బత్తాయిపై ‘కరోనా’ కాటు

ABN , First Publish Date - 2020-04-01T08:43:17+05:30 IST

కరోనా ప్రభావంతో బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక్క నల్లగొండ

బత్తాయిపై ‘కరోనా’ కాటు

  • రూ.176 కోట్ల ఉత్పత్తులపై ప్రభావం
  • ప్రభుత్వ ఆదేశంతో నిలిచిన ఎగుమతులు 
  • ఆందోళనలో నల్లగొండ జిల్లా రైతులు
  • సకాలంలో తెంపక రాలిపోతున్న కాయలు
  • రాష్ట్రంలో నిమ్మ రైతులదీ అదే దుస్థితి 
  • రాష్ట్రంలో మాత్రమే బత్తాయి విక్రయం 


నల్లగొండ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే రూ.176కోట్ల విలువైన ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ కేంద్రంగా విక్రయాలు సాగుతాయి. తాజాగా పంట చేతికి రాగా.. రవాణా సౌకర్యం లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు సీ-విటమిన్‌ అధికంగా ఉండే బత్తాయి, నిమ్మ వాడకం ఎంతో అవసరమని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. మద్దతు ధరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ప్రభుత్వం బత్తాయి, నిమ్మ విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని; మార్కెట్లతో పాటు రైతు బజార్లలో విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో కత్తెర కాయ వచ్చింది.


సీజన్‌ కాయ కంటే కత్తెర కాయకు అధికంగా లాభాలు రావాల్సి ఉండగా; ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో పెద్దగా బత్తాయి, నిమ్మ వాడకం ఉండదు. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వాడకం అధికంగా ఉంటుంది. వాస్తవానికి కత్తెరలో వచ్చిన బత్తాయి కాయ టన్నుకు రూ.35-40 వేల వరకు ధర పలుకుతుంది. ఇప్పుడు రూ.12వేలకు మించి రాని పరిస్థితులున్నాయి. మరోవైపు 10 టన్నుల బత్తాయి కాయ తెంపాలంటే దాదాపు 30-40మంది కూలీలు అవసరమవుతారు. కరోనా వల్ల కూలీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే పరిస్థితి లేదు. స్థానికంగా కూలీలు దొరకని పరిస్థితి. దీంతో కాయలు రాలిపోతున్నాయి. జిల్లాలో 46,800 ఎకరాల్లో బత్తాయి సాగు చేయగా, కత్తెర కాయ 44వేల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిమ్మ 16వేల ఎకరాల్లో సాగవుతుండగా 52వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుంది. కాయ రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-04-01T08:43:17+05:30 IST