ఫైబ్రాయిడ్స్‌కు సర్జరీ ఒక్కటే పరిష్కారమా? ప్రత్యామ్నాయం ఉందా?

ABN , First Publish Date - 2022-06-02T22:05:01+05:30 IST

నాకు నలభై ఏళ్లు. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్‌ ఉన్నాయని పరీక్షల్లో తేలింది. వీటిని సర్జరీతో తొలగించుకోక తప్పదా? వీటికి ప్రత్యామ్నాయ చికిత్సలు లేవా?

ఫైబ్రాయిడ్స్‌కు సర్జరీ ఒక్కటే పరిష్కారమా? ప్రత్యామ్నాయం ఉందా?

ఆంధ్రజ్యోతి(02-06-2022)

ప్రశ్న: నాకు నలభై ఏళ్లు. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్‌ ఉన్నాయని పరీక్షల్లో తేలింది. వీటిని సర్జరీతో తొలగించుకోక తప్పదా? వీటికి ప్రత్యామ్నాయ చికిత్సలు లేవా? 

    

- ఓ సోదరి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: నలభై ఏళ్ల వయసులో, చిన్న చిన్న ఫ్రైబ్రాయిడ్స్‌ ఏర్పడినప్పటికీ, ఎలాంటి రక్తస్రావం, నొప్పి, అసౌకర్యం లేకపోతే సర్జరీ చేయించుకోవలసిన అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్‌ సైజు, వాటితో తలెత్తే సమస్యలను బట్టి సర్జరీ అవసరమా, లేదా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. అయితే ఫైబ్రాయిడ్స్‌ ఉన్నంత మాత్రాన సర్జరీ చేయించుకోవలసిన అవసరం లేదు. బదులుగా ఇతరత్రా చికిత్సలు కూడా తీసుకోవచ్చు. చిన్న చిన్న ఫైబ్రాయిడ్లను కలిగి ఉండీ, గర్భాశయం చిన్నదిగా ఉండీ, అధిక రక్తస్రావం అవుతూ ఉంటే మెడికల్‌ ట్రీట్మెంట్‌ ప్రయత్నించవచ్చు. ఈ చికిత్సలో భాగంగా ‘యూలిప్రిస్టాల్‌’ అనే మాత్రలను మూడు నెలల పాటు వాడుకోవచ్చు. ఈ మాత్రలతో కాలేయం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి నెలా కాలేయ పరీక్షలు చేయించుకుంటూ, ఫలితాన్ని బట్టి మాత్రల వాడకాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఈ మాత్రలతో కొందరికి ఉపశమనం దొరుకుతుంది. కొందరికి ఈ మాత్రలు పని చేయకపోవచ్చు.

 

సర్జరీలు ఈ సందర్భంలో: నొప్పితో పాటు, రక్తస్రావం అవుతూ ఉంటే, ఫైబ్రాయిడ్‌ స్థానాన్ని, పరిమాణాన్నీ పరీక్షించవలసి ఉంటుంది. ఒకవేళ ఫైబ్రాయిడ్‌ గర్భాశయ క్యావిటీలో ఏర్పడితే, సర్జరీ తప్పనిసరి అవుతుంది. సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్‌లను హిస్ట్రోస్కోపీ, సబ్‌మ్యూకస్‌ ఇంట్రామ్యూరల్‌ అయితే ల్యాప్రోస్కోపీ, ఓపెన్‌ సర్జరీలను వైద్యులు ఎంచుకుంటారు. కేవలం ఫైబ్రాయిడ్‌నే తీయించుకోవాలనుకుంటే, అలాంటి సర్జరీని ఎంచుకోవచ్చు. పిల్లలు కలిగి ఉన్న వాళ్లు వద్దు అనుకుంటే గర్భాశయాన్ని కూడా తొలగించుకోవచ్చు. కానీ నలభై ఏళ్ల వయసులో గర్భాశయంతో పాటు ఓవరీలను తీయించుకోకూడదు.


మెరీనా పరికరం: ‘మెరీనా’ అనే ఇంట్రాయుటెరైన్‌ డివై్‌సతో కూడా ఈ సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ పరికరం ద్వారా విడుదలయ్యే హార్మోన్‌ వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ పెరుగుదలకు తోడ్పడే లోపలి పొర పెరగకుండా ఆగిపోతుంది. దాంతో రక్తస్రావం తగ్గిపోతుంది. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్‌ ఉండీ, రక్తస్రావం ఎక్కువగా ఉన్న వాళ్లు ఈ పరికరాన్ని ఎంచుకోవచ్చు. మెనోపాజ్‌ దశకు చేరువలో ఉండీ, గర్భాశయం చిన్నదిగానే ఉండీ, ఫైబ్రాయిడ్స్‌తో ఎటువంటి ఇతర అసౌకర్యాలేవీ లేనివాళ్లు మెడికల్‌ ట్రీట్మెంట్‌ను అనుసరిస్తూ, కొంత కాలం పాటు వేచి చూడవచ్చు. ఈ చికిత్సతో ఫలితం లేనప్పుడు, అంతిమంగా మాత్రమే సర్జరీని ఎంచుకోవాలి. ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉండి, గర్భాశయం 10 సెంటీమీటర్ల కంటే పెద్దదిగా ఉన్నప్పుడు మాత్రలతో పాటు, మెరీనా పరికరం కూడా పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ వద్దు అనుకునేవాళ్లు యుటెరిన్‌ ఫైబ్రాయిడ్‌ ఎంబొలైజేషన్‌ను కూడా ఎంచుకోవచ్చు. అలాగే ఎమ్మారై హైఫు ద్వారా ఫైబ్రాయిడ్లను కరిగించుకోవచ్చు. అయితే ఈ చికిత్స కూడా ఫైబ్రాయిడ్‌ ఏర్పడిన ప్రదేశం, పరిమాణాల మీదే ఈ చికిత్స ఫలితం ఆధారపడి ఉంటుంది. 


డా. ఇందిరా రాణిశ్రేయా శ్రద్ధా 

ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్‌

డీడీహెచ్‌ ఎదురుగా, 

విద్యానగర్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-06-02T22:05:01+05:30 IST