారులు మరో ఉద్యోగిని నియమించారు. పరారైన ఉద్యోగిని టెర్మినేట్‌/డిస్మిస్‌ చేయకుండానే మరో ఉద్యోగిని నియమించడం నిబంధనలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న ఉద్యోగి కొద్ది కాలానికే మృతిచెందాడు. దీంతో అతడి భార్యకు 2010లో అటెండర్‌ ఉద్యోగం ఇచ్చారు. అయితే ఆమెకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదు. దీనిపై ఆరా తీయగా... తన భర్త స్థానంలో మరో ఉద్యోగి పనిచేస్తున్నట్టు తేలింది. సాధారణంగా చనిపోయిన వ్యక్తి పోస్టు ఖాళీగా ఉంటేనే మరణానంతరం ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు ఆ వ్యక్తి కుటుంబానికి వస్తాయి. అధికారులు ఈ పని చేయకుండానే  మరణించిన డ్రైవర్‌ స్థానంలో మరొకరిని నియమించడంతో మృతుడి భార్యకు ఆర్థిక ప్రయోజనాలు అందలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన అధికారులు.. 2009లో చనిపోయిన వ్యక్తిని 2018లో టెర్మినేట్‌ చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. 

ఇదిలావుండగా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పీహెచ్‌సీలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగి 2010లో మృతి చెందింది. ఆమెకు పిల్లలు లేరు. కానీ వరుసకు మనుమరాలైన యువతి.. తాను కుమార్తెనేనంటూ 2013-14లో ఉద్యోగం పొందారు. దీనిపై ఆ మహిళ కుటుంబ సభ్యులు స్పందనలో ఫిర్యాదు చేయడంతో విచారణకు కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపైనా అధికారులు స్పందించలేదు. అదే విధంగా 2018లో ఏడుగురు నాలుగో తరగతి ఉద్యోగులకు జూనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించారు. వీరిలో ఓ ఉద్యోగిని డీహెచ్‌ నుంచి డీఎంఈవైపు నియమించారు. నిబంధనలకు విరుద్ధమైన ఈ వ్యవహారంపై విచారణ చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ నుంచి ఆదేశాలందాయి. అయినా పట్టించుకోలేదు. 


విచారణకు ఆదేశించాం

దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ విజయలక్ష్మిని వివరణ కోరగా.. పెండింగ్‌లో కొన్ని విచారణలున్న మాట వాస్తవమేనని, ఆ ఫైల్స్‌ సిద్ధం చేయాలని సెక్షన్‌ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. త్వరితగతిన విచారణ పూర్తిచేస్తామని బదులిచ్చారు.

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST