Ops మరో పదవికి గండం?

ABN , First Publish Date - 2022-07-17T15:44:37+05:30 IST

అన్నాడీఎంకే శాసనసభ సభ్యుల సమావేశం ఆదివారం సాయంత్రం అడయార్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో జరుగనుంది. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు

Ops మరో పదవికి గండం?

- నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం

- తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి ఈపీఎస్‌ నేతృత్వం

- సుప్రీంకోర్టులో పన్నీర్‌ సెల్వం అప్పీలు


చెన్నై, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభ సభ్యుల సమావేశం ఆదివారం సాయంత్రం అడయార్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో జరుగనుంది. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) అధ్యక్షతన జరుగనున్ను ఈ సమావేశంలో ఓపీఎస్ ను అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఉపనాయకుడి పదవి నుంచి తొలగించే విషయంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) వర్గానికి చెందిన కార్యకర్తలు ఈపీఎస్‌ వర్గానికి చెందిన కార్యకర్తలు ఘర్షణపడటంతో రెవెన్యూ అధికారులు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి సీలు వేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అడయార్‌ గ్రీన్‌వేస్ రోడ్డులోని ఈపీఎస్‌ నివాసంలో ఈ సమావేశాన్ని జరపాలని అనుకున్నారు. అయితే ప్రభు త్వం కేటాయించిన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఎలా జరుపుతారంటూ ఓపీఎస్‌ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్టార్‌హోటల్‌ వైపు మొగ్గు చూపారు. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యులు ఓటు వేసే విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. అదే సమయంలో ఇటీవల సర్వసభ్యమండలి తీర్మానం ద్వారా పార్టీ సమన్వయకర్త, కోశాధికారి పదవుల నుండి తొలగింపబడిన ఓపీఎస్‏ను అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనాయకుడి పదవి నుంచి తొలగించే విఫయంపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే శాసనసభ్యులందరూ ఓపీఎస్ ను తొలగించే తీర్మానంపై సంతకం చేసినట్లయితే ఆ తీర్మానాన్ని స్పీకర్‌ అప్పావుకు సమర్పిస్తారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా మధ్యాహ్నం మూడు గంటలకే రావాలని ఈపీఎస్‌ ఆదేశించారు. ప్రస్తుతం సొంత జిల్లా సేలంలో పర్యటిస్తున్న ఎడప్పాడి ఆదివారం మధ్యాహ్నం  నగరానికి చేరుకోనున్నారు.


సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఓపీఎస్‌...

ఈ నెల 11న ఈపీఎస్‌ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య మండలి సమావేశానికి అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓపీఎస్‌ సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్‌ వేశారు. పార్టీ సమన్వయకర్తగా ఉన్న తన అనుమతి లేకుండా జరిపిన ఆ సమావేశం చెల్లదని, సమావేశంలో చేసిన తీర్మానాలు పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని ప్రకటించాలని ఆ పిటిషన్‌లో కోరారు. అంతే కాకుండా పార్టీ నియమావళి ప్రకారం సర్వసభ్యమండలి సమావేశం జరిపేందుకు 15 రోజులకు ముందు నోటీసులు జారీ చేయాల్సి ఉందని, ఈపీఎస్‌ వర్గీయులు ఈ నియమాన్ని పాటించలేదని ఓపీఎస్‌ ఆరోపించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 11న జరిగిన సర్వసభ్యమండలి చెల్లదంటూ ఉత్తర్వులివ్వాలని పిటిషన్‌లో అభ్యర్థించగా, ఈ పిటిషన్‌ త్వరలో విచారణకు రానుంది. సర్వసభ్యమండలి సమావేశానికి వ్యతిరేకంగా ఇదివరకే రెండుసార్లు హైకోర్టులో, ఓసారి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన ఓపీఎస్‏కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-17T15:44:37+05:30 IST