ఇదేమీ నవ్వులాట కాదు!

ABN , First Publish Date - 2022-08-11T08:56:32+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వికటించిన కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయమై వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని బుధవారం కేరళ హైకోర్టు

ఇదేమీ నవ్వులాట కాదు!

వ్యాక్సిన్‌ వికటించి మృతి చెందితే పరిహారం చెల్లించాలి

వెంటనే మార్గదర్శకాలు రూపొందించండి

కేంద్రానికి కేరళ హైకోర్టు ఆదేశం 


కోచి, ఆగస్టు 10: కరోనా వ్యాక్సిన్‌ వికటించిన కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయమై వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని బుధవారం కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ  ప్రాధికార సంస్థను న్యాయమూర్తి జస్టిస్‌ వి.జి.అరుణ్‌ ఆదేశించారు. ‘‘కొవిడ్‌  వ్యాక్సిన్‌ రియాక్షన్‌ ఇవ్వడంతో మరణించిన సంఘటనలు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఈ కారణంగా మృతి చెం దిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉం టుంది. వాటిని ఆధారం చేసుకొనే కోర్టు ఉత్తర్వులు ఇవ్వగలుగుతుంది.


ఇదేమీ నవ్వులాట కాదు. చాలా తీవ్రమైన విషయం’’ అని న్యాయమూర్తి మౌఖికంగా వ్యాఖ్యానించారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వ్యక్తి గత ఏడాది ఆగస్టులో మరణించాడు. కుటుంబ యజమాని మరణించడంతో ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన భార్య న్యాయస్థానాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పరిహారం చెల్లించే విషయమై మార్గదర్శకాలు రూపొందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. దాంతో రెండు వారాల్లో వీటిని కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30వతేదీకి వాయిదా వేశారు. 

Updated Date - 2022-08-11T08:56:32+05:30 IST