నోటితో మద్దతు..నొసలుతో వెక్కిరింపు

ABN , First Publish Date - 2022-05-29T06:02:47+05:30 IST

నోటితో మద్దతు..నొసలుతో వెక్కిరింపు

నోటితో మద్దతు..నొసలుతో వెక్కిరింపు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


  • ఎస్సీ వర్గీకరణపై బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చిత్తశుద్ధి లేదు
  • రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు!
  • మాదిగల మహాసంగ్రామ యాత్రలో మంద కృష్ణ మాదిగ

మేడ్చల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గీకరణపై ఏ ఒక్క పార్టీకి చిత్తశుద్ధి లేదని.. నోటితో మద్దతు తెలుపుతూ నొసటితో వెక్కిరిస్తున్నారని.. మాదిగల్లో చైతన్యం నింపేందుకే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మాదిగల మహాసంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌లో శనివారం రాత్రి ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రప్రభుత్వంపై చేపట్టిన మాదిగల మహాసంగ్రామ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూనే.. ఆచరణలోకి వచ్చే సరికి తప్పించుకుంటున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్‌, బీజేపీలకు గతంలో ఎమ్మార్పీఎస్‌ అండగా నిలిచిందని, అయినప్పటికీ హామీని నెరవేరడం లేదన్నారు. మాదిగలు అధిక జనాభా గల రాష్ట్రంలో ఒక్క మాదిగ మంత్రి కూడా లేడని, 48 గంటల్లో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి వర్గీకరణ సాధించుకువస్తామని, నిండు శాసనసభలో కేసీఆర్‌ ప్రకటించి ఐదేళ్లయినా అమలుకు నోచుకోవడం లేదన్నారు. అన్ని పార్టీల వారు అవసరమైనప్పుడు మాదిగ జాతిని ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని, ఉద్యోగాల నోటిఫికేషన్‌ను అందుకే ప్రకటించారని, ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటే మాదిగలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. జాతి కోసం పాదయాత్రలు చేసిన ఘనత ఎమ్మార్పీఎస్‌కు ఉందని, నేడు కొందరు తమ స్వార్ధ రాజకీయ భవిష్యత్‌ కోసం పాదయాత్రలు చేస్తున్నారన్నారు. నిజాయితీ, పట్టుదలతో 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామన్నారు. 120 రోజుల పాటు 119 నియోజకవర్గాల్లో మహాసంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ నరేష్‌, నాయకులు ఎన్‌.వై.అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:02:47+05:30 IST