ఇష్టముంటేనే ‘నామినీ’ పేరు: సెబీ

ABN , First Publish Date - 2021-07-24T06:55:39+05:30 IST

మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి కొత్తగా ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించే ఇన్వెస్టర్లు తమకు ఇష్టం ఉంటేనే నామినీ పేరు సూచించవచ్చు.

ఇష్టముంటేనే ‘నామినీ’ పేరు: సెబీ

న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి కొత్తగా ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించే ఇన్వెస్టర్లు తమకు ఇష్టం ఉంటేనే నామినీ పేరు సూచించవచ్చు. ఇష్టం లేకపోతే నామినీ పేరు పేర్కొనాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఆప్షన్లకు అనుగుణంగా రెండు రకాల దరఖాస్తు ఫారాలను సెబీ సిద్ధం చేసింది. ఈ దరఖాస్తు ఫారాలు లేని కొత్త ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలను యాక్టివేట్‌ చేయవద్దని బ్రోకర్లు, డిపాజిటరీ సంస్థలను కోరింది. 


ఈ నామినేషన్‌, డిక్లరేషన్‌ ఫారాల మీద ఖాతాదారులు స్వయంగా సంతకాలు చేయాలి. ఇందుకు సాక్షుల సంతకాలు అవసరం లేదని సెబీ స్పష్టం చేసింది. ఖాతాదారుడు వేలి ముద్ర వేస్తే మాత్రం సాక్షి సంతకం తప్పనిసరి. ఈ-సిగ్నేచర్‌తో ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌, డిక్లరేషన్‌ ఫారాలు సమర్పించవచ్చు. ఇందుకు కూడా సాక్షుల సంతకాలు అవసరం లేదు.  ఇప్పటికే ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలు ఉన్న ఇన్వెస్టర్లు కూడా వచ్చే ఏడాది మార్చి  నెలాఖరు లోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభింప చేస్తారు.

Updated Date - 2021-07-24T06:55:39+05:30 IST