Abn logo
Apr 9 2020 @ 06:10AM

కల్లు కుండకు కరోనా చిల్లు

విక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు

సొసైటీలు కూడా తీర్మానం

అత్యుత్సాహంతో గెలలు కోయిస్తున్న ఎక్సైజ్‌

లాక్‌డౌన్‌ తర్వాత ఉపాధికి దెబ్బ

లబోదిబోమంటున్న గీత కార్మికులు


నెల్లూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : కరోనా ప్రభావంతో అన్ని వర్గాలు ఉపాధి కోల్పోయాయి. ప్రధానంగా కల్లు గీత కార్మికులకు వేసవిలోనే ఎక్కువ ఉపాధి దొరుకుతుంది. అలాంటి ఈ సమయంలో కరోనా వారి బతుకుపై దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్‌  అమలులో ఉన్నంతకాలం కల్లు దుకాణా లు తెరిస్తే గుంపులుగా చేరే ప్రమాదముంది. కాబట్టి కల్లు విక్రయించరాదని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారం ఎక్కడికక్కడ కల్లుగీత సొసైటీ సభ్యులు కూడా తీర్మానం చేశారు.


ఎక్సైజ్‌ పోలీసుల అత్యుత్సాహం

ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా గీత కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కల్లు అమ్మకూడదని ఉన్నతాధికారులు ఆదేశిస్తే అసలు తాటిచెట్లకు గెలలు లేకుండా చేస్తున్నారు. ఎవరైనా కల్లుగీసి అమ్ముతా రేమోనన్న అనుమానంతో గెలలను కోయించేస్తున్నారు. ఫలితంగా ఇక ఈ ఏడాది ఆ చెట్లకు గీత గీయలేని పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జూన్‌ వరకు తాటి, టెంకాయ, ఈత కల్లు వస్తుంటాయి. ఈ లోగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే మిగిలిన సమయంలోనైనా వ్యాపా రం చేసుకొని బతుకుదామనుకున్న కార్మికులకు ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది.


రెండు విధాలా నష్టం

అప్పుల పాలైన ఇటు కల్లు విక్రయాలు ఆగి పోయి, అటు చెట్ల లీజుకు కట్టిన డబ్బులు పోయి కార్మికులు అప్పులపాల వుతున్నారు.  సహజంగా ఫిబ్రవరి నుంచి కల్లు సీజన్‌ ప్రారంభమవుతుంది. ఎక్సైజ్‌ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో తాటి, టెంకాయ, ఈత చెట్లు కలిపి సుమారు లక్ష వరకు ఉన్నాయి. అలానే సుమారు పది వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే అనధికారికంగా చెట్లు, ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య ఇంకా ఎక్కు వే ఉంటుందని గీత కార్మికులు చెబుతున్నారు. ఇక ఆయా ప్రాంతాన్ని చెట్టును బట్టి సీజన్‌కు ఒక్కో చెట్టుకు రూ.వెయ్యి వరకు చెల్లించి రైతుల వద్ద నుంచి కార్మికులు లీజుకు తీసుకుంటారు. దాదాపు జూన్‌ వరకు కల్లు సీజన్‌ ఉంటుంది. ఇప్పటికే లీజుకు తీసుకున్న చెట్లకు డబ్బులు చెల్లించారు. ఇక లాక్‌డౌన్‌ తర్వాతనైనా కల్లు గీసుకుందామనుకుంటే ఎక్సైజ్‌, పోలీసులు ఏకంగా గెలలను కోయించేస్తుండడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


గెలలు కోస్తే ఎలా..?

గెలలకు రోజుకొక పూటైనా కల్లు గీస్తుంటేనే అవి కల్లును ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే తాము కల్లు అమ్మకాలు జరపబోమని, అసలు కుండలు కూడా చెట్లకు కట్టమని, కేవలం గీత మాత్రమే వేసుకుంటామని కార్మికులు వేడుకుం టున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇక మరికొన్ని చోట్ల గెలలు కోసేయకుండా ఉండడానికి క్షేత్రస్థాయి ఎక్సైజ్‌ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల ఉద్ధేశ పూర్వకంగా తమను వేధిస్తున్నారన్న విమర్శలు  కూడా వినిపిస్తున్నాయి. 


బుచ్చిలో కార్మికుల ఆందోళన

ఇటీవల బుచ్చిలో  కొందరు గీత కార్మికులు ఎక్సైజ్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేయడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ కూలీలతో సమానమైన గీత కార్మికులకు అండగా నిలవాల్సిన అధికారులు వారి ఉపాధిపై దెబ్బ కొట్టడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కడైనా కల్లు అమ్ముతుంటే అలాంటి వారిని పట్టుకొని శిక్షించాలి తప్ప .. అసలు వారికి ఉపాధి లేకుండా చేయడం ఎంతవరకు సబబని పలువురు గీత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement